విజయవాడ : శాంతి భద్రతల కారణంగా నామినేషన్లు వేయడం సాధ్యం కాని పట్టణ, స్థానిక సంస్థల్లో నామినేషన్ దాఖలుకు గడువు పొడిగించే విషయం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఇసి) పరిశీలించాలని సుప్రీం కోర్టు ఆదేశించడం హర్షణీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. దీనికి సంబంధించి బుధవారం వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. సుప్రీం ఆదేశానికనుగుణంగా ఆయా స్థానిక సంస్థల్లో నామినేషన్ దాఖలు చేయడానికి ఎస్ఇసి గడువు పెంచాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నదన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులను నామినేషన్ వేయనీయకుండా అధికార కూటమి కార్యకర్తలు, కొన్నిచోట్ల పోలీసులు సైతం అడ్డుపడిన ఘటనలు మీడియాలో వెల్లడైనాయన్నారు. సిపిఐ(యం) అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా తిరుపతి కార్పొరేషన్లో అడ్డుకున్నారని తెలిపారు. కనిగిరి మున్సిపాలిటీలో నామినేషన్ రశీదులను చించి స్క్రూటినీ కి పోనీయకుండా అడ్డుకున్నారని ... ఇలాంటి ఘటనలు వైసిపి సహా ఇతర ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల విషయంలోనూ జరిగాయని వివరించారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం నామినేషన్ దాఖలుకు గడువును పొడిగించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నదన్నారు.
మండల, జిల్లా పరిషత్లలోనూ అదే గూండాగిరి ....
రానున్న జెడ్పీటిసీ, ఎంపీటిసి నామినేషన్లను కూడా నేడు అనేక చోట్ల అధికార పార్టీ అడ్డుకున్నదని వి.శ్రీనివాసరావు తెలిపారు. ఒక వైపు సుప్రీం కోర్టు తీర్పు వస్తుండగానే ... మరో వైపు మున్సిపల్ తరహాలోనూ మండల కేంద్రాల్లోనూ దౌర్జన్యం చేసి ఏకపక్షం చేసుకుంటున్నారని వివరించారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దారి తప్పి వ్యవహరించే అధికార యంత్రాంగం, పోలీసులపై చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.








కామెంట్లు (0)