విజయవాడ : ప్రభుత్వ శాఖల్లో ఎఐ వినియోగం పై తొందరపడవద్దు అని సిపిఐ(యం) విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. న్యాయవ్యవస్థతో సహా అన్ని ప్రభుత్వ రంగ శాఖల్లో ఎఐ వినియోగాన్ని ప్రవేశపెట్టాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాపితంగా ఎఐ ఫలితాలు, దుష్పరిణామాలపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లో దీన్ని అమలు చేయడం పై తొందరపడకుండా నిపుణులతో పూర్తిగా బేరీజు వేశాకే తుది నిర్ణయం తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నదన్నారు. ఇటీవల కోర్టు తీర్పులలో ఎఐ ఆధారిత తప్పు ఉటంకింపులు (సైటేషన్స్) చేసిన వైనాన్ని సుప్రీం కోర్టు పేర్కొన్న విషయం గమనించాలని సిపిఐ(యం) కోరుతున్నదన్నారు. ఇరాన్ పై అమెరికా బాంబు దాడుల్లో 7 సందర్భాలలో మిలటరీ క్యాంపులకు బదులు పౌర నివాసాలు, విద్యాలయాలపై దాడి ఎఐ వల్లనే జరిగిందని అమెరికా కాంగ్రెస్ కు చెందిన నిపుణుల కమిటీ పేర్కొన్నదని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో సైతం సైబర్ దాడులు, ప్రైవసీ హక్కుపై దాడి జరుగుతున్న నేపథ్యంలో ఎఐ ప్రభుత్వ పథకాల అమలుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఆధార్, బ్యాంకు, ఓటరు, రేషన్ కార్డులు సైతం హ్యాకింగ్‌కు గురవుతున్నాయన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో లెక్కలు తారుమారవుతున్నాయని చెప్పారు. అన్నదాతా సుఖీభవ వంటి సబ్సిడీ కార్యక్రమాల్లో కోతలు, ఉపాధి కల్పనలో తప్పుడు లెక్కలు కన్పిస్తున్నాయన్నారు. ‘సర్’ పేరుతో జరిగిన ‘ఓట్ చోరీ’ తతంగంలో కేంద్రీకృత ఎఐ వినియోగం తెలిసిందేనన్నారు. కొన్ని తరగతులను లక్ష్యంగా చేసుకొని ఓట్లు తొలగింపుకు ఈ టెక్నాలజీ తోడ్పడిందన్నారు. ఈ స్థితిలో మానవ జోక్యంతో నిమిత్తం లేకుండా పూర్తిగా ఎఐ పై ఆధారపడటం పేద, మధ్యతరగతి వర్గాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని, కాబట్టి ఈ ప్రతిపాదనను విజ్ఞతతో పునరాలోచించాలని సిపిఐ(యం) కోరుతున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ప్రభుత్వ శాఖల్లో ఎఐ వినియోగం పై తొందరపడవద్దు : సిపిఐ(యం) విజ్ఞప్తి
13 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 29, 2026, 12:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)