శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల అక్రమ అరెస్టులపై సిపిఎం ఖండన..

14 అక్టోబర్, 2026

CPI(M) State Committee strongly condemns illegal arrests of Gannavaram Airport residents
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 10:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : నష్ట పరిహారం కోసం గత 16 రోజులుగా శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న గన్నవరం విమానాశ్రయ నిర్వాసితులను, వారికి మద్దతుగా నిలిచిన నాయకులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నెపంతో పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విమానాశ్రయ విస్తరణ, ఏలూరు కాలువ మళ్లింపు పేర్లతో గత 13 ఏళ్లుగా వెయ్యి పేద కుటుంబాలకు చెందిన నివాసాలు, ఇళ్ల స్థలాలు స్వాధీనం చేసుకుని ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించకపోవడం అన్యాయమని తెలిపారు. బాధితుల ప్రతినిధి వేదవతి, తిరివీది ఏసురత్నం తదితరులను అదుపులోకి తీసుకోవడం గర్హనీయమని, తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సమస్య తీర్చాలని కోరిన వేదవతి అనే మహిళను విచక్షణ లేకుండా గన్నవరం వెంకటేశ్వర థియేటర్ సెంటర్‌లో అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలించడం అప్రజాస్వామికమని తెలిపారు. నిర్వాసితులకు అండగా ఉన్న సిపిఎం మండల కార్యదర్శి మల్లంపల్లి ఆంజనేయులు, నాయకులు బడుగు మర్యాద దాసు, మిరప నాగేశ్వరరావు, సిపిఐ నాయకుడు కాట్రగడ్డ రామచంద్ర జోషిని అరెస్టు చేయడం దారుణమన్నారు. అరెస్టయిన వారిని ఏ స్టేషన్‌లో ఉంచారనే కనీస సమాచారం ఇవ్వకపోవడం, ఇతర ప్రాంతాలకు తరలించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించలేకనే ప్రభుత్వం ఇలాంటి దమనకాండకు పాల్పడుతోందని, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం.. నిర్వాసితుల సమస్యలను పోలీసు నిర్బంధం ద్వారా కాకుండా నష్టపరిహారం చెల్లించి, సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్