కొండకొనకు చంద్రదీపాన్ని వేలాడదీసి
వెన్నెల పూలు మెట్టలో ముడిచి
తుడుం దరువుల ఉరుములకు పురివిప్పిన నెమళ్లు
వనదేవతకు నర్తనహారతి పట్టేవి
ఇప్పుడవి
నగరం నడిబొడ్డున డీజే శబ్దాలకు చిందులేస్తుంటే
అడివమ్మ గుండెలో ఎవరితో పంచుకోవాలో తెలియని వేదన!
గడిచిన రోజుల్ని తలచుకుని తలచుకుని కుమిలిపోతూ
గాయాల్ని తడుముకుంటున్న తల్లి దుఃఖం ఎవరిక్కావాలి?
లోలోపల సెగలై రగిలే మంటలు చల్లారే దారి లేక
గుండె బాదుకునే కొండను పట్టించుకునేదెవరు?
అడివిపిట్టలు అతిథుల ముందు ఆడే దీనదృశ్యం
కళ్లను కలవరపెడుతుంది
ఏవేవో చప్పుళ్లకు యాంత్రికంగా అడుగులేయడమే తప్ప
ఆ పాదాల కదలికల్లో ప్రాణస్పందనలేవీ?
ఏ కందికొత్తల పండగల్లోనో, దుర్ల తిరుగుతూనో
కొండపాదం ముందు వెండి వెన్నెల్లో యువహృదయాలు పురివిప్పినప్పుడో
గుండెడప్పు వరసలకు తుడుం దరువుల వయోవిలాసం తోడై
ప్రకృతికి పట్టాల్సిన నృత్యనీరాజనం
వినోద ప్రదర్శన కావడమొక విషాదమే!
కొండ ఉత్సవవిగ్రహమైపోవడం
అడివి ప్రదర్శనక్షేత్రం కావడం ఇదొక విషాదానందం!
నిర్ణీత సమయానికి క్రమబద్ధీకరింపబడిన వలయాలలో
లేలేత పూదీవెలు ఆడీ ఆడీ అలిసిపోతాయి
వేలాది పాదాల కలువమొగ్గలు కందిపోతాయి
యజ్ఞం పూర్తయిపోతుంది
యజ్ఞఫలం ఎవరిదో..
ఎగిరిపోతుంది లోహవిహంగం
ముగిసిపోతుంది మహా ఉత్సవం!
సంబరాలు సరే...
సహజవనరుల దోపిడీ సాగుతూనే ఉంటుంది
ఆదివాసీ హక్కులు ఆవిరవుతూనే ఉంటాయి
నీరసమూ నిస్సత్తువా ఆవహించిన చేతుల్లో
వేలాడే పంజరాలు
పంజరాల్లో గూళ్లకు తిరిగొచ్చే పిట్టపిల్లలు
పిల్లల కోసం హరితపత్ర నయనాలతో ఆత్రంగా ఎదురు చూసే అడివి
అడివి నెమళ్లు చిందులేసిన ఒకానొక
సామూహిక నర్తన ఛాయాచిత్రం
రేపు వార్తాపత్రిక మడతల్లో పడి ఎక్కడో!
- లాంగుల్య








కామెంట్‌లు (0)