బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మోకాళ్లపై మున్సిపల్ కార్మికుల నిరసన - రెండవ రోజు రిలే దీక్షలు

1 గంట క్రితం

Service is the path shown by Mother Teresa.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 04:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం


మృతి చెందిన కార్మిక కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలి


ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్ : చనిపోయిన, రిటైర్మెంట్ అయిన మున్సిపల్ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని సిఐటియు నేతలు హెచ్చరించారు రెండవ రోజు రిలే దీక్షల్లో చెవిలో పూలు పెట్టుకొని, మోకాళ్లపై కూర్చొని మున్సిపల్ కార్మికుల నిరసన తెలిపారు. చనిపోయిన, రిటైర్మెంట్ అయిన మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, నగర జనాభాకు అనుగుణంగా మున్సిపల్ కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే దీక్షలు బుధవారం రెండవ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా కార్మికులు చెవిలో పూలు పెట్టుకొని, మోకాళ్లపై కూర్చొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ రిలే దీక్షలను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. నాగేంద్ర కుమార్, సిఐటియు నగర ఉపాధ్యక్షులు వి. రామిరెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజూ అనంతపురం నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా ఉంచేందుకు మున్సిపల్ కార్మికులు నిరంతరం సేవలు అందిస్తున్నారని అన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలు, రిటైర్మెంట్ అయిన కార్మికుల కుటుంబాలు ప్రస్తుతం ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి ఆదాయం అందించే పెద్దను కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మున్సిపల్ అధికారులకు ఉందన్నారు. అలాగే సుమారు 30 సంవత్సరాల పాటు మున్సిపాలిటీకి సేవలు అందించిన ఔట్‌సోర్సింగ్ కార్మికులను 60 సంవత్సరాల వయస్సు వచ్చిన వెంటనే ఎలాంటి రిటైర్మెంట్ ప్రయోజనాలు, ఆర్థిక భద్రత కల్పించకుండా ఇంటికి పంపడం అన్యాయమన్నారు. ఇలాంటి కుటుంబాలు ఎలా జీవించాలనే విషయాన్ని పాలకులు, అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచుతుండగా, మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికులను మాత్రం 60 సంవత్సరాలకే విధుల నుంచి తొలగించడం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలు మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ఎందుకు వర్తించవని నిలదీశారు. రోజురోజుకూ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా, ప్రజా ప్రతినిధులు మాత్రం తమ వేతనాలను లక్షల రూపాయలకు పెంచుకుంటున్నారని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత, మెరుగైన వేతనాలు కల్పించేందుకు మాత్రం ప్రభుత్వాలకు చేతులు రావడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు స్పందించి చనిపోయిన, రిటైర్మెంట్ అయిన మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, నగర జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. గత రెండు రోజులుగా మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు తిండి తిప్పలు మానుకొని తమ సమస్యలను పరిష్కరించాలని రిలే దీక్షలు చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి కూడా కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. అధికారులు వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే గురువారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నగర అధ్యక్షులు టి. గోపాల్, నగర కార్యదర్శి సాకే తిరుమలేశు, కోశాధికారి లక్ష్మీనరసమ్మ, సహాయ కార్యదర్శి బండారి స్వామి, ఉపాధ్యక్షులు బంగ్లా రాఘవ, కమల్, మరియమ్మ, హక్కులప్ప, ఆటో యూనియన్ నాయకులు ఎన్.టి.ఆర్. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్