విజయవాడ : కృష్ణా డెల్టాకు తగినంత నీరు ఇచ్చి పంటలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ(యం) విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించి బుధవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎగువనపడిన వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు నీళ్ళు చేరుకున్న కారణంగా డెల్టాలో నాట్లు వేసుకోడానికి నీరు వదలాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నెల ముందుగానే నీరు విడుదల చేస్తామని, రైతులను ముందుగానే నార్లు పోసుకోవాలని కోరారనీ, ఆయన పిలుపుపై రైతాంగం నార్లు పోయటం, దుక్కులు దున్నటం ప్రారంభించారనీ, కొందరు రైతులు ఎద చల్లడం ద్వారా వరి వేశారని తెలిపారు. జూలై చివర్లో ముఖ్యమంత్రి ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా వస్తాయని కృష్ణా డెల్టాలో వరి వేయవద్దని ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రకటించారని, అందుకు అవసరమైన ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా లేకుండానే ప్రకటించడంతో రైతుల్లో గందరగోళానికి దారి తీసిందని చెప్పారు. కృష్ణా డెల్టాలోని కృష్ణా జిల్లా, బాపట్ల జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో వరి తప్ప మరొక పంటకు పనికిరావు అని, అటువంటి ప్రాంతాలలో రైతాంగం మరింత ఆందోళనగా ఉందని వివరించారు. పట్టిసీమ నుండి ప్రస్తుతం రోజుకు 5200 క్యూసెక్కుల నీరు వస్తుందని తెలిపారు. గోదావరిలో వరద ప్రవాహం పెరిగిన దృష్ట్యా అన్ని పంపులు పనిచేయించి 7 వేల క్యూసెక్కులు తీసుకునే అవకాశం ఉందన్నారు. పులిచింతలలో 26 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. కృష్ణా నదికి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండటంతో శ్రీశైలానికి 1,36,000 క్యూసెక్కుల నీరు వస్తున్నదని, ఇంకా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పులిచింతల నుండి రోజుకు 5000 క్యూసెక్కులు తీసుకోవడం ద్వారా కృష్ణా డెల్టాలో ఎక్కువ ప్రాంతంలో పంటలు పండించడానికి అవకాశం ఉందని అన్నారు. ఎల్‌నినో ప్రభావం పేరుతో వరి పండదని అంచనా వేసిన గుత్త వ్యాపారస్తులు బియ్యాన్ని నిల్వ చేసుకొని అధికరేట్లకు అమ్ముతున్నారని, తద్వారా మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడుతోంది... కాబట్టి ఆహార పంటగా వరికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వరి పంటను ఆదుకోవాలని కోరారు. గోదావరి నదిలో సరిపడా నీరు ఉందని, ధవళేశ్వరం నుండి ఏలూరు కాల్వ ద్వారా కృష్ణా డెల్టా ఆయకట్టులోని పెదపాడు, దెందులూరు మండలాలకు సాగునీరు ఇవ్వటానికి అవకాశం ఉందని తెలిపారు. గతంలో ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. గతంలో 80 టీఎంసీలతోనే కృష్ణా డెల్టాలో వారబందీ పెట్టి పంటలు పండించిన అనుభవం ఉందన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా చర్చించి కృష్ణా డెల్టాకు అవసరమైన నీరు ఇచ్చి పంటలు పండించేందుకు తోడ్పడాలని ప్రత్యామ్నాయ పంటలు వేయగలిగిన ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేయించేందుకు ఏర్పాటు చేయవలసిందిగా సిపిఐ(యం) ప్రభుత్వాన్ని కోరుతున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
కృష్ణా డెల్టాకు తగినంత నీరు ఇచ్చి పంటలను కాపాడాలి : సిపిఐ(యం)
11 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 05, 2026, 02:41 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)