అఖిలపక్ష సమావేశం జరపాలి
సిపిఎం రాష్ట్ర కమిటీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ రిపోర్టును ప్రభుత్వం బహిరంగపర్చాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమిటీ రిపోర్టుపై సమగ్రంగా చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం జరపాలని కోరారు. బిసి రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ కమిటీ జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరించిన అనంతరం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు పత్రికల్లో వార్తలొచ్చాయని తెలిపారు. ఇందులో రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన ఇవ్వాలో కమిటీ పలు సూచనలు చేసినట్లు కూడా వార్తలొచ్చాయని పేర్కొన్నారు. అలాగే రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కూడా వివిధ ప్రతిపాదనలు చేసినట్లు తెలిసిందన్నారు.
వాటిపై ముఖ్యమంత్రితో సహా పలువురు అభిప్రాయాలు కూడా వ్యక్తపర్చినట్లు మీడియాలో వార్తలొచ్చాయని, స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లపై పలు పార్టీలు, సంఘాలు, సంస్థలు గత కొంతకాలంగా అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. కావున కమిటీ తన రిపోర్టును ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నివేదికను బహిరంగ పర్చి అందరికీ అందుబాటులో ఉంచడం సముచితంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం ఈ నివేదికపై అఖిలపక్ష సమావేశం జరిపి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు.








కామెంట్‌లు (0)