మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్షర విస్ఫోటనం దాశరథి

1 రోజు క్రితం

dhasaradhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 05:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

తెలుగు నేల మీద అన్యాయాలను ఎదిరించడానికి పుట్టిన ఒక అగ్నిధార దాశరథి కృష్ణమాచార్యులు. 1925, జూలై 22న జన్మించిన ఈ మహాకవి కేవలం ఒక ప్రాంతానికో, భాషకో పరిమితం కాని విశ్వమానవుడు. నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు మగ్గిపోతున్న కాలంలో, కలాన్ని ఖడ్గంగా మార్చి ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన ధీశాలి. సాధారణంగా ఎవరికైనా తమ ప్రాంతం, భాష, సంస్కృతిపై ప్రేమ ఉండటం సహజం, అది గర్వకారణం కూడా. కానీ ఆ ప్రేమే మితిమీరి ఇతర భాషలను, సంస్కృతులను ద్వేషించే స్థాయికి చేరినప్పుడు అది 'దురభిమానం'గా మారుతుంది. దాశరథి అలాంటి సంకుచిత భావాలకు అతీతుడు. ఆయన తన మట్టిని ఎంతగా ప్రేమించాడో, ఖండాంతరాల్లోని మనిషి సాధించిన విజయాన్ని కూడా అంతే ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.

​నిజాం నవాబు దోపిడీని, రజాకార్ల హింసను ఎదిరిస్తూ దాశరథి గర్జించిన తీరు అద్వితీయం. "నా తెలంగాణ కోటి రతనాల వీణ" అని సగర్వంగా ప్రకటించిన ఆయన, "ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని" అంటూ జైలు గోడల మధ్య కూడా కవిత్వాన్ని ఆయుధంగా మలిచారు. ప్రస్తుతం మనం చూస్తున్న ప్రపంచంలో సహజ వనరుల దోపిడీ కోసం, అధికారం కోసం బలహీనులపై దండెత్తే పాలకులకు దాశరథి కవిత్వం ఒక హెచ్చరిక. ప్రకృతి అనే వీణపై హింసాగీతం కానీ, దోపిడీ గీతం కానీ ఆలపించాలని చూస్తే.. ఆ వీణ తీగ తెగిపోతుందే తప్ప, దోపిడీదారుడి ఆటలు సాగవని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. అన్యాయం ఎక్కడ జరిగినా అది మానవాళికే ముప్పు అని నమ్మిన అభ్యుదయవాది ఆయన. అందుకే ఒకవైపు నిరంకుశత్వంపై పోరాడుతూనే, మరోవైపు విశ్వవ్యాప్త చైతన్యాన్ని తన అక్షరాల్లో నింపుకున్నారు.

​సమాచార వ్యవస్థలు, అంతర్జాలం మృగ్యమైన ఆ రోజుల్లోనే దాశరథి ఆలోచనలు సప్త సముద్రాలు దాటి ప్రవహించాయి. అమెరికాలో జాతి వివక్షను ఎదిరించి, అడ్డంకులను అధిగమించి తొలిసారి డిగ్రీ పట్టా పొందిన నల్లజాతి వ్యక్తి 'జేమ్స్ మెరిడిత్' విజయాన్ని దాశరథి తన సొంత విజయంగా భావించారు. ఆ సందర్భంలోనే ఆయన "నల్లనివాడ! జ్ఞాన నయనమ్ములవాడ! మనస్సు లోపలన్ తెల్లనివాడ!" అంటూ ఉత్పలమాల పద్యాన్ని సంధించారు. బాహ్య వర్ణంతో సంబంధం లేకుండా, జ్ఞాననేత్రంతో ప్రపంచాన్ని చూసేవాడే అసలైన మానవుడని ఆయన చాటిచెప్పారు. ఆ పద్యంలో "తెల్లని విషమ్మునకున్ విరుగైనవాడ" అన్న ప్రయోగం ద్వారా అమెరికాలోని జాతి వివక్షను (White Supremacy) ఎంత నిశితంగా విమర్శించారో అర్థమవుతుంది. పక్కనున్న వాడి కష్టాన్ని కూడా పట్టించుకోని నేటి స్వార్థపూరిత సమాజంలో, ఎక్కడో ఖండాంతరాల్లో అణగారిన వర్గం నుంచి వచ్చిన ప్రగతిని గుర్తించి జేజేలు కొట్టడం దాశరథిలోని గొప్ప 'సివిక్ సెన్స్'కు నిదర్శనం.

​దాశరథి వ్యక్తిత్వంలో అంతుచిక్కని పార్శ్వాలు ఎన్నో ఉన్నాయి. నిరంకుశ పాలనపై నిప్పులు కురిపించిన ఆ కలమే, తెలుగు సినీ జగత్తులో మానవ మనసులోని కోమల భావాలను ఆవిష్కరించింది. "పాడెదను నీ నామమే గోపాలా" అన్న భక్తి పారవశ్యం కానీ, "ఖుషీ ఖుషీగా నవ్వుతూ సాగిపో" అన్న ఉల్లాస గీతం కానీ ఆయన కలం నుంచి జాలువారినవే. ఒకే మనిషిలో విప్లవ వీరత్వం, సున్నితమైన కవిత్వం పక్కపక్కనే ఉండటం అనేది గొప్ప విశేషం. గ్లోబలైజేషన్ అంటే కేవలం వస్తువుల మార్పిడి కాదని, ప్రపంచంలో ఎక్కడ మంచి ఉన్నా స్వీకరించడం, ఎక్కడ అన్యాయం ఉన్నా నిలదీయడం అని ఆయన ఆనాడే ఆచరించి చూపారు. నేడు మతం, కులం, దేశం పేరుతో మనుషుల మధ్య గోడలు కట్టుకుంటున్న సంకుచిత మనస్తత్వాలకు, శాంతి ప్రవచనాలు వల్లిస్తూ యుద్ధోన్మాదంతో రగిలిపోయే వారికి దాశరథి జీవితం ఒక నిశితమైన పాఠం.

​జేమ్స్ మెరిడిత్ వంటి వారి విద్యాకాంక్షను గుర్తించడం ద్వారా విద్యే నిజమైన విముక్తి మార్గమని ఆయన లోకానికి చెప్పారు. అణగారిన వర్గాల ప్రగతిని ప్రశంసించే గుణం ప్రతి పౌరుడికి ఉండాలని ఆకాంక్షించారు. దాశరథి కేవలం గతకాలపు కవి మాత్రమే కాదు; ఆయన నిరంతర చైతన్యం, అణగారిన వర్గాల ఆశాజ్యోతి. ఆయన చూపిన ఆ విశ్వమానవ దృక్పథమే తరతరాలకు స్ఫూర్తిదాయకం. దాశరథి జయంతి వేళ ఆ మహనీయుని స్మరించుకోవడం అంటే, మనలోని దురభిమానాలను వీడి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవత్వాన్ని గౌరవిస్తూ, విశ్వమానవ కళ్యాణానికి పునరంకితం కావడమే. ఆ 'కోటి రతనాల వీణ'లోని ప్రతి తీగ నేటికీ మనలో సామాజిక బాధ్యతను, సకల జనుల సౌభ్రాతృత్వాన్ని మీటుతూనే ఉంది.


​- మర్రాపు వసుంధరా దేవి,

94414 67660


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్