అమరావతి : పోలవరం జిల్లా చింతూరు డివిజన్‌లో గత వారం చనిపోయిన ఆదివాసీ చిన్నారుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ ... ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు లేఖ రాశారు. దీనికి సంబంధించిన ప్రకటనను సోమవారం విడుదల చేశారు. పోలవరం జిల్లా చింతూరు డివిజన్ ఎటపాక, కూనవరం మండలాల్లో (ఆగష్టు 28 - సెప్టెంబర్ 1 మధ్య) వారం రోజుల్లో ఆదివాసీ కుటుంబాలకు చెందిన ముగ్గురు చిన్నారులు మరణించారని తెలిపారు. వారి వివరాలను కూడా లేఖతోపాటు జతచేసినట్లు పేర్కొన్నారు. ఆ కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చి ఆదుకోవాలని కోరారు. ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామం ప్రధాన రహదారికి 5 కిలోమీటర్ల లోపలకు ఉంటుందని, ఎలాంటి రహదారి సౌకర్యం లేదని, గ్రామంలో కరెంటు లేదనీ, ఆశా వర్కర్ లేరనీ వివరించారు. ఈ ప్రాంతంలో మలేరియా విజృంభిస్తున్నదని, దీన్ని అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకోడానికి బదులుగా ఆరోగ్య శాఖ నిబంధనలకు విరుద్దంగా మలేరియా సోకిన పిల్లలకు క్లోరోక్విన్ మాత్రలు పంచారని, వాటిని తీసుకున్న 40 మంది పిల్లలు ఆస్పత్రిపాలయ్యారని తెలిపారు. జమున అనే 7 సంవత్సరాల పాప చనిపోయిందని... దీనికి రెండు రోజుల ముందు రోజా అనే 10 సంవత్సరాల పాపకు జ్వరం వచ్చి ఆస్పత్రిలో చేరిన తరువాత చనిపోయిందని, ఐదు రోజుల క్రితం కూనవరం మండలం ఫల్లూరు గ్రామానికి చెందిన 4 సంవత్సరాల పాప తెల్లం జాహ్నవి కోతులగుట్ట ఎ.పి. గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో ఉంటూ వాంతులు చేసుకొని కుప్పకూలిపోయిందని, ఆస్పత్రికి వెళ్ళేలోగానే చనిపోయిందని తెలిపి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి దారుణాలకు కారణాలు పరిశీలించి చర్యలు తీసుకోడానికి బదులుగా స్థానిక యంత్రాంగం ఈ ఘటనలు వెల్లడి కాకుండా శతవిధాలా ప్రయత్నించిందని ధ్వజమెత్తారు. జమునకు అర్థరాత్రి పోస్ట్‌మార్టం చేసి అంత్యక్రియలు హడావుడిగా జరిపించారని తెలిపారు. స్థానిక సిపిఐ(యం) నాయకులను పరామర్శకు వెళ్ళనీయకుండా పోలీసులు అరెస్టు చేసి అడ్డుకున్నారని చెప్పారు. జమున డెత్ సర్టిఫికేట్‌ను తారుమారు చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. జాహ్నవి ఘటన బయటకు పొక్కకుండా తోటి విద్యార్థులను హాస్టల్ నుండి ఇళ్లకు పంపించేశారని తెలిపారు. ఈ కుటుంబాలను ఉన్నతాధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ ఎవరూ వచ్చి కనీసం పరామర్శించలేదని చెప్పారు. బాధిత తల్లిదండ్రులను ఓదార్చలేదని, అంత్యక్రియలకు కొంత డబ్బు పంపి దులిపేసుకున్నారని వివరించారు. ఢిల్లీ, కాకినాడ నుండి వైద్య బృందాలు వచ్చినా బయటకు తెలియనివ్వలేదనీ, ఇది అత్యంత అమానవీయం అని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (మీరు) స్వయంగా జోక్యం చేసుకొని మలేరియా నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. శుభ్రమైన మంచినీరు, ఆశాల నియామకం, రోడ్డు, కరెంటు సరఫరాకు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి మరణాలు సంభవించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్లా కాదన్నారు. కనీసం వారు వీధుల్లో పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. రోజా, జమున, జాహ్నవి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం, ఇల్లు, ఇంటికి ఒక ఉద్యోగం, సాగు భూమి లేదా సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
చనిపోయిన ఆదివాసీ చిన్నారుల కుటుంబాలను ఆదుకోండి : సిఎం చంద్రబాబుకు వి.శ్రీనివాసరావు లేఖ
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 02:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)