మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుపతి పట్టణంలో భూ మాఫియాలు రెచ్చిపోతున్నాయి : వి.శ్రీనివాసరావు

10 గంటల క్రితం

Land mafias are running rampant in Tirupati town: V. Srinivasa Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 01:21 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి పేదలకు న్యాయం చేయాలి : వి.శ్రీనివాసరావు

  • పేదలు కట్టుకున్న ఇళ్లను కూల్చితే ఇప్పటివరకు పట్టించుకోలేదు : కందారపు మురళి


ప్రజాశక్తి-తిరుపతి (మంగళం) : రూపాయి రూపాయి కూడగట్టుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని అగ్రిమెంటు చేసుకొని కొనుగోలు చేసుకుంటే ఈ స్థలం తమదంటూ రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా రాత్రి వేళల్లో జెసిబి యంత్రాలతో 32 మంది పేదలు కట్టుకున్న ఇళ్లను ఉన్నపలంగా కూల్చివేసి, అధికార పార్టీ నాయకుల అండదండలు, రౌడీల సహాయంతో ప్రహరీ గోడను కట్టాడని, తిరుపతి పట్టణంలో భూమాఫియాలు రెచ్చిపోతున్నాయని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి గ్రామీణ మండల పరిధిలోని గాంధీపురం పంచాయతీలో ఉన్న శ్రీ స్వామి హథీరాంజీ మఠం భూమి సర్వే నెంబర్ 13లో పేదల కట్టుకున్న ఇండ్లను కూల్చివేసిన స్థలాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్.జయచంద్ర భూ బాధితులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ .... పేద ప్రజల భూములను పెద్ద గద్దల్లా తయారై తమ కబంద హస్తాల్లోకి దౌర్జన్యంగా తీసుకోవడం వంటి దారుణమైన పరిస్థితులు నేడు తిరుపతి పట్టణంలో ఉన్నాయన్నారు. సర్వే నెంబర్ 13 లో 32 మంది పేదలు కొచ్చి శేషగిరిరావు నుండి అగ్రిమెంట్ తీసుకొని ఒక ఎకరా తొమ్మిది సెంట్లు భూభాగంలో ఇళ్ళను నిర్మించుకున్నారన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వు ప్రకారం జిల్లా యంత్రాంగం పేద ప్రజలకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, కానీ కట్టిన ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేస్తే న్యాయం చేయండి మహాప్రభో అని కలెక్టర్ కి, జిల్లా ఎస్పీకి, ప్రజా ప్రతినిధులకు విన్నవించిన ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల సిపిఎం పార్టీగా తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. వెంటనే ఈ 32 మందికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వీరికి పరిష్కార మార్గాలు తామే చూపుతామని స్పష్టం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ .... 15 నుంచి 20 ఏళ్లకు మునుపు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తే రాత్రికి రాత్రి ఇళ్లను కూల్చివేయడం, న్యాయం కోసం పోరాడే బాధితులపై రౌడీయిజం చేయడం, పోలీసులతో బెదిరించడం దారుణమైన చర్యగా సిపిఎం పరిగణిస్తోందన్నారు. ఒకప్పుడు సిపిఎం శాసనసభ్యులు చేసిన విన్నపం మేరకు శ్రీ స్వామి హథీరాంజీ మఠం భూములను పరిరక్షించడానికి ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కమిటీ వేశారని, అటు తరువాత భూములను పరిరక్షించే బాధ్యత తీసుకోలేదన్నారు. దీంతో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వారు యథేచ్చగా మఠం భూములను దక్కించుకోవడానికి ఆక్రమణలకు పాల్పడుతూనే ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం ఆదేశం మేరకు ఈ వివాద స్థలాన్ని సర్వే చేయించి, హద్దులు నిర్ణయించాలని ఆదేశాలు ఇచ్చినా కూడా ఇప్పటివరకు ఆ ప్రక్రియను జరపకుండా నిలిపేసారన్నారు. పేదలు కొనుగోలు చేసిన ఇళ్లను కూల్చేయడం, అధికార బలం, డబ్బున్న వారు మాత్రం మిద్దెలు మేడలు కట్టుకుంటుంటే కళ్ళప్పగించి చూస్తున్నారని, ఇంతటి వివాదాలు జరుగుతున్న గాని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇప్పటివరకు ఈ స్థలాన్ని పరిశీలించలేదన్నారు. ఈ స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకున్న వ్యక్తి గంజాయి బ్యాచ్ లను, రౌడీ మూకలను ఏర్పాటు చేసుకొని రాత్రుళ్ళు పహారా కాస్తుంటే నియంత్రించాల్సిన జిల్లా యంత్రాంగం ఏ మాత్రం పట్టనట్టుగా ఉండడం శోచనీయమన్నారు. ఈ అన్యాక్రాంతమవుతున్న భూములను ఎలా చక్కబెట్టాలి, ఏ ప్రయోజనాలకు వినియోగించాలి అనే అంశాలపై ఇప్పటివరకు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోకపోవడం మఠం భూముల ఆక్రమణను రాష్ట్రవ్యాప్త సమస్యగా తీసుకెళ్తామన్నారు. ఈ 32 పేద కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ సిపిఎం పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భూ బాధితులతో పాటుగా సిపిఎం జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు టి.సుబ్రమణ్యం, సిపిఎం పార్టీ తిరుపతి నగర కార్యదర్శి వేణుగోపాల్ పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్