సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

దళిత, ఆదివాసీ విద్యార్థులను గురుకులాల నుండి తరలించొద్దు : సిపిఐ(యం)

2 గంటల క్రితం

State government must abandon its policy of coercion: CPI(M) State Committee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 03:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

విజయవాడ : దళిత, ఆదివాసీల కోసం ఉద్దేశించిన స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సంస్థలను ప్రభుత్వమే నిపుణులను నియమించి నిర్వహించాలని, కార్పొరేట్ యాజమాన్యాలకు ఇవ్వొద్దనీ, ఆ పేరుతో దళిత, ఆదివాసీ విద్యార్థులను గురుకులాల నుండి తరలించొద్దు అని సిపిఐ(యం) డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సోమవారం ప్రకటన విడుదల చేశారు. పిపిపి పేరుతో స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అనే ఆశ చూపించి ప్రభుత్వం స్కూళ్ళు, కాలేజీల భవనాలు, స్థలాలు ఫిజిక్స్‌వాల, నారాయణ కోచింగ్ సెంటర్‌లకు దారాదత్తం చేయవద్దని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నదన్నారు. రాష్ట్రంలో 12 చోట్ల దళిత, గిరిజన విద్యార్థులకు ఐఐటీ, నీట్, జెఈఈ పరీక్షల్లో శిక్షణ ఇవ్వడానికి అదే తరగతులకు చెందిన విద్యార్థులను బలిచేయకుండా ప్రభుత్వమే ప్రత్యామ్నాయ భవనాలలో నిర్వహించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదన్నారు. మారికవలస సహా అనేక చోట్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్యాయం చేయొద్దని ప్రతిఘటిస్తున్నారని, అయినా కార్పొరేట్ల కోసం తల్లిదండ్రులను లెక్క చేయకుండా బలవంతంగా చిన్న పిల్లలని కూడా చూడకుండా రాత్రికి రాత్రి తరలించడం అమానుషం అని ధ్వజమెత్తారు. ఇలాంటి దళిత, గిరిజన వ్యతిరేక చర్యలను విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. విద్యను అందించడానికి విశాఖ జిల్లా మారికవలస ప్రాంతంలో స్కూలు, కాలేజీ ఏర్పాటు చేయడం జరిగిందని, అనేకమంది ఈ విద్యాసంస్థల్లో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సంపాదించారని తెలిపారు. ఇప్పటికే ఈ విద్యాసంస్థలో జెఈఈ మెయిన్స్, నీట్ వంటి కోచింగ్ విద్యార్థులకు అందిస్తున్నారని, దానిలో లోపాలేమైనా ఉంటే సరిదిద్దాల్సింది పోయి మొత్తం విద్యార్థులు లేకుండా ఖాళీచేసి కోచింగ్ సెంటర్‌లకు అప్పగించడం సరైంది కాదు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ 69 తీసుకొచ్చిందన్నారు. కనీసం అక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించిన సందర్భం కూడా లేదు అని తెలిపారు. అకస్మాత్తుగా వందలాది మంది విద్యార్థులను అనేక ఇబ్బందులు పెట్టి తల్లిదండ్రులకు సమాచారం లేకుండా ఉన్నఫళంగా పాడేరు సహా అన్ని ప్రాంతాలకు బస్సులో తరలించారని, దీనిని ఆగ్రహించిన తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించారనీ, దీనికి ఆదివాసీ గిరిజన సంఘం. కెవిపిఎస్ సంపూర్ణమైన మద్దతు తెలియజేశాయని వివరించారు. నిర్బంధం ప్రయోగించినా వెనకాడకుండా విద్యార్థుల తల్లిదండ్రుల పోరాట ఫలితంగా మారిక వలసలో అదే స్కూలులో తిరిగి అడ్మిషన్ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. నేడు మరలా అదే క్యాంపస్ దగ్గరలో ఉన్న విద్యార్థినులను ఖాళీ చేయించాలని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఈ విషయం తెలిసిన విద్యార్థినుల తల్లిదండ్రులు నిరసన తెలియజేస్తున్నారనీ, దీనికి మద్దతు ఇవ్వడానికి వెళ్ళిన ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పి.అప్పలనర్స, సిఐటియు నాయకులు రాజ్‌కుమార్, విశాఖజిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి.అజయ్, ప్రగతి తదితరులను అరెస్టు చేశారని, ఇది పచ్చి అప్రజాస్వామిక చర్య అని ధ్వజమెత్తారు. గిరిజన విద్యకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాల్సిందిపోయి ఇలాంటి చర్యలవల్ల గిరిజనులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఏజెన్సీ ప్రాంతానికి విద్యకు సంబంధించి ట్రైబల్ అడ్వయిజరీ కమిటీలో చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా ఈ విధానాలు మానుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నదని, లేనట్లయితే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని వి.శ్రీనివాసరావు హెచ్చరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్