సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రతి గుండె ఓ జంతర్‌మంతర్!

22 గంటల క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 04:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఈ దేశపు కండరాలపై

అవినీతి శూలాలు దిగబడినప్పుడు

ప్రశ్నించే వాడిపై త్రిశూలాలు దూసుకొచ్చినప్పుడు

నిటారుగా నిలబడి ఒక్క ప్రశ్న సంధించి చూడు

లక్షల గొంతులు వంత పాడతాయి

ఒక్క నినాదం ఇచ్చి చూడు

లక్షల పిడికిళ్లు ఆవేశంతో ఊగుతాయి

నిల్చున్న చోటే వేదిక అవుతుంది

పండిన చోటే దీక్ష అవుతుంది

భయం గుండెల్లో ప్రశ్నల డైనమైట్లు పేల్చితే

ధైర్యం నిండిన దేహమొకటి

దేశమంతా విస్తరిస్తుంది

ప్రతి విద్యార్థి గుండె ఓ జంతర్‌మంతర్ అవుతుంది

రాజ్యాంగమే బ్యారికేడ్ అవుతుంది

అంబేద్కర్ చిత్రపటమే

ఆత్మగౌరవ పతాకమవుతుంది

చిత్రంగా భగత్‌సింగ్ వారి చేతిలో పిడికిలై

శరీరంలో విద్యుత్ ప్రవాహమవుతాడు

అప్పుడిక ఏ ఆయుధమూ అవసరం ఉండదు

వొట్టి చేతులే పోలీసు వాహనాలకు

అడ్డంగా నిలబడి ఢీకొడతాయి

గాయపడ్డ దేహాలు విముక్తి గేయాలు ఆలపిస్తాయి

గాయాలైన అవయవాల నుంచి

నెత్తురు ప్రవహిస్తుండగానే

పాలకుని బట్టలు ఒక్కొక్కటిగా

ఊడిపోతుండడం చూస్తాం

ఇన్నాళ్లు వటవృక్షాలమనే భ్రమల్లో

ఉన్నోళ్ల రాజీనామా లేఖలు

వేళ్లు కదలి కీళ్లు సడలినట్లు

ఎండుటాకుల్లా రాలిపోతుంటాయి

ఇది జనం కన్న కలల యాత్ర

ఇది జనం కదిలిన జైత్రయాత్ర!

యువతరమా...

ఎత్తిన పిడికిలి, నినదించిన గొంతు

అట్లాగే ఉంచు... ఇంకా

సరి చేయాల్సిన పని చాలా ఉంది!


- పేరూరి మురళికుమార్

93978 73331

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్