ఒక వలయంలో పర్వెడుతున్నాం
దేశం చుట్టూ సమస్యల చుట్టూ
కాంతి సంవత్సరాల వేగంతో
బూర వెంట పడుతున్న
సూది నుంచి తప్పించుకుంటూ
కేవలం బతకడానికే పారిపోతున్నాం
బలహీనులం అనుకోకండి
జ్ఞానం తెలిసే సమయానికి
చేతిలో ఆఖరి ముద్ద మాత్రమే మిగిలేలా ఉంది
వెచ్చదనం అనే కొత్త జీవితం కోసం ఆరాతీస్తే
ఆలోచనలు అగ్నికీలలై దహిస్తున్నాయి
పాపాలు కడుక్కుందామని దిగిన గంగలో
కొత్త పాపాలు చుట్టుకుంటున్నాయి
నదిలో నీళ్లని తాగాలని చూస్తున్నాం
కొండమీదకెక్కి ఆకాశం మాదే అంటున్నాం
కట్టుకున్న బట్టల్లా కలల్ని కూడా
వదిలేసి నగ్న దేహాలతో ఊరేగిస్తున్నా
ఇదే భూమి మీద బతుకుతున్నాం
సామూహిక స్వరాలని పక్కవాడికే చేరనివ్వడం లేదు
స్వతంత్ర జెండాలా నిలబడాలని ఉన్నా
అంతర్‌బహిర్ రెపరెపల మధ్యలో ఆగిపోతున్నాం
నడుం విరుగుతుందని తెలిసినా మళ్లీ కిందకే పడుతున్నాం
చచ్చిపోతున్నామని తెలిసి కూడా
ఎలాగూ పుట్టాము కదా...
నాయనాలారా!
ఆ శ్మశానం చేరే దాకైనా ఉండనివ్వండి
పిల్లల్ని పరీక్ష రాయనివ్వండి
రైతుల పంట నలుగురికి పంచనివ్వండి
నచ్చిన దేవుడి ప్రసాదాన్ని
నాలుగు గడపలకి పంచుకోనివ్వండి
ఎవరు కొనుక్కున్న టికెట్టు మీద
వాళ్లనే ప్రయాణం చేయనివ్వండి
నిండుగా వెలుగుతున్న పసి దీపాలని
చప్పున ఆర్పకండి
ఆపరేషన్ చేసి తీసేసిన నా కాళ్లు
కుక్కల పాలు చేయకండి
ఎప్పుడో నేర్చుకున్న శాంతి వచనాలు
నెమరేసుకుంటూ బతుకుతున్నాం
ఈ అజ్ఞాతవాసంలో
ఎంత పట్టపగలయినా మాకు చీకటిగానే ఉంది
తవ్వుకుంటున్న మేర దోసిళ్లకొద్దీ దిగులు
పచ్చని చెట్లని మోసం చేయకండి
ఎండిపోయామా!
గడ్డివాము అంటుకున్నట్టు కూడా తెలియదు
ఎంత కరుణారస వాన కురిపించినా
మీకన్నా ఎక్కువ బూడిదే పోగుచేస్తాం!
- అనిల్ డ్యాని
97033 36688









కామెంట్‌లు (0)