శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆగష్టు 24 న రాష్ట్రవ్యాప్తంగా చలో కలెక్టరేట్ : వి.శ్రీనివాసరావు

3 గంటల క్రితం

Statewide 'Chalo Collectorate' on August 24 for graveyards: V. Srinivasa Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 11:38 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

విజయవాడ : నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఊర్లో స్మశానవాటికలు పెద్ద సమస్యగా ఉన్నాయని, ప్రతీ ఊర్లో దళితవాడలకు అన్ని సౌకర్యాలతో కూడిన స్మశాన వాటికల కోసం రాష్ట్రవ్యాప్త ఆందోళనకు కెవిపిఎస్, వ్యవసాయ, కార్మిక, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయని, ఆగష్టు 24 న రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ కు పిలుపునిస్తున్నామని, ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శనివారం విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ .... ఎపి మంత్రి మండలి ప్రధానంగా కొత్త పిపిపి విధానాన్ని ప్రకటించిందన్నారు. పాత పిపిపి విధానంలో మొత్తాన్ని లూఠీ చేసి కార్పొరేట్లకు అప్పగించడం కష్టంగా ఉందని, వారికి ఏమాత్రం నష్టం రాకుండా కొత్త పిపిపి విధానాన్ని ప్రవేశపెట్టారని విమర్శించారు. ఒకవేళ నష్టం కలిగితే దాన్ని ప్రభుత్వమే భరించేలా, పూర్తి స్థాయిలో ప్రైవేటు రంగానికి ప్రోత్సాహమిచ్చేలా ఈ కొత్త పిపిపి విధానాన్ని ప్రవేశపెడుతున్నారని అన్నారు. ఇది లూఠీ చేయడానికే తప్ప మరొకటి కాదని చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు కోసం రైతాంగం నుండి భూములను తీసుకొని ప్రైవేటుకు కట్టబెట్టారని, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం దాని నుండి ఎలాంటి ఆదాయం లేదు అని ఈ కొత్త పిపిపి విధానం వల్ల ఏం ప్రయోజనం ఉంది ? అని అడిగారు. దిగువ స్థాయి నుండి ఎగువ స్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలు కుంభకోణాలకు బలవుతున్నారని అన్నారు. ప్రస్తుత జెన్ జి యువతరం కోరేది ఎవరు ఏ పని చేసినా బాధ్యత ఉండాలన్నదేనని చెప్పారు. ప్రధాని మోడి పార్లమెంటుకు వచ్చి సమాధానం చెబితే అకౌంటెబులిటి ఉన్నట్లు లెక్క అని స్పష్టం చేశారు. పార్లమెంటు మొహం చాటేస్తే అది నిరంకుశత్వం అవుతుందన్నారు. ఆగష్టు 15 న జాతీయ సమైక్యత కోరుతూ .... తాము రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్ల పతాకావిష్కరణలు చేస్తామన్నారు. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా .... ముఖ్యంగా నేడు అణగారిన కులాలపై, మైనార్టీలపై, మహిళలపై ఇంకా దాడులు జరుగుతున్నాయని, దళితులపై ఇప్పటికీ అణచివేతలు, వివక్షతలు కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా నేడు శ్మశానవాటికలు పెద్ద సమస్యగా ఉన్నాయన్నారు. జిఒ నెంబర్ 1,2,3,5 ప్రకారం .... రెండెకరాల భూమిని కేటాయించి బోరు వేసి, షెడ్డు వేసి సౌకర్యాలన్నీ కల్పించి నిర్వహించాలని, కానీ నేటి వరకు ఈ జిఒ అమలుకావడం లేదు అని తెలిపారు. కాబట్టి ప్రతీ ఊర్లో దళితవాడలకు అన్ని సౌకర్యాలతో కూడిన స్మశాన వాటికల కోసం రాష్ట్రవ్యాప్త ఆందోళనకు కెవిపిఎస్, వ్యవసాయ, కార్మిక, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయన్నారు. ఆగష్టు 24 న రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ కు పిలుపునిస్తున్నామని, ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.


సంబంధిత వార్తలు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్