మందస (శ్రీకాకుళం) : రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ విధానాన్ని విడనాడాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి ఆదివారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ విధానాన్ని విడనాడాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదన్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు ప్రభావిత గ్రామంలో కేంద్ర మంత్రి కె.రామమోహన్ నాయుడు పర్యటిస్తున్న నేపథ్యంలో ... సిపిఐ(యం) శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావును గత రాత్రి నుండి పోలీసులు గృహ నిర్బంధంలో వుంచడం గర్హనీయమన్నారు. ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు బత్తిన లక్ష్మణరావును కూడా ఆదివారం ఉదయం అరెస్టు చేసి మందస పోలీసు స్టేషన్‌కు తరలించారని తెలిపారు. వామపక్ష పార్టీల నాయకులు వంకల మాధవరావు, తామాడ సన్యాసిరావు, చాపర వెంకట రమణ, ఎన్.గణపతి, తదితరుల ఇళ్ళ వద్దకు పోలీసులు వెళ్ళి ఆదివారం ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు గ్రామాలకు వెళ్ళకూడదని హెచ్చరించారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పాల్గొంటున్నారు కాబట్టి ఆ ప్రాంతానికి వచ్చే వారందరి ఆధార్ కార్డులను తనిఖీ చేసి ఇరుగు పొరుగు మండలాలవారిని అనుమతించడంలేదు అని చెప్పారు. స్థానికులే అయినా ఎయిర్‌పోర్టు వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్నవారెవరైనా వస్తే కొంతమందిని వెనక్కు పంపడం, ఇంకొందర్ని సమీపంలోనే పోలీసు వలయం మధ్య ఉంచడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు అని వివరించారు. ఎయిర్‌పోర్టు ప్రభావిత రైతులతోను, ఆయా గ్రామస్తులతో ప్రభుత్వం ప్రజాస్వామికంగా చర్చించవలసిందిపోయి ఇలా నిర్బంధ చర్యలకు పాల్పడడం తగదు అని చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి బలవంతపు భూసేకరణ ఆపాలని కోరారు. గోవిందరావును గృహ నిర్బంధం నుండి, మిగతావారిని ఆయా పోలీసు స్టేషన్ల నుండి విడుదల చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ విధానాన్ని విడనాడాలి : సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 12, 2026, 03:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)