సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అన్నదాత అవస్థలకు అక్షర రూపం

1 గంట క్రితం

book review
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 05:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

మన దేశంలో వ్యవసాయ రంగ ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘అన్నదాత సుఖీభవ’, ‘జై జవాన్–జై కిసాన్’, ‘దేశానికి వెన్నెముక రైతు’ వంటి ఆదర్శవంతమైన నినాదాలు మన చెవులకు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. మరోవైపు అదే అన్నదాత వెన్నెముకను విరిచేస్తున్న విధానాలు అమలవుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ‘దేశం వెలిగిపోతోంది’ అని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్న గత పుష్కర కాలంలోనే దేశంలో సగటున ప్రతి ఏటా పది వేల మందికి పైగా రైతులు ఆత్మబలిదానాలు చేసుకోవడం అత్యంత విషాదకరమైన వాస్తవం. అంటే రోజుకు కనీసం ముప్పై మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో విశ్రాంత ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ రొక్కం కామేశ్వరరావు రచించిన ‘విత్తు నుండి విక్రయం దాకా’ అనే 26 కవితల సంకలనం వెలువడింది.

ఈ పుస్తక శీర్షికలోనే కవి చెప్పదలచుకున్న ఆవేదన మొత్తం నిక్షిప్తమై ఉంది. రైతు చేతిలో విత్తు పడిన క్షణం నుంచి పంట విక్రయమయ్యే వరకు అతను ఎదుర్కొనే కష్టాలు, దోపిడీ, మోసాలు, అవమానాలు అన్నీ ఈ సంకలనంలో ప్రతిధ్వనిస్తాయి. “కవి ఎప్పుడూ ప్రతిపక్షమే, ప్రజాపక్షమే” అనే విశ్వాసాన్ని గట్టిగా నమ్మిన రచయిత, తన గత పదకొండు ప్రచురణల మాదిరిగానే ఈ పుస్తకంలోనూ అదే నిబద్ధతను కొనసాగించారు. ఇందులోని ప్రతి కవిత అట్టడుగు వర్గాల బాధలను, రైతాంగపు ఆవేదనను, సామాన్య ప్రజల ఆకాంక్షలను తన గొంతుకగా మార్చుకుంది. “దేశం వెలిగిపోతుంటే... మనం ఎందుకు నలిగిపోతున్నాం?” అంటూ ‘భోగం’ కవితలో కవి సంధించిన ప్రశ్న నేటి అభివృద్ధి నమూనాపైనే సూటిగా గురిపెడుతుంది. పాలకుల దృష్టిలో “అభివృద్ధి అంటే అమ్మకం”, “త్యాగం మనది – భోగం వాడిది” అని ఆయన చేసిన వ్యాఖ్య కేవలం కవితా పంక్తి మాత్రమే కాదు, ప్రస్తుత ఆర్థిక విధానాలపై చేసిన తీవ్రమైన రాజకీయ–సామాజిక విమర్శగా నిలుస్తుంది. మన దేశంలో తాను కష్టపడి పండించిన పంటకు తానే ధర నిర్ణయించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నది ఒక్క రైతు మాత్రమే. గిట్టుబాటు ధరను చట్టబద్ధం చేయాలని రైతాంగం దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నా పాలకుల తీరు ‘చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు’గానే ఉంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల నుంచి ఇటీవలి జయతి ఘోష్ కమిటీ సూచనల వరకు ఎన్నో నివేదికలు వచ్చినా వాటిలో ఎక్కువ భాగం అమలుకు నోచుకోలేదు. సరైన మద్దతు ధర లేక, ప్రభుత్వ రుణాలు అందక, మార్కెట్ సదుపాయాలు కరువై, ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతుండటంతో రైతు ఆత్మహత్యలు దేశంలో ఒక విషాద పరంపరగా మారిపోయాయి. ఇదే సమయంలో వ్యవసాయ రంగంలో కార్పొరేటీకరణ వేగంగా విస్తరించింది. విత్తనాల నుంచి పురుగుమందులు, ఎరువులు, మార్కెటింగ్ వరకు ప్రతి దశలోనూ కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యం పెరిగింది. నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులు కూడా రైతుకు అందించలేని ప్రభుత్వాలు, చివరకు “ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోండి” అని సలహా ఇవ్వడం వారి వైఫల్యానికే నిదర్శనం.

దేశంలో నేటికీ అత్యధిక మందికి వ్యవసాయమే జీవనాధారం. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో సుమారు 16 నుంచి 18 శాతం వరకు వాటా కలిగిన ఈ రంగంపై దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. విత్తు నాటినప్పటి నుంచి పంటను విక్రయించే వరకు రైతు ప్రతి అడుగులోనూ దగాపడుతూనే ఉన్నాడని కవి ఆవేదన వ్యక్తం చేస్తారు. అందుకే “జరుగుబాటు లేకే తిరుగుబాటు” అని హెచ్చరిస్తూ, “దేవుణ్ణి, దెయ్యాన్ని ఒకే గాటన కట్టలేను” అంటూ పాలకుల ద్వంద్వ నీతిని నిలదీస్తారు. రైతాంగ గుండెఘోషను హృదయాన్ని తాకే రీతిలో వ్యక్తీకరించిన ఈ కవితా సంపుటి సమాజంపై, వ్యవసాయంపై, ప్రజా విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం.

ప్రతులకు సంప్రదించవలసిన ఫోన్ నంబరు: 81437 59423.

– ఎ. అజ శర్మ

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్