విజయవాడ : విశాఖ జిల్లా పంచగ్రామాల భూ సమస్య పరిష్కార చర్యలు చేపట్టాలని కోరుతూ ... ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శుక్రవారం లేఖ రాశారు.
'' పంచ గ్రామాల భూ సమస్యపై గతంలో మా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ఉత్తరం రాశారు. అయినా పరిష్కారం కాకపోవడంతో ప్రజలు నిరాశలో ఉన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా విశాఖ జిల్లా పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో సుమారు 2 లక్షల మంది ప్రజలు తమ స్వంత ఇళ్ళు, స్థలాలపై పూర్తి హక్కులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది సాధారణ కుటుంబాలు ఆస్తులను వారసత్వంగా పొందినప్పటికీ వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. రిజిస్ట్రేషన్లు లేక స్వేచ్చగా విక్రయాలు చేసుకోలేకపోతున్నారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఆదాయాన్ని పంచుకోలేకున్నారు. దీనికై చట్టబద్దమైన పరిష్కారమే వారు కోరుతున్నారు. ఇది భూవివాదం మాత్రమే కాదు, వారి ఆర్థిక భద్రత, వారసత్వం, వారి పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. వారసత్వంగా పొందిన ఆస్థులపై, సంపాదించిన ఆస్థిపై ప్రజలు జీవితాంతం అనిశ్చితిలో ఉండకూడదు. పంచగ్రామాల ప్రజల ఇళ్ళ నిర్మాణాలను, రిపేర్లను కూడా అనుమతించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింహాచలం కొండ చుట్టూ 275 సర్వే నెంబర్లో దశాబ్దాల తరబడి నివాసముంటున్న వేలాది కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదు.
1996`97లలో ప్రభుత్వం పెందుర్తి, చినగదిలి ఎమ్మార్వోల ద్వారా ఆ ప్రాంతంలోని మొత్తం 11,282.26 ఎకరాల భూమిలో సింహాచలం దేవస్థానానికి ఏకంగా 9,063.22 ఎకరాల భూమికి రైత్వారీ పట్టాలు ఇచ్చేసింది. ఈ పట్టాలు మినహా ఈ భూమిపై హక్కులకు సంబంధించి దేవస్థానం వద్ద ఎటువంటి ఆధారాలూ లేవు. ఈ పట్టాల ఆధారంగా (ప్రభుత్వం 19.08.2000 ఇచ్చిన జివో నెంబర్ 578) అప్పటి వరకు హక్కుదారులుగా ఉన్న ప్రజలందరినీ ఆక్రమణదారులుగా అన్యాయంగా ముద్ర వేయడం ద్వారా అప్పటి వరకు లేని సమస్యను ప్రభుత్వమే సృష్టించింది.
ఈ పట్టాలు చెల్లవని నాటి సిసిఎలఏ గారు వాటిని రద్దుజేశారు. కానీ మీ ప్రభుత్వం పట్టాలు కొనసాగించింది. అప్పుడు ఏర్పడిన అసెంబ్లీ హౌస్ కమిటీ అనేకమంది మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితంతో, వివిధ ఆర్థిక సంస్థల నుండి లోన్లు కూడా తీసుకుని ఇళ్ళు కట్టుకున్నారని, వీరిని ఖాళీ చేయడంచడం సాధ్యం కాదని, అందువల్ల సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి, వీటిని రెగ్యులరైజ్ చేయాలని సూచించింది.
దీనిపై నడిచిన కేసులు 2010లో విశాఖ ఆర్డీవో గారు 268/2002/సి తేది. 03.04.2010న ఆ పట్టాలు సక్రమం కాదని పేర్కొంటూ ఈ భూములపై రీసర్వే చేయాలని ఆర్డర్ జారీచేశారు. ఈ ప్రాంతంలో జరిగిన ఒక భూ కుంభకోణంపై 2014లో సిపిఐ(యం) హైకోర్టులో కేసువేయగా, హైకోర్టు ఆదేశానుసారం అప్పటి మీ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం సిసిఎలఏ విశాఖ జాయింట్ కలెక్టరు గారితోపాటు, సర్వే, సిసిఎలఏకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీ కూడా ఈ పట్టాలు సక్రమం కాదనే విషయాన్ని తెలిపింది. అయినా ప్రభుత్వం ఆ పట్టాలను రద్దు చేయలేదు. అందువలనే ఈ సమస్య పరిష్కారం కాకుండా నానుతూ ఉన్నది.
ఈ భూములపై 1903లో గిల్‌మేన్ సర్వే రికార్డులలో అడవివరం పంచాయతీలో కేవలం 39.5 ఎకరాల భూమి మాత్రమే సింహాచలం దేవస్థానానిదని ఉంది. మిగిలిన భూమి జిరాయితి, బంజరు, పోరంబోకు, ఫారెస్టు భూమి అని పేర్కొంది. రైతుల పేర్లతో సహా సర్వే నెంబర్లు కూడా పేర్కొంది. దీని తరువాత ఈ భూములపై సమగ్ర అధికారిక సర్వే జరగలేదు. కావున ఇదే ప్రమాణికం.
2014లో విశాఖలో జరిపిన మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో ఈ సమస్య వంద రోజుల్లో పరిష్కరిస్తామని మీరు హామీ ఇచ్చారు. నేటికి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయినా ఇంకా పరిష్కారం కాలేదు. పై అంశాలను పరిశీలించి తక్షణం ఈ సమస్యను పరిష్కరించే చర్యలు చేపట్టాలని, ఈలోగా నిర్మాణాలను, రిపేర్లను అనుమతించాలని, క్రయ విక్రయాలను, రిజిస్ట్రేషన్లను పునరుద్దరించాలని కోరుతున్నాను. 275 సర్వే నెంబర్లో గల నిర్వాసితులకు జివో నెంబర్ 30 ప్రకారమే తక్షణమే ఇళ్ళ పట్టాలు మంజూరుచేసి కన్వేయన్స్, డీడ్స్/ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నాను. `` అని వి.శ్రీనివాసరావు లేఖలో పేర్కొన్నారు.










కామెంట్లు (0)