సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గుండె సవ్వడి కావాలి!

3 గంటల క్రితం

child
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 03:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అమ్మానాన్నల అహాల అరణ్యంలో

నిప్పుల ఉప్పెన లేచింది.

కట్టుకున్న బంధాల కాగితాలు

కోర్టు గదిలో సాక్ష్యాలుగా చినిగాయి

భార్యాభర్తల యుద్ధంలో

గెలుపెవరిదో ఏమో కానీ...

గెలిచిన ప్రతిసారీ ఇక్కడ

ఓడిపోతోంది పసి బాల్యమే!

చట్టాల పుస్తకాల్లోని సూత్రాలు

పేగు బంధాల సాంద్రతను కొలవగలవా?

ఒకరికొకరు వద్దనుకున్న మీ పంతం

మాకు ఇద్దరూ కావాలన్న ఆర్తిని తుంచగలదా?

కోర్టు బోనులో నిలబడింది

అమ్మానాన్నల అహం కాదు,

దిక్కుతోచని చిన్నారుల భవిష్యత్తు!

లాయర్ల వాదనల వెనుక

అమ్మ ముద్దు, నాన్న భుజాల ఊరేగింపులు

నిశ్శబ్దంగా మునిగిపోతున్నాయి.

రెండు గుండెల సవ్వడి మధ్య పెరగాల్సిన ప్రాణాలు

ఏ ఒక్కరి నీడలోనో సగం శ్వాసతో మిగలాలా?

రాత్రి వేళ అమ్మ జోల కావాలి,

పగటిపూట నాన్న ధైర్యం కావాలి.

విడాకుల తీర్పుతో

బంధాలు తెగిపోవచ్చు గాక,

రక్తం పంచుకున్న అనురాగాలు

ఏ చట్టంతో విడిపోతాయి?

కోర్టు తీర్పులు

మనసుల గాయాలను మాన్పగలవా?

మీ అనాలోచిత చీకటిలో

నలిగే బాల్యానికి వెలుగేది?

పసివాళ్ల కన్నీటి చుక్కల ముందు

సర్వ చట్టాలూ తలవంచుకోవాల్సిందే!

అమ్మ కావాలి... నాన్న కావాలి...

ఇది కేవలం చిన్నారుల నినాదం కాదు,

సమాజ వివేకాన్ని మేల్కొలిపే ఓ పచ్చి వాస్తవం!


– మర్రాపు వసుంధరా దేవి

94414 67660

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్