సిపిఎం రాష్ట్ర కమిటీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తిరుపతి విమానాశ్రయాన్ని పిపిపి పద్ధతిలో ప్రయివేటు కంపెనీకి అప్పగించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తిరుపతి ఎయిర్పోర్టును ప్రభుత్వ రంగంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) పరిధిలోనే కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు. వ్యూహాత్మకంగా విలువైన జాతీయ సంపదలో ఎయిర్‌పోర్టులు ముఖ్యభాగమని, అవి ప్రభుత్వ రంగంలో ఉంటేనే దేశానికి మంచిదని తెలిపారు. అందుకు భిన్నంగా 11 ఎయిర్‌పోర్టులను పిపిపి విధానంలో ప్రయివేటుపరం చేయాలని ఇటీవల సమావేశమైన కేంద్ర ప్రభుత్వ కమిటీ నిర్ణయించినట్లు వార్తలొచ్చాయని పేర్కొన్నారు. ప్రఖ్యాత తిరుపతి విమానాశ్రయం వాటిలో ఉండడం ఆందోళనకరమని, తిరుపతి విమానాశ్రయం ద్వారా ఇప్పటికే ఏటా 10 లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని వివరించారు. ప్రధాన నగరాలతో ఇప్పటికే కనెక్టివిటీ కలిగి ఉన్న తిరుపతికి ఇంకొన్ని విమానయాన సంస్థలు కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న తిరుపతి విమానాశ్రయాన్ని ఇంకా మెరుగుపర్చాల్సింది పోయి ప్రయివేటుకు ఇవ్వాలనుకోవడం తగదని విమర్శించారు. తిరుపతిలో విమానాశ్రయం ప్రభుత్వ అజమాయిషీలో ఉంటేనే యాత్రికులకు సౌకర్యవంతంగానూ, అదనపు భారాలు పడకుండా వుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని తిరుపతి విమానాశ్రయం ఎఎఐ పరిధిలోనే కొనసాగేలా చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేకించి తిరుపతి జిల్లా ప్రజానీకం దీనిపై గళం విప్పి కాపాడుకోడానికి ముందుకు రావాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.








కామెంట్‌లు (0)