విజయవాడ : ఉపాధిని దెబ్బకొట్టే జి రాంజీ పథకం ప్రారంభానికి వస్తున్న కేంద్ర మంత్రి పర్యటనను నిరసించాలని సిపిఐ(యం) పిలుపునిచ్చింది. వ్యవసాయ కార్మికులకు పని హక్కుగా వున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్తగా తెచ్చిన పథకం విబి గ్రాం జి ని మన రాష్ట్రం నుండే ప్రారంభించడానికి జూలై 1న వస్తున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పర్యటనను నిరసించాలని సిపిఐ(యం) పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి శుక్రవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో కమ్యూనిస్టుల ఒత్తిడితో తెచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బలహీనం చేస్తూ దానికి నిధులు తగ్గిస్తూ వచ్చిందన్నారు. ఒకేసారి రద్దు చేస్తే పేదల్లో వ్యతిరేకత వస్తుందని దశలవారీగా రద్దు చేయడం కోసం జీ రాంజీ జి తెచ్చిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 90:10 శాతంగా ఉన్న నిధులను 60:40 శాతంగా మార్చాయని ఆరోపించారు. జి రాంజీ ని పార్లమెంటులో బలపరిచిన తెలుగుదేశం పార్టీ మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై రూ.4000 కోట్ల అదనపు భారం పడుతుందని చెబుతుందనీ, అంత భారం ప్రభుత్వం భరించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారని .... జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన అనంతపురం జిల్లాలోనే జీ రాంజీని ప్రారంభించడం రాష్ట్రాన్ని అవమానించడమేనని అన్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నదన్నారు. కేంద్ర మంత్రి పర్యటనను నిరసించాలని గ్రామీణ పేదలకు, వ్యవసాయ కార్మికులకు, రైతులకు పిలుపునిస్తున్నదన్నారు. రాష్ట్రంలో పట్టణీకరణ, వలసలు పెరుగుతున్న దృష్ట్యా పాత పథకాన్ని పునరుద్దరించి పట్టణాలకు కూడా విస్తరించాలని డిమాండ్ చేస్తున్నదన్నారు. ఉపాధి పథకంలో అవినీతి ఉందన్న పేరుతో ఫేస్‌యాప్ పెట్టి కూలీలను వేధిస్తున్నారని తెలిపారు. ఉన్నత స్థాయిలో అవినీతిని అరికట్టకుండా ఉపాధి కూలీలపై నెపం వేయడం సమంజసం కాదు అని చెప్పారు. ఆ పేరుతో ఫేస్‌యాప్ పెట్టడం వల్ల పని ప్రదేశాల్లో నెట్ లేనందున పనిచేసే కూలి దక్కని పరిస్థితి ఏర్పడుతుందని, అందువల్ల వెంటనే ఫేస్‌యాప్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రస్తుత ధరలలో కూలీ గిట్టుబాటు కావడం లేదన్నారు. కనీసం రోజుకి రూ.600లు ఇవ్వాలని, పని దినాలు పెంచాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పనులు దొరకక వలసలు పోతున్నవారి సంఖ్య పెరుగుతున్నదన్నారు. ఈ సంవత్సరం ఏలినినో ప్రభావంతో వర్షాలు లేక గ్రామాల్లో పనులు మరింత తగ్గిపోతాయని చెబుతున్న ప్రభుత్వమే ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే చర్యలు చేపట్టడం సరికాదని సిపిఐ(యం) విమర్శిస్తున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.










కామెంట్‌లు (0)