- ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
- ఉత్సాహంగా ప్రారంభమైన సాహిత్య సమ్మేళనం
ప్రజాశక్తి–అమరావతి బ్యూరో : కవులు, రచయితలు శాస్త్రీయ దృక్పథంతో రచనలను కొనసాగించాలని, ప్రజాపక్షంగా నిలవాలని ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత రాచపాళెం చంద్రశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఎంబివికె భవనంలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించిన సాహిత్య సమ్మేళనంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ప్రశ్నించటమే సాహిత్యకారుల కర్తవ్యం అని అన్నారు. ప్రశ్న అనేది మానవజాతి సహజ లక్షణమని, దానిని ఎవరూ చంపలేరని అన్నారు. ప్రశ్నను నివారించేవారిని ప్రశ్నే ప్రశ్నిస్తోందన్నారు. దేవుడు సనాతనుడు కాదని, మానవుడు, మానవజాతి సనాతనమని, మానవుడే సీనియర్ అని, మానవజాతి ఏర్పడిన తర్వాత దానిని పట్టుకుని వేలాడుతున్నారని అన్నారు. సంస్కృతి ఎవరి సొత్తూ కాదని, సంస్కృతిలో ఎన్ని పాయలు ఉంటాయో సమాజంలో అన్నిపాయలు ఉన్నాయని అన్నారు. 'అమ్మ' నవల రచయిత మాక్సిమ్ గోర్కీ... సంస్కృతి నిర్మాతలు కళాకారులు, మేధావులు, కార్మికులని వివరించారని తెలిపారు. పాలకులు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందే వేటిని అమలు చేస్తారో, వేటిని అమలు చేయరో వాటిని ప్రశ్నించాలన్నారు. మత విద్వేషాలు, మూఢనమ్మకాలతో కేంద్రంలోని కూటమి ప్రభుత్వం పాలన చేస్తోందని విమర్శించారు. మనిషికి విముక్తి మనిషిలోనే ఉందని గురజాడ చెప్పారని తెలిపారు. రచయితకు తార్కిక దృక్పథం ఉండాలన్నారు. రచయితలు మతం వైపా, సైన్స్ వైపా అని ప్రశ్నించుకోవాలన్నారు. రచయితలు భావవాదం వైపుకు కాకుండా భౌతికవాదంతో రచనలు చేయాలని అన్నారు. ప్రశ్న, పురోగామి భావాలు సమాజంలో మొదటినుంచీ ఉన్నాయని వివరించారు. వేమన కుల వ్యవస్థను చీల్చిచెండాడని, కులాల్లో హెచ్చుతగ్గులు ఎలా వచ్చాయని ప్రశ్నించాడని అన్నారు. కర్మ సిద్ధాంతం శ్రమ దోపిడీ చేస్తోందన్నారు. దేవుడి గుడిలో దొంగతనం అరికట్టలేనివారు 150 కోట్ల మందిని ఎలా రక్షిస్తారని ప్రశ్నించారు. సాహిత్యం ప్రశ్నించేదిగా ఉండాలని, దానిని ఎవరూ బంధించలేరని అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సాహిత్యం ప్రశ్నలను లేవనెత్తాలని, ప్రజల వైపు నిలవాలని అన్నారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి ఈ సభలో అధ్యక్షోపన్యాసం చేస్తూ, ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులపై ప్రశ్నించే గొంతులను ఒకచోట చేర్చే ప్రయత్నంగా ఈ సాహిత్య సమ్మేళనం నిలిచిందని అన్నారు. సాహిత్యం ప్రజల ప్రతిఘటనకు ప్రేరణగా నిలుస్తుందని, తెలుగు భాషా సంస్కృతిని, కొత్త తరాల గొంతులను ఎందుకు కాపాడుకోవాలో వివరిస్తోందన్నారు. అణచివేయబడిన గొంతులుఒక దశలో ప్రశ్నించడం మొదలుపెడతాయని తెలిపారు. బొద్దింకల తిరుగుబాటు ఈ కాలానికి ఒక ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రజల కష్టాలను, సమస్యలను, దేశంలోని పరిణామాలను సాహిత్యం పట్టించుకొని ప్రశ్నిస్తుందని వివరించారు. కోవిడ్ కాలంలో పాలకుల పట్టింపులేని తనం కారణంగా గంగానదిలో శవాలు కొట్టుకురావటంపై కవిత రాస్తే పాలకులు భయపడి దానిపై నిషేధం విధించారని గుర్తు చేశారు. సమాజంలో జరిగే ప్రతి అన్యాయంపై గొంతెత్తి ప్రశ్నించడం కవులు, రచయితలు, కళాకారుల కర్తవ్యమని, అది కొనసాగుతూనే ఉంటుందని అన్నారు.
పాలకులకు ప్రశ్నించటమే సాహిత్యకారుల కర్తవ్యం
పాట, కవిత, ప్రశ్న భయాన్ని కలిగిస్తాయన్నారు. సనాతనం, దేశభక్తి పేర్లతో మతతత్వం, నిరంకుశత్వాన్ని భిన్న మతాలతో కూడిన దేశంపై రుద్దడం సాధ్యం కాదని అన్నారు. గతాన్ని గుర్తుంచుకోవాలని, కానీ గతమే గొప్పదని చెప్పుకోవడం తిరోగమనమని అన్నారు. రెండ్రోజుల సాహిత్య సమ్మేళనం తెలుగు సాహిత్య ప్రజాపక్ష, పురోగమనానికి దోహదపడుతుందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. కాలం విసిరే సవాళ్లకు కలిసే కలలు, కదిలే గళాలు ఒక సమాధానంగా నిలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
తరువాత కవిత్వంపై జరిగిన సెషన్‌లో ప్రముఖ సాహితీవేత్తలు గుంటూరు లక్ష్మీనరసయ్య, కోయి కోటేశ్వరరావు మాట్లాడారు. కవిత్వం వివిధ పాయలుగా ఎలా ప్రవహిస్తుందో, వస్తువు రీత్యా, శిల్పం రీత్యా ఎలా పరిణామం చెందుతూ వచ్చిందో వివరించారు. సాహిత్య చరిత్ర దృక్పథాలపై తెలకపల్లి రవి, ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వంపై పవన్ కుమార్ మాట్లాడారు. ప్రారంభ సభలో అట్టాడ అప్పలనాయుడు, గంటేడు గౌరునాయుడు, చీకటి దివాకర్, కెంగార మోహన్, జంధ్యాల రఘుబాబు, సత్యాజీ, ప్రగతి, కుమారస్వామి, ఎంబీవీకే ట్రస్ట్ చైర్మన్ పి. మధు, పి. మురళీకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్. శర్మ తదితరులు పాల్గొన్నారు.
పుస్తకాల ఆవిష్కరణ, సృజనకారుల స్వరం
సాహితీ స్రవంతి అధ్యక్షుడు కెంగార మోహన్ రాసిన 'బ్లాక్ రైన్‌బో', కలమటి దాసుబాబు రచించిన 'ఈరణం', పూర్వ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, కృష్ణయ్య రచించిన 'పిల్లలు వర్ధిల్లాలి', సత్యభాస్కర్ కవిత్ం సంపుటి ‘అకాలం’ పుస్తకాలను ఆవిష్కరించారు. ఎంబీవీకేలో ఏర్పాటు చేసిన బుక్‌స్టాల్స్‌ను గంటేడు గౌరునాయుడు ప్రారంభించారు. గుండు నారాయణరావు వక్తలను వేదికపైకి ఆహ్వానించారు. మూడో సెషన్‌లో సత్యాజీ, శాంతి శ్రీ సమన్వయంలో 'సృజనకారుల స్వరం - మేం ఎందుకు రాస్తున్నాం' పేరిట 14 మంది రచయితలు, కవులు తమ భావాలను పంచుకున్నారు. తాము ఏ నేపథ్యంలో కవిత్వం రాస్తున్నారో సోదాహరణంగా వివరించారు. చుట్టూ జరుగుతున్న జరుగుతున్న అన్యాయాలపై, అసమానతలపై మాట్లాడకుండా ఉండలేనితనమే తమ చేత రాయిస్తుందని తెలిపారు. సుంకర గోపాల్, సిరికి స్వామినాయుడు, మల్లిపురం జగదీష్, పుప్పాల శ్రీరామ్, సాంబమూర్తి లండ, కంచరాన భుజంగరావు, నాస్తిక్, వైష్ణవిశ్రీ, కట్టా సిద్ధార్థ, తంగిరాల సోనీ, చింతా అప్పలనాయుడు, పెళ్లూరు సునీల్, కవిదాసు తమ అనుభవాలను పంచుకున్నారు.








కామెంట్‌లు (0)