తెలుగు కథాసాహిత్యంలో చాగంటి సోమయాజులు (చాసో) పేరుతో అందజేసే పురస్కారం కేవలం ఒక అవార్డు కాదు; సామాజిక వాస్తవికతను, మానవీయ విలువలను కథల్లో ప్రతిష్ఠించిన రచయితలకు లభించే గౌరవం. ఈ ఏడాది ఆ పురస్కారానికి కథకుడు చింతా అప్పలనాయుడు ఎంపిక కావడం కళింగాంధ్ర కథా సంప్రదాయానికి దక్కిన మరో గుర్తింపుగా నిలిచింది. గురజాడ అప్పారావు నుంచి చాసో, కాళీపట్నం రామారావు, రావిశాస్త్రి, బలివాడ కాంతారావు, పతంజలి వరకు విస్తరించిన కళింగాంధ్ర కథా పరంపరను సమకాలీన జీవితంతో మేళవిస్తూ ముందుకు తీసుకెళ్తున్న రచయితల్లో చింతా అప్పలనాయుడు ఒకరు.
చింతా అప్పలనాయుడు కథల్లో కళింగాంధ్ర గ్రామీణ జీవితం యథార్థ రూపంలో ప్రత్యక్షమవుతుంది. పల్లె మనుషుల కష్టసుఖాలు, రైతుల జీవన పోరాటం, దళితుల ఆవేదన, స్త్రీల ఆత్మగౌరవం, వలస జీవితం, అంతరించిపోతున్న సంప్రదాయ వృత్తులు ఆయన కథల్లో సహజంగా ప్రవహిస్తాయి. కథను వినోద సాధనంగా కాకుండా సామాజిక చైతన్యానికి వేదికగా మలచడం ఆయన రచనల ప్రధాన లక్షణం. చాసో కథల్లో కనిపించే జీవన వాస్తవికత, ప్రాంతీయ భాష సహజత్వం, సామాజిక బాధ్యత వంటి లక్షణాలు అప్పలనాయుడు కథల్లోనూ కనిపిస్తాయి. అప్పలనాయుడు కథల్లో స్త్రీ జీవితం అత్యంత బలంగా ప్రతిఫలిస్తుంది. గ్రామీణ సమాజంలో స్త్రీని కుటుంబానికే పరిమితం చేసే భావజాలాన్ని ఆయన ప్రశ్నిస్తారు. కుటుంబాన్ని నిలబెట్టేది, కష్టకాలంలో ధైర్యంగా ముందుకు నడిపించేది, అన్యాయాన్ని ఎదిరించేది స్త్రీయేనని ఆయన కథలు స్పష్టం చేస్తాయి. ఆయన ప్రసిద్ధ కథ 'నకజనకరి... నాం... నాం...' దీనికి ఉత్తమ ఉదాహరణ. దళిత కుటుంబానికి చెందిన మహిళ భర్త మరణించిన తరువాత తలయారి బాధ్యతలు చేపట్టి డప్పు మోగిస్తూ గ్రామమంతటినీ మేల్కొలిపే పాత్రగా నిలుస్తుంది. అవసరం వచ్చినప్పుడు ఏ పనైనా చేయగల సామర్థ్యం స్త్రీలో ఉందని రచయిత ఎంతో సహజంగా ఆవిష్కరించారు. 'భూతాల సొర్గం' కథలో ప్రపంచీకరణ ప్రభావంతో అంతరించిపోతున్న జంగాల వృత్తిజీవుల దయనీయ స్థితిని చిత్రించారు. చంద్రమ్మ పాత్ర ద్వారా కుటుంబ బాధ్యతను భుజాన మోసే గ్రామీణ మహిళ ఆత్మస్థైర్యాన్ని ఆవిష్కరించారు. వృత్తులు కూలిపోతే కేవలం జీవనోపాధి మాత్రమే కాదు, ఒక సంస్కృతి కూడా కూలిపోతుందనే విషయాన్ని కథ బలంగా చెబుతుంది.
'కొత్తచిగురు' కథలో జీవితంపై ఆశ కోల్పోయిన వృద్ధురాలు మళ్లీ కొత్త ఆశను ఎలా అందిపుచ్చుకుందో రచయిత హృద్యంగా చిత్రించారు. చిన్న అవకాశమే మనిషి జీవితాన్ని మార్చగలదనే సందేశాన్ని ఈ కథ అందిస్తుంది. 'మాటు' కథలో వృద్ధురాలి జీవితాన్ని ఆధారంగా చేసుకొని కుటుంబ సంబంధాల్లో చోటుచేసుకుంటున్న స్వార్థాన్ని ఎత్తిచూపారు. చివరికి అన్యాయానికి తగిన ఫలితం తప్పదనే జీవన సత్యాన్ని సామెతల ద్వారా ప్రభావవంతంగా వ్యక్తీకరించారు. 'దూరం' కథ నేటి మధ్య తరగతి కుటుంబాల్లో డబ్బు మానవ సంబంధాలను ఎలా దెబ్బతీస్తుందో హృదయాన్ని కదిలించేలా చూపిస్తుంది. తన తమ్ముడి కోసం జీవితాన్ని అంకితం చేసిన అక్క చివరకు పరాయివారిలా మారిపోవడం ద్వారా ఆర్థిక విలువలు ఆత్మీయతను ఎలా మింగేస్తున్నాయో సున్నితంగా ఆవిష్కరించారు. రైతుల సమస్యలు కూడా అప్పలనాయుడు కథల్లో ప్రధాన కథావస్తువుగా కనిపిస్తాయి. 'వంగముల్లు' కథలో జీవనాధారం కోల్పోయి వలస వెళ్లే రైతు కుటుంబాల విషాదాన్ని చిత్రించారు. మరోవైపు ప్రాజెక్టుల పేరుతో రైతులు భూములు కోల్పోయి నిరాశ్రయులవుతున్న దృశ్యాలు ఆయన కథల్లో ప్రత్యక్షమవుతాయి. రైతు కేవలం ఆర్థిక వ్యవస్థకు ఆధారం మాత్రమే కాదు, నాగరికతకు మూలస్తంభమనే విషయాన్ని ఆయన కథలు గుర్తుచేస్తాయి.
ఈ కథల్లో మరో ప్రత్యేకత కళింగాంధ్ర మాండలికం. పాత్రోచిత సంభాషణలు, సహజమైన కథనం, జీవన వాస్తవికత, సామాజిక స్పృహ, మానవీయ దృక్పథం చింతా అప్పలనాయుడు కథలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. ఆయన కథల్లో కృత్రిమత కనిపించదు; జీవితం మాత్రమే కనిపిస్తుంది. కళింగాంధ్ర మట్టి వాసనను, రైతు చెమటను, దళితుల కన్నీటిని, గ్రామీణ స్త్రీల ఆత్మగౌరవాన్ని అక్షరాల్లో శాశ్వతం చేసిన కథకుడిగా ఆయన నిలిచారు. చాసో కథా సంప్రదాయంలోని వాస్తవికతను తన కాలపు సామాజిక సమస్యలతో మేళవించి సమకాలీన తెలుగు కథకు కొత్త ఊపిరి పోసిన రచయితగా చింతా అప్పలనాయుడు నిలిచారు. చాసో సాహిత్య పురస్కారం ఆయన వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు; కళింగాంధ్ర కథా సంప్రదాయానికి దక్కిన మరో అరుదైన గుర్తింపు కూడా.








కామెంట్‌లు (0)