శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

18 ఏండ్లు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే : సిపిఐ(యం)

1 గంట క్రితం

It is the Election Commission's responsibility to ensure the right to vote for all citizens who have attained the age of 18: CPI(M)
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 03:41 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

ఓటు పరిరక్షణ వేదిక ఏర్పాటు

పలు తీర్మానాలు ఆమోదం


విజయవాడ : రాష్ట్రంలో జరుగుతున్న సర్ ప్రక్రియలో అవకతవకలను సరిదిద్ది ప్రతి ఒక్క ఓటును కాపాడేందుకు ప్రముఖ అడ్వకేట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ కన్వీనర్‌గా ... ప్రముఖ వ్యక్తులు, సంస్థలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటు పరిరక్షణ వేదిక ఏర్పడింది. శుక్రవారం విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో సిపిఐ(యం) ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఈ మేరకు నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఎ.బి.వెంకటేశ్వరరావు, కె.ఎస్.లక్ష్మణరావు, వి.లక్ష్మణరెడ్డి, రమేష్‌పట్నాయక్, కుర్ర వసుంధరలతో పాటు వివిధ ప్రజా సంఘాల, రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఉన్నారు. వారితో సంప్రదించి కమిటీ తుది జాబితా విడుదల చేస్తారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి ఓటు హక్కు పరిరక్షణ తీసుకోవాల్సిన చర్యలపై అర్జీ సమర్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం పలు తీర్మానాలను ఆమోదించింది.


ఈ రౌండ్‌టేబుల్ సమావేశానికి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగా అజయ్‌కుమార్, వైఎస్సార్‌సిపి సీనియర్ నాయకులు మల్లాది విష్ణు, ఏపిసిసి వైస్‌ప్రెసిడెంట్ కొలనుకొండ శివాజీ, ఐలు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్, సిపిఐ(యంఎల్) న్యూడెమోక్రసీ నుండి పి.ప్రసాద్, యంసిపిఐ(యు) నుండి యం.వెంకటరెడ్డి, సిపిఐ(యంఎల్) లిబరేషన్ నుండి ఉదయ్, జనచైతన్య వేదిక కన్వీనర్ వి.లక్ష్మణరెడ్డి, మాజీ ఐపిఎస్ ఎ.బి.వెంకటేశ్వరరావు, మేలుకో ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ రమేష్‌పట్నాయక్ అలాగే వివిధ ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.


18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే : సిపిఐ(యం)


ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ .... కేంద్రంలో బిజెపి, ఎన్డీఏ పాలనలో ఎన్నికల సంఘం చేపట్టిన సర్ (ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ) పేరుతో కోట్లాదిమంది అర్హులైన ఓటర్ల ఓటు హక్కుని తొలగించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే 10 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో సర్‌ వలన కోట్లాదిమంది తమ ఓటు హక్కును కోల్పోయారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ సాగుతోందన్నారు. దేశం మొత్తం సర్ ప్రక్రియ ద్వారా 16 కోట్లమంది ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని తెలుస్తోందన్నారు. మైనారిటీలు, బలహీనవర్గాలు, వలస కార్మికులు, పేదల ఓట్లు ఉద్దేశపూర్వకంగా తొలగించే కుట్ర ఇమిడి ఉందని స్పష్టంగా అర్థమవుతున్నదన్నారు. రాజ్యాంగంలోని 326 ఆర్టికల్ ప్రకారం18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటుహక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి మూలస్తంభమైన ఓటు హక్కును ధ్వంసం చేయటం మన దేశానికే ప్రమాదం అని హెచ్చరించారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియ వలన తొలిదశలో 44.89 లక్షల మంది ఓట్లు ముసాయిదా జాబితాలో లేకుండా పోయాయని నేతలు ధ్వజమెత్తారు. 15.22 లక్షల ఓట్లను మృతి చెందిన వారిగా గుర్తించారు. మరో 7.37 లక్షల ఓట్లను రెండు, మూడు చోట్ల నమోదైన ఓట్లుగా ప్రకటించారు. 22.30 లక్షల ఓట్లను ఆచూకీ లేనివారిగా ప్రకటించారు. మరణించిన వారు, డబుల్ ఎంట్రీ ఓట్లుగా పేర్కొన్న వాటిలో కూడా కొన్ని లోపాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 22 లక్షలకు పైగా వలస వెళ్లిన వారిని ఆచూకీ లేనివారిగా ప్రకటించి వారికి ఓటు హక్కు లేకుండా చేయటం అప్రజాస్వామికం అని చెప్పారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన అనంతరం మరో 44,21,763 మందికి సాంకేతిక, చిన్న, చిన్న కారణాలతో, కుంటి సాకులతో మరో 7.3 లక్షల ఓట్లు మ్యాపింగ్ కాని ఓట్లుగా నోటీసులు జారీచేయటంతో ఓటర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇందులో 36 లక్షల మందికి పైగా పేరు, తండ్రి లేదా భర్త పేర్లు, వయసు, చిన్న చిన్న సాంకేతిక లోపాలు ఉన్నాయనే నెపంతో ఈ నోటీసులు జారీ చేయటం గర్హనీయమన్నారు.


పొరపాటు సమాచారం ఇస్తే జైలు, కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కుటుంబంలోని ప్రతి సభ్యుడు ఈ విచారణకు హాజరుకావలసిన పరిస్థితి తలెత్తిందన్నారు. తమ వృత్తులు మానుకొని అధికారులు, కార్యాలయాలు చుట్టూ తిరగవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు. వృత్తి, చదువు ఇతర కారణాలతో దూరప్రాంతాల్లో ఉన్నవారు విచారణకు రాలేక మరింత ఆందోళనకు గురవుతున్నారన్నారు. వారి ఓటు హక్కు పోతుందనే భయాందోళనకు లోనవుతున్నారని తెలిపారు. ఓటర్ల వద్ద ఉన్న ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ (గుర్తింపుకోసం తప్ప ఇతర వివరాలు పరిగణనలోకి తీసుకోదు), రేషన్, ఓటు కార్డులను పరిగణనలోకి తీసుకోకుండా పాస్ పోర్ట్, జనన ధ్రువీకరణ, కుల సర్టిఫికెట్లు ఇతర అందుబాటులోలేని సర్టిఫికెట్లు తేవాలని నిబంధనలు పెడుతున్నారన్నారు. 2002 ఓటర్ల జాబితాలో అక్షర దోషాలకు ఎన్నికల సంఘం బాధ్యత వహించాలి. తప్పు అధికారులది కాగా, ఓటర్లను శిక్షించడం తగదు అని చెప్పారు. తాత, తండ్రి, ఓటరు వయసు వ్యత్యాసాలు తక్కువగా ఉన్నాయని, ఎక్కువగా ఉన్నాయని చెబుతూ నోటీసులు ఇవ్వడం, వారి పుట్టుకనే ప్రశ్నించడం వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నదని, మనోవేదనకు గురిచేస్తున్నదని అన్నారు. విచారణకు హాజరైన వారిని పత్రాలతో, పలకలు పెట్టి నేరస్తులను ఫోటోలు తీసినట్టు ఫోటోలు తీయటం తీవ్ర అభ్యంతరకరం అని చెప్పారు. పలుచోట్ల నోటీసులు కూడా ఇవ్వకుండానే ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చి సరిపెడుతున్నారని తెలిపారు. పూర్తి సమాచారం ఓటర్లకు సమగ్రంగా అందటం లేదన్నారు. ఇప్పటివరకు నోటీసులు ఇచ్చే ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. రానివారికి ఈనెల 30వ తేదీలోపు మూడుసార్లు నోటీసు ఇస్తామని, అవకాశం ఇస్తామని చెబుతున్నా, అది ఆచరణలో కనపడటం లేదు అని వివరించారు.


గతంలో సుప్రీం కోర్టు అనేక సందర్భాలలో అక్షరదోషాలను (క్లరికల్ మిస్టేక్స్) సరిదిద్దాల్సిన బాధ్యత అధికారుదేనని స్పష్టంగా తీర్పులిచ్చినప్పటికీ లెక్కచేయడం లేదని నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో తెలుగును ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉండగా దాన్ని పక్కనపెట్టి ఆంగ్లంలోని అక్షర దోషాలపై నోటీసులివ్వడం దుర్మార్గమే కాదు రాజ్యాంగ ధిక్కరణ కూడా అని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అప్రజాస్వామిక నిబంధనల వలన రాష్ట్రంలో గతంలో 22 లక్షల మందికి, నేడు మరో 44 లక్షల మంది మొత్తం 66 లక్షల మంది ఓటు హక్కుకు ముప్పు ఏర్పడుతున్నది. ప్రజాస్వామ్య ప్రక్రియకు ఇది తీరని హానిచేస్తుంది. కావున సర్ ప్రక్రియను ఓటరు ప్రయోజనాలకనుగుణంగా, రాజ్యాంగ స్పూర్తికనుగుణంగా మార్చాలని కోరారు.


(1) 18 సంవత్సరాలు నిండిన అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి. ఇంటింటికీ తిరిగే ప్రత్యేకమైన క్యాంపెయిన్ చేపట్టాలి. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ముట్టినట్లు రశీదు ఇవ్వాలి.

(2) ఓటు నమోదు ప్రక్రియకు గడువు సెప్టెంబర్ ఆఖరు వరకు పొడిగించాలి.

(3) ఇంటింటికి తిరిగి ఓటు కల్పించడం, జాబితాలో తప్పులు, లోటుపాట్లను సరిదిద్దే బాధ్యత ఎన్నికల సంఘం తీసుకోవాలి.

(4) నిర్దేశించిన సమయానికి విచారణకు హాజరై రుజువు చేసుకోవాలనే నిబంధనలు తొలగించాలి.

(5) ఓటర్ల వద్ద అందుబాటులో ఉండే ప్రామాణికమైన ఆధార్, రేషన్, ఓటు ఇతర కార్డులను పరిగణలోకి తీసుకొని అందరికీ ఓటు హక్కు కల్పించాలి.

(6) 2002 ఓటర్ల జాబితాలో నమోదైన పేర్లను ప్రామాణికంగా తీసుకునే నిబంధనలు పూర్తిగా తొలగించాలి.

(7) రాష్ట్రంలో 22 లక్షలకుపైగా వలస వెళ్లినవారికి ఓటుహక్కు కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

ఓటర్ల విచారణకు, లోపాలు సరిచేయటానికి సమయం పొడిగించాలి.

(9) కొత్త ఓటర్ల చేర్పింపు, లోపాలు సరిచేయటం, అడ్రస్ మార్పులు తదితర ప్రక్రియను అధికార యంత్రాంగమే చేపట్టాలి.

(10) ఓటర్ల విచారణ మౌఖికంగానే కాకుండా వీడియోకాల్ ద్వారా కూడా చేయాలి.

(11) సిబ్బంది సంఖ్యను పెంచాలి. సిబ్బందిపై అదనపు భారంవేసి వేధించడం మానుకోవాలి.

దేశంలోని అర్హులైన ప్రజలందరికీ ఓటు హక్కుని పరిరక్షించేందుకు పౌర సమాజం, రాజకీయ పార్టీలు, సంఘాలు కలసి ఎన్నికల సంఘంపైన, కేంద్రంపైన ఒత్తిడి తేవాలి. క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలకు అండగా నిలవాలి. ప్రజాస్వామ్య, రాజ్యాంగ ప్రక్రియను ధ్వంసంచేసే చర్యలను ఉమ్మడిగా ఎదుర్కోవాలి.
011

022

033



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్