మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అన్నమయ్య అడుగుజాడల్లో డా. శోభారాజు

1 రోజు క్రితం

annamaya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 05:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

భారతీయ భక్తి ఉద్యమ చరిత్రలోనూ, తెలుగు సాహిత్య చరిత్రలోనూ 15వ శతాబ్దం ఒక ముఖ్యమైన అధ్యాయం. నాటి సమాజంలో వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృత కావ్యాలు ప్రధానంగా పండితులకే పరిమితమై ఉండేవి. సామాన్య ప్రజలకు అర్థమయ్యే తెలుగులో భక్తి, తాత్విక భావాలను అందించిన మహా వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. తెలుగు పదకవితకు కొత్త దిశను చూపినందుకు ఆయనను "పదకవితా పితామహుడు"గా గౌరవిస్తారు. ప్రస్తుత అన్నమయ్య జిల్లాలోని తాళ్ళపాక గ్రామంలో నారాయణసూరి, లక్కమాంబ దంపతులకు 1408 మే 9న అన్నమయ్య జన్మించారు. బాల్యం నుంచే తిరుమలతో ఆయనకు గాఢ అనుబంధం ఏర్పడింది. అక్కడే ఆయన తొలి సంకీర్తనగా ప్రసిద్ధి చెందిన "అదివో అల్లదివో శ్రీహరివాసము..." ఆలపించినట్లు చెబుతారు. ఆయన "పదము" (పాట) అనే ప్రక్రియను ప్రజల్లోకి తీసుకువచ్చి, పల్లవి, అనుపల్లవి, చరణాల నిర్మాణంతో తెలుగు సంగీత సాహిత్యానికి కొత్త రూపాన్ని ఇచ్చారు. జానపద గేయాలకు సాహిత్య గౌరవం కల్పించి, సంకీర్తనను ప్రజల జీవనంలో భాగంగా మలిచారు. సుమారు 32 వేల సంకీర్తనలు రచించిన అన్నమయ్య వాటిలో భక్తి, తాత్వికత, మానవ జీవితం, శృంగార భావనలను సమన్వయం చేశారు. కులవ్యవస్థ బలంగా ఉన్న సమయంలో "బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే", "నిండార రాజు నిద్రించు నిద్ర...", "మాలెవడు మాదిగెవడు... జీవమున్నవాడే కులజుడు" వంటి కీర్తనల ద్వారా సమానత్వాన్ని ప్రతిపాదించారు. కులవివక్షను ప్రశ్నిస్తూ మనిషి విలువ జన్మలో కాక జీవనంలో ఉందని చెప్పారు. ఈ కారణంగా ఆయనను కేవలం భక్తి కవిగానే కాక, సామాజిక సంస్కర్తగా కూడా గుర్తిస్తారు. అన్నమయ్య సంకీర్తనలను ఆయన కుమారుడు పెద తిరుమలాచార్యులు రాగి రేకులపై చెక్కించి భద్రపరిచారు. తరువాత సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి వాటిని వెలికితీయగా, వేటూరి ప్రభాకర శాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ తదితరులు వాటిని పరిష్కరించి సంగీత ప్రపంచానికి అందించారు. ఈ సంకీర్తనలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లిన ప్రముఖుల్లో పద్మశ్రీ డా. శోభారాజు విశిష్ట స్థానం సంపాదించారు.

అన్నమయ్య అక్షరానికి గాన ప్రాణం

అన్నమయ్య సంకీర్తనలను సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో డా. శోభారాజు పాత్ర విశిష్టమైనది. 1957 నవంబర్ 30న చిత్తూరు జిల్లా వాయల్పాడులో జన్మించిన శోభారాజు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత కళాశాలలో విద్యాభ్యాసం చేసి, ప్రముఖ సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి గారి వద్ద శిష్యరికం చేశారు. 1976లో టీటీడీ దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి, అన్నమయ్య సంకీర్తనల ప్రచారం కోసం టీటీడీ స్కాలర్‌షిప్ పొందిన తొలి కళాకారిణిగా నిలిచారు. 1978లో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్‌కు తొలి ఆస్థాన గాయనిగా ఎంపికయ్యారు. ఆమె గానంలో ‘అదివో అల్లదివో శ్రీహరివాసము’, ‘కొండలలో నెలకొన్న’, ‘చాలదా హరినామ’, ‘నానాటి బ్రతుకు నాటకము’, ‘జో అచ్యుతానంద’ వంటి సంకీర్తనలు విస్తృత ప్రజాదరణ పొందాయి. 1983లో హైదరాబాద్‌లో "అన్నమాచార్య భావనా వాహిని" సంస్థను స్థాపించి దేశ విదేశాల్లో దాదాపు 20 వేల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఆరు వేలకుపైగా సంగీత కచేరీలు నిర్వహించి అన్నమయ్య సంకీర్తనలను కొత్త తరాలకు చేరవేశారు. చంచల్‌గూడ జైలులో ఖైదీల కోసం, నిమ్స్ ఆసుపత్రిలో రోగుల కోసం ప్రత్యేక సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

"మ్యూజిక్ ఫర్ పీస్", "లక్షగళార్చన" వంటి కార్యక్రమాల ద్వారా సంగీతాన్ని సామాజిక చైతన్యానికి మాధ్యమంగా ఉపయోగించారు. తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయం నుంచి వెలుగుచూడని 39 అన్నమయ్య సంకీర్తనలను సేకరించి 'అన్నమయ్య గుప్త సంకీర్తనాధనం' పేరిట ప్రచురించారు. 'శ్రీ అన్నమాచార్య' టెలీ సీరియల్‌కు రచన, దర్శకత్వం వహించడంతో పాటు, 2004లో అన్నమయ్యపై పోస్టల్ స్టాంపు విడుదలకు కృషి చేశారు. సంగీత రంగంలో చేసిన సేవలకు గాను 2010లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, హంస అవార్డు, ద్వారకా తిరుమల, టీటీడీ ఆస్థాన గాయని హోదాలు, అమెరికా తెలుగు సంఘాల నుంచి 'అన్నమయ్య పదకోకిల' బిరుదు ఆమెకు లభించాయి. ఐక్యరాజ్యసమితి వేదికపై కూడా ఆమె అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. అన్నమాచార్య భావనా వాహిని "తందనాన" పేరిట అన్నమాచార్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలను కూడా నిర్వహిస్తోంది.

అన్నమాచార్య కీర్తనల శిక్షణ కార్యక్రమం

అన్నమయ్య సాహిత్య, సంగీత వారసత్వాన్ని నేటి తరానికి చేరవేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2026 జులై 16 నుంచి 29 వరకు విజయవాడ కే.బి.యన్. కళాశాలలో 15 రోజులపాటు అన్నమాచార్య సంకీర్తనల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ శిక్షణకు సుమారు 300 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. డా. శోభారాజు పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అన్నమయ్య పదకవితలు, సంకీర్తనలు, వాటి భావార్థాన్ని పాల్గొనేవారికి బోధిస్తున్నారు. సంగీతంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, యువతకు ఇది విలువైన అవకాశంగా నిలుస్తోంది. అన్నమయ్య సంకీర్తనలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో, వాటిని సంగీతం ద్వారా సజీవంగా నిలబెట్టడంలో పద్మశ్రీ డా. శోభారాజు చేసిన కృషి తెలుగు సాంస్కృతిక చరిత్రలో విశిష్టమైన స్థానాన్ని సంపాదించింది.


- రేగుళ్ళ మల్లికార్జునరావు

సంచాలకులు, భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్

94916 59899


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్