అధ్యయన యాత్రల ద్వారా సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం పోరాడతాం : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. లోకనాథం, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏ. మాల్యాద్రి
అనకాపల్లి : కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు సమాజంలోని ప్రజాస్వామిక, అభ్యుదయ శక్తులన్నీ ఐక్యంగా ఉద్యమించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. లోకనాథం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర కార్యదర్శి ఏ. మాల్యాద్రి పిలుపునిచ్చారు. అనకాపల్లి దొడ్డి రామునాయుడు భవనంలో మంగళవారం నిర్వహించిన "కుల వివక్ష లేని సమాజం కోసం" సదస్సుకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి. వెంకన్న అధ్యక్షత వహించారు.ఈ సదస్సును ఉద్దేశించి లోకనాథం, మాల్యాద్రి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, గుర్రం జాషువా, పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహనీయులు కుల వివక్ష నిర్మూలన కోసం జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చినప్పటికీ, నేటికీ కుల వివక్ష అనేక రూపాల్లో కొనసాగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. గ్రామాల్లో పెత్తందారీ ధోరణులు, దళితులపై వివక్ష, సామాజిక బహిష్కరణలు, మహిళలపై అవమానకర వైఖరి ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. ఉన్నత విద్య చదివి ఉన్నత స్థానాల్లో ఉన్న దళితులు కూడా కుల వివక్షను ఎదుర్కొంటున్నారని, విద్యాసంస్థల్లో సైతం కులతత్వాన్ని ప్రోత్సహించే పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. దళితులను రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్న పాలకులు వారి అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపు, విడుదల, వినియోగంలో చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. డాక్టర్ అంబేడ్కర్ చూపిన సామాజిక సమానత్వ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కెవిపిఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాల ఫలితంగానే జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా కుల వివక్షపై అధ్యయనం జరిగిందని, కోనేరు రంగారావు కమిషన్ దళితుల భూ హక్కులపై కీలక సిఫార్సులు చేసినప్పటికీ వాటిని ప్రభుత్వాలు అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలోని అనేక దళిత కాలనీల్లో ఇప్పటికీ మంచినీరు, రహదారులు, మరుగుదొడ్లు, వీధిలైట్లు, గృహాలు, స్మశానవాటికలు వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, భూ పట్టాల పంపిణీ వంటి అంశాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని తెలిపారు. దళిత క్రైస్తవుల సమస్యలపై కూడా ప్రభుత్వాలు స్పందించడం లేదని అన్నారు. దళితులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, విద్య, వైద్యం, ఉపాధి, భూమి, గృహాలు, మౌలిక వసతులు, స్మశానాల సమస్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయన యాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యాత్రల్లో వెలుగులోకి వచ్చే సమస్యల పరిష్కారం కోసం ప్రజలను సమీకరించి నిరంతర ఉద్యమాలు నిర్వహిస్తామని, సామాజిక న్యాయం సాధించే వరకు పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు జి.కోటేశ్వరరావు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఇ.చిరంజీవి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.సత్యనారాయణ, సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆర్. శంకర్రావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం. అప్పలరాజు, గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంటా శ్రీరామ్, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.మాణిక్యం, డి.డి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)