ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

LIVE : రాష్ట్రాన్ని తీవ్ర కరువు వేధిస్తుంది : వి.శ్రీనివాసరావు

1 గంట క్రితం

The state is grappling with severe drought: V. Srinivasa Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 12:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

విజయవాడ : ఆంధ్ర రాష్ట్రాన్ని తీవ్ర కరువు వేధిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ .... రాష్ట్రంలో సరైన వర్షాభావం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని తెలిపారు. 80 శాతం పంటలు వేయలేదని, వేసిన అరకొర పంటలు కూడా సరిగ్గా పండలేదని తెలిపారు. పంటలు వేయలేకపోవడంతో ఒక్క అనంతపురం జిల్లాలోనే వెయ్యి కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లిందన్నారు. కృష్ణా గోదావరి డెల్టాలో కూడా నీళ్లు లేవన్నారు. డెల్టాలోని ప్రజలకు నీళ్లు లేవని, అప్రకటితంగా కరెంటు కోతలున్నాయన్నారు. ఎల్ నినో ప్రభావం ఈ సంవత్సరమంతా ఉంటుందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు ఇచ్చినప్పటికీ దానికి తగిన ముందస్తు చర్యలు ప్రభుత్వం తీసుకోలేదని ఆరోపించారు. ఈనాడు రాష్ట్రంలోని వ్యవసాయం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని అన్నారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు బతకడం భారంగా మారిందని, వారిని ఆదుకోవల్సిన బాధ్యత ప్రభుత్వానికుందని అన్నారు. డ్వాక్రా మహిళలు కూడా రుణాలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. ఈరోజు ఏది కొనాలన్నా ముట్టుకుంటే భగ్గుమన్నట్లుగా నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. మార్కెట్ లో కరువును ఎదుర్కొనే వరకు సామాన్యులకు సరుకులను అందుబాటులో ఉంచాలన్నారు. కనీసం రేషన్ షాపుల ద్వారానైనా 8 రకాల వస్తువులను చౌక ధరల్లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. పాల ధర పెంపును తక్షణం ఉపసంహరించుకోవాలన్నారు. అసలే కరువులో ఉంటే సహాయం చేయాల్సిందిపోయి భారాలు ఎలా వేస్తారు ? అని ప్రశ్నించారు. కుటుంబం అనే పేరు చెప్పి క్లారిటీ లేకుండా చేసి పెన్షన్లకు, సంక్షేమ పథకాలకు కోతలుపెట్టాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఒకలాగా ... ప్రభుత్వరంగ డిపార్ట్మెంట్లు ఒకలాగా చెబుతున్నారని... అసలు కుటుంబం అంటే ఏమిటో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి ఓ స్పష్టతనివ్వాలని కోరారు. ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేసి నిజాయితీగా పెన్షన్లను ఇవ్వాలని అన్నారు. పెన్షన్లు తీసుకొని తాగేస్తున్నారని ఆరోపించారని... ఒక పథకాన్ని ఎత్తేయాలంటే ముందుగా ప్రభుత్వమే దానిపై దుష్ర్పచారాన్ని మొదలుపెడుతుందని వివరించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్