గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు..
విశాఖ మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను పునరుద్దరించాలి : సిపిఐ(యం)
విజయవాడ : తల్లిదండ్రుల అనుమతి లేకుండా గిరిజన విద్యార్థులను వేరే ప్రాంతాలకు తరలించడం అత్యంత బాధ్యతారాహిత్యం అని, విశాఖపట్నం మారికవలస గిరిజన గురుకుల (ఎపిటిడబ్ల్యూఆర్) పాఠశాలలో చదువుతున్న 480 మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, పాఠశాల తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. 25 వ తేదీ అర్ధరాత్రి నుంచి తల్లిదండ్రులకు ఫోన్‌లు చేసి, 26వ తేదీ తెల్లవారుజామున విద్యార్థులను బస్సుల్లో బలవంతంగా తరలించడం, పోలీసులతో భయభ్రాంతులకు గురిచేయడం, వారి సామాన్లను బయటకు పడేయడం వంటి చర్యలు అత్యంత బాధ్యతారాహిత్యం అని అన్నారు. సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ పేరుతో కోచింగ్ సెంటర్ పెట్టడానికి గిరిజన పాఠశాలను తరలించడం విజ్ఞత కాదు అని చెప్పారు. విశాఖలో ఇందుకు అనేక భవనాలున్నాయని, ఖాళీ స్థలాలున్నాయని అన్నారు. ఇంటర్‌లో ప్రవేశ పరీక్షల శిక్షణ కోసం వాటిని ఉపయోగించుకోవచ్చునని, దీనికోసం మరొక పాఠశాలను బలిచేయడం సరికాదు అని చెప్పారు. 2004 లో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ పాఠశాలను కొనసాగించాలన్నారు. ఇందుకోసం తల్లిదండ్రులు పాడేరులో ఐటిడిఎ వద్ద ఆందోళన చేస్తున్నారని తెలిపారు. 480 మంది గిరిజన విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను గౌరవించి, విశాఖపట్నం మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను పునరుద్దరించాలని, సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను మరొకచోట ప్రారంభించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)