సిపిఎం రాష్ట్ర కమిటీ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దారుణమైన హింసకాండ, లాఠీ చార్జ్‌పై విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌కు జవాబుగా చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యానాలు దురదృష్టకరమని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యానాల ఫలితంగానే కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించిన సంగతిని ఈ ప్రకటనలో ఆయన గుర్తుచేశారు. దేశాన్నంత ప్రభావితం చేస్తున్న విద్యార్థుల ఆందోళనపై విచారించే తీరిక లేదనటం, వీడియోలు చూడటానికి నిరాకరించటం సబబుగా లేదని పేర్కొన్నారు. ఇది భారత న్యాయవ్యవస్థ చరిత్రకే కళంకం తెచ్చిపెడుతుందన్నారు. ఇలాంటి వ్యాఖ్యానాల ద్వారా న్యాయవ్యవస్థపైనే ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వారు బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. ఇప్పటికైనా వెంటనే పిటిషన్ స్వీకరించి విద్యార్థులకు న్యాయం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తోందని తెలిపారు.
మోడీ అడుగు జారిపోతున్నది
విద్యార్థుల ఆందోళనలతో దేశమంతా అట్టుడుగుతున్నప్పటికీ, ప్రధానమంత్రి దాన్ని ప్రస్తావించకపోవడం అన్యాయమని శ్రీనివాసరావు విమర్శించారు. విద్యార్థులపై దారుణమైన లాఠీచార్జికి కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదని, ఎప్పుడో రెండు నెలల క్రితం జరిగిన నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకల గురించి ఇప్పుడు ప్రస్తావించి దేశం అంతా ఒక్కటిగా ఉండి ఎదుర్కోవాలని చెప్పడం నీతి బాహ్యమని, మోసపూరితమని పేర్కొన్నారు. ఇలాంటి మాటకారి తనంతో ప్రజల్ని ఎల్లకాలం దారి తప్పించలేరని యువత మేలుకొంటున్నదని అన్నారు. విద్యార్థులు చైతన్యవంతులవుతున్నారని, ఇప్పటికైనా ప్రధాని మోడీ, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయిస్తే ఆందోళన ప్రశాంతంగా ముగుస్తుందని, లేకపోతే యువతలో సహనం నశించి ఆగ్రహం కట్టలు తెంచుకునే ప్రమాదం ఉందన్నారు. అలాంటి పరిణామాలకు మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ కార్యాలయంపై బిజెపి దాడికి ఖండన
విజయవాడలో కాంగ్రెస్ ఆఫీస్ మీద బిజెపి దాడి, హైదరాబాద్, పాట్నాలో బాహబాహీకి దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థి ఉద్యమంపై ఒకవైపు దారుణమైన అణిచివేత, మరొకవైపు ప్రతిపక్షాలపై భౌతిక దాడులకు సైతం బిజెపి దిగడం దేశంలో అంతర్గతంగా శాంతిభద్రతలు దిగజారి పోతున్న స్థితిని ఎత్తుచూపుతున్నదని తెలిపారు. శాంతిభద్రతలను సజావుగా కాపాడాల్సిన ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బిజెపి ప్రతిపక్షాల నిరసన ప్రదర్శనలు చూసి ఓర్చుకోలేక దాడులకు తెగబడటం దారుణమనన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, రాజకీయ పార్టీల కార్యాలయాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)