జూలై 11, 12 తేదీల్లో విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాహిత్య సమ్మేళనం సృజనకారులకు నూతనోత్సాహాన్ని ఇచ్చింది. రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి 325 మంది ప్రతినిధులు నమోదు చేసుకోగా, సాహిత్యాభిమానులు, వివిధ రంగాల నుంచి వచ్చిన అతిథులతో కలిపి సుమారు 400 మంది ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. వీరిలో 68 మంది మహిళలు ఉండగా, మొత్తం ప్రతినిధుల్లో దాదాపు 40 శాతం మంది యువ సాహితీవేత్తలు కావడం గమనార్హం. తెలంగాణ, యానాం ప్రాంతాల నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యారు. సమ్మేళనం కేవలం సాహిత్య సభగా పరిమితం కాకుండా, వివిధ తరాల రచయితలు, కవులు, సాహిత్యాభిమానులు పరస్పరం కలుసుకొని ఆలోచనలు పంచుకున్న సృజనాత్మక వేదికగా రూపుదిద్దుకుంది.
ప్రారంభ, ముగింపు సభలతో పాటు నిర్వహించిన వివిధ అంశాలపై చర్చలు, ఉపన్యాసాలు, పరస్పర సంభాషణలు సమ్మేళనానికి మేధోపరమైన గంభీరతను తీసుకొచ్చాయి. 'సృజనకారుల స్వరం – మేమెందుకు రాస్తున్నాం' పేరిట రెండు రోజుల పాటు నిర్వహించిన సమావేశాలు ఈ సమ్మేళనానికి హృదయంగా నిలిచాయి. ఈ వేదికపై 52 మంది యువ రచయితలు తమ రచనా ప్రయాణం, ఆలోచనా నేపథ్యం, ఎదుర్కొంటున్న సవాళ్లు, సమాజంతో తమ అనుబంధం వంటి అంశాలను ఎంతో ఆత్మీయంగా వివరించారు. వారి ప్రసంగాలు కొత్త తరం రచయితల ఆలోచనా ప్రపంచాన్ని పరిచయం చేయడమే కాకుండా, సమకాలీన సాహిత్య ధోరణులపై కూడా స్పష్టమైన అవగాహన కల్పించాయి. మొత్తం 76 మంది రచయితలు, ఉపన్యాసకులు వివిధ సమావేశాల్లో మాట్లాడారు. సమ్మేళనం కొద్దిమంది ప్రసంగాలకు పరిమితం కాకుండా, విస్తృత భాగస్వామ్యంతో సాగింది. ఈ సమ్మేళనం విజయవంతం కావటానికి ముందస్తుగా సాగిన కృషి చాలా కీలకం. రాష్ట్రంలోని వివిధ విజ్ఞాన కేంద్రాలను సందర్శిస్తూ కొత్త రచయితలను గుర్తించడం, జిల్లాల వారీగా సాహిత్యాభిమాను లను సమీకరించడం, విజయవాడలోని విద్యాసంస్థల్లో విద్యార్థులను ఈ కార్యక్రమానికి అనుసంధానం చేయడం వంటి చర్యలు బాగా ఉపయోగపడ్డాయి. అనుభవజ్ఞులైన రచయితలతో పాటు కొత్త తరం కవులు, రచయితలు కూడా పెద్ద సంఖ్యలో ఈ సమ్మేళనంలో భాగస్వాము లయ్యారు. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి సాహిత్య చరిత్ర, దాని పరిణామం, సమకాలీన పరిస్థితులు, రచయితల సామాజిక బాధ్యతలపై చేసిన విశ్లేషణాత్మక ప్రసంగం సమ్మేళనానికి ఆలోచనా దిశను నిర్దేశించింది. తెలకపల్లి రవి, గుంటూరు లక్ష్మీనరసయ్య, అట్టాడ అప్పలనాయుడు, ఖాదర్ మొహిద్దీన్, గంటేడ గౌరునాయుడు, ఆర్. సీతారాం, డాక్టర్ కోయి కోటేశ్వరరావు, మహ్మద్ ఖదీర్‌బాబు, రాధేయ తదితర ప్రముఖుల ప్రసంగాలు సాహిత్యం, సమాజం మధ్య ఉన్న సంబంధాలను వివిధ కోణాల్లో విశ్లేషించాయి.
నెల రోజులపాటు ప్రముఖ రచయితల వీడియో సందేశాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం, పోస్టర్లను సాహిత్య వర్గాలు విస్తృతంగా పంచుకోవడం వల్ల ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. అదే రోజుల్లో విజయవాడలో మరో పెద్ద సాహిత్య కార్యక్రమం జరుగుతున్నప్పటికీ, ఈ సమ్మేళనానికి వచ్చిన స్పందన నిర్వాహకుల ప్రణాళిక, ప్రచార వ్యూహం ఎంత సమర్థవంతంగా పనిచేసిందో తెలియజేసింది. కార్యక్రమం నిర్వహణలో క్రమశిక్షణ, సమన్వయం, వసతి, భోజన ఏర్పాట్లు, ప్రచార నిర్వహణ వంటి అంశాలపై ప్రతినిధులు ప్రశంసలు వ్యక్తం చేశారు. కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రణాళికాబద్ధంగా సాగడం ఈ సమ్మేళనం నిర్వహణా సామర్థ్యాన్ని ప్రతిబింబించింది.
సాహిత్య చర్చలతో పాటు పుస్తక సంస్కృతికి కూడా ఈ సమ్మేళనం ప్రాధాన్యం ఇచ్చింది. ప్రజాశక్తి, శ్రీశ్రీ ప్రింటర్స్, విరసం, జనసాహితి తదితర సంస్థలతో పాటు మొత్తం ఎనిమిది పుస్తక ప్రదర్శన స్టాళ్లు ఏర్పాటు చేయడం వల్ల పాల్గొన్నవారికి విభిన్న ప్రచురణలను పరిశీలించే, కొత్త పుస్తకాలను పరిచయం చేసుకునే అవకాశం లభించింది. సాహిత్యానికి ఉన్న స్వతంత్ర పాత్ర, భావజాల నిర్మాణంలో రచయితల బాధ్యత, సమాజంలో విమర్శనాత్మక ఆలోచనలను పెంపొందించడంలో సాహిత్యం పోషించే పాత్ర వంటి అంశాలు చర్చల్లో ప్రధానంగా ప్రతిధ్వనించాయి. సాహిత్యం కేవలం సృజనాత్మక వ్యక్తీకరణ మాత్రమే కాకుండా, సమాజాన్ని ప్రభావితం చేసే శక్తిగా కూడా పనిచేయాలనే అభిప్రాయం బలంగా వ్యక్తమైంది.
సమ్మేళనం ముగింపు సందర్భంగా విజయనగరం, ఏలూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో ప్రాంతీయ సాహిత్య సమ్మేళనాలు నిర్వహించాలని ప్రతినిధులు సూచించారు. రాష్ట్రస్థాయి సాహిత్య సమ్మేళనాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో సాహిత్యరంగ కర్తవ్యాలపై స్పష్టమైన తీర్మానాలు రూపొందించడం, ప్రారంభంలో ఒక ఆహ్వాన పత్రం లేదా భావ ప్రకటన విడుదల చేయడం వంటి సూచనలు కూడా వచ్చాయి. సమాజంలో సామరస్య, సమైక్యతా భావాలను బలోపేతం చేయడంలో సాహిత్య, సాంస్కృతిక రంగాలు మరింత చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ఈ సమ్మేళనం స్పష్టం చేసింది. అభ్యుదయ భావజాలంతో పనిచేస్తున్న వివిధ సాహిత్య, సాంస్కృతిక వేదికలు ఐక్యకార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. సృజనకారుల రచనలకు ప్రచురణ, పంపిణీ, పాఠకుల వద్దకు చేరే అవకాశాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. భావజాలరంగంలో సాహిత్యానికి ప్రత్యేక పాత్ర, బలమూ ఉన్నాయని ఈ సమ్మేళనం చాటిచెప్పింది. ఈ కర్తవ్యాలను భవిష్యత్తులో మరింత ప్రణాళికాబద్ధంగా, పటిష్ఠంగా ముందుకు తీసుకెళ్లాలి. మొత్తంగా ఈ సాహిత్య సమ్మేళనం రాష్ట్రవ్యాప్తంగా కొత్త తరానికి విశ్వాసాన్ని కల్పించిన, సాహిత్య చర్చలకు కొత్త దిశను చూపిన, భవిష్యత్ సాహిత్య ఉద్యమానికి మార్గదర్శకంగా నిలిచిన ఒక విజయవంతమైన సాహిత్య ఉత్సవంగా గుర్తుండిపోతుంది.
– సత్యాజీ








కామెంట్‌లు (0)