ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉండవల్లిలో బలవంతపు భూసేకరణ తగదు : సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ

2 గంటల క్రితం

Forced land acquisition in Undavalli is inappropriate: CPI(M) State Committee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 12:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రైతులపై పోలీసుల దౌర్జన్యానికి ఖండన

  • రైతులకు న్యాయంగా నష్టపరిహారం ఇవ్వాలి


విజయవాడ : రాజధాని అమరావతిలోని ఉండవల్లిలో రెండున్నర ఎకరాలకు పైగా రైతుల భూమిని దౌర్జన్యంగా సేకరించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. దీనికి సంబంధించి ఆదివారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు ఆర్డర్‌ పై రైతులతో సామరస్యంగా చర్చలు జరిపి వారికి న్యాయంగా నష్టపరిహారం చెల్లించాలని, రైతులపై దౌర్జన్యం చేసి అవమానకరంగా మాట్లాడిన పోలీసు, రెవిన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నదన్నారు. ఉండవల్లిలో ఎకరం భూమి ఐదు నుండి ఏడు కోట్ల రూపాయలకు పైగా ఉండగా, ఎకరం విలువ రూ. కోటి 18 లక్షలుగా లెక్క గట్టి, రెండు కోట్ల 62 లక్షల రూపాయలకు అవార్డు ఇచ్చి, ఆగమేఘాల మీద దౌర్జన్యంగా భూములు లాక్కోవటం అక్రమం అని అన్నారు. మహిళలతో సహా రైతులను నిర్బంధించి, చేతికొచ్చిన పంటను నాశనం చేసి బుల్డోజర్లతో అప్పటికప్పుడే రోడ్డు వేయడానికి ప్రయత్నించటం అన్యాయమన్నారు. ప్రభుత్వం, సిఆర్‌డిఏ రైతులతో చర్చలు జరిపి న్యాయమైన పరిహారాన్ని రైతులకు చెల్లించి భూములు స్వాధీనం చేసుకుని రోడ్డు వేసుకోవటానికి అవకాశం ఉన్నప్పటికీ, దౌర్జన్యపూర్వకంగా వ్యవహరించడం గర్హనీయమన్నారు. ఇప్పటికైనా రైతులతో చర్చలు జరిపి, వారికి మార్కెట్ విలువకు అనుగుణంగా న్యాయమైన పరిహారం చెల్లించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
cpim letter


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్