మనిషి సంఘజీవి అంటారు ఓ ప్రముఖ తత్వవేత్త. కాలగమనంలో బతకడానికి, తాను అనుకున్నట్టు జీవించడానికి ప్రతి మనిషి నిత్య సమరం చేస్తూనే ఉంటాడు. గతాన్ని నెమరువేసుకుంటూ, వర్తమానంలో జీవిస్తూ, భవిష్యత్తుపై ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకుంటాడు. అందుకే ప్రతి జీవితంలో సమాజంతో ముడిపడిన ఓ బతుకుకథ ఉంటుంది. ఆ జీవనగమనాన్ని తన దృక్కోణంలో ఆవిష్కరించే ప్రయత్నమే ఆత్మకథ. ప్రముఖ కవి, రచయిత దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి తన జీవన అనుభవాలను 'మా ఊరి పొలిమేర దాటినంక!' పేరుతో అక్షరబద్ధం చేశారు. ఇది కేవలం వ్యక్తిగత జీవితం కాదు; ఆరు పదుల జీవిత ప్రయాణంలో ఎదురైన సాంఘిక దురాచారాలు, సామాజిక సమస్యలు, ఓ చిన్న గ్రామం నుంచి ప్రభుత్వ ఉద్యోగిగా ఎదిగిన ప్రస్థానాన్ని ఆవిష్కరించే గ్రంథం. ఆత్మకథ రాయాలంటే అసాధారణ జీవితం ఉండాల్సిన అవసరం లేదని ఎజ్రా శాస్త్రి నిరూపించారు. బాల్యం నుంచి నేటి వరకు జరిగిన సంఘటనలను ఉత్తమ పురుషలో చెప్పడంతో పాటు తన జీవితానికి ముడిపడిన సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను సహజంగా మేళవించారు. కరువు, వలస జీవితం, నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణ నేపథ్యంతో కథ మొదలవుతుంది. ఐదుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న పేద కుటుంబంలో జన్మించిన రచయిత చిన్నప్పటి నుంచే వివక్షను, అవమానాలను అనుభవించిన తీరు పాఠకుడిని కదిలిస్తుంది. వీధిలైటు కింద చదువుకున్న రోజులను గుర్తుచేస్తూ సమాజంలో సమాన విద్య, వైద్యం అందాలంటే చదువే మార్గమని రచయిత బలంగా విశ్వసిస్తారు.
ఆచార్య పి.సి. వెంకటేశ్వర్లు ముందుమాటలో ఈ ఆత్మకథ తనను మూడు కోణాల్లో కదిలించిందని చెబుతారు. రచయిత హాస్టల్ జీవితం, పల్లెల్లో బహుజనుల బతుకులు, ఎరుపు-నీలి భావాల సమ్మేళనాన్ని కోరుకునే దృక్పథం ఈ గ్రంథానికి ప్రత్యేకత అని పేర్కొంటారు. హోటల్‌లో పని చేయడం, లాడ్జి బాయ్‌గా జీవించడం, టికెట్ లేకుండా ప్రయాణాలు, నిక్కరు వేసుకుని కూలీ పనులు చేసిన అనుభవాలు రచయిత జీవిత పోరాటాన్ని సజీవంగా ఆవిష్కరిస్తాయి. ఈ పుస్తకం అంతా రచయిత నిక్కచ్చితనమే కనిపిస్తుంది. మతం కంటే మానవత్వమే గొప్పదని విశ్వసిస్తూ, పిల్లలను ఉన్నత చదువులు చదివించి మంచి వ్యక్తిత్వంతో ఎదగాలని ప్రోత్సహించారు. ఎన్నో అవరోధాలను అధిగమించి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా ఉద్యోగ జీవితాన్ని విజయవంతంగా ముగించారు. శ్రీశ్రీ, గద్దర్, జాషువా, శివసాగర్ వంటి సాహితీ దిగ్గజాల ప్రభావం తన జీవితాన్ని తేజోవంతం చేసిందని చెబుతారు. కర్ర ముక్క, నిప్పులో నడిచే తప్పెట, ఏరువాకై తిరిగి లేస్తా, పంచమాగ్ని, ఉత్తర, ఇంకెంత దూరం, మా ఎర్ర ఓబనపల్లె, ధనస్సు, చంద్రవంక, గంగ జాతర వంటి రచనల తర్వాత వచ్చిన ఈ ఆత్మకథ కూడా ఎజ్రా శాస్త్రి రచనల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సహజమైన భాషలో సాగుతూ, అస్పృశ్యత, వివక్ష, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను ప్రశ్నిస్తుంది. ఈ పుస్తకం చదివిన తర్వాత ఇది ఒక్క ఎజ్రా శాస్త్రి జీవితకథ కాదని, ఈ దేశంలోని లక్షలాది అణగారిన జీవితాల సామూహిక ఆత్మకథ అని అనిపిస్తుంది.
ఈ పుస్తక ప్రతుల కోసం: 8096225974..
- ఫిజిక్స్ అరుణ్ కుమార్
93947 49536








కామెంట్‌లు (0)