సీనియర్ పాత్రికేయులు, కవి ఉన్నం వెంకటేశ్వర్లు రచించిన “గమనం” తెలుగు సాహిత్యంలో అరుదుగా కనిపించే ఒక విశిష్టమైన కవితా ప్రయోగం. బి.వి. రాఘవులు, వి. శ్రీనివాసరావు, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, విరియపు బాలసుబ్రహ్మణ్యం, ఎం.వి.ఎస్. శర్మ, వి. రాంభూపాల్, వి. చెంచయ్య తదితరులు తమ అభిప్రాయాలను నమోదు చేసిన ఈ గ్రంథం 168 పేజీల విస్తృత కవితా మాలిక. మూడు ప్రధాన సైద్ధాంతిక ప్రవాహాల సంగమం. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంతో ప్రారంభమవుతుంది. జీవ పరిణామ క్రమాన్ని అనుసరిస్తుంది. నరావతారం గురించి చెబుతుంది. కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్య వ్యవస్థల పుట్టుకను వివరిస్తుంది. వర్గ సమాజాల నిర్మాణాన్ని విశ్లేషిస్తుంది. కమ్యూనిస్టు భావజాల పరిణామాన్ని ప్రస్తావిస్తుంది. కార్ల్ మార్క్స్ దాస్ కేపిటల్లోని మౌలిక భావనలను కవిత్వంలోకి తీసుకొస్తుంది. ఈ మొత్తం భావజాలాన్ని భారతీయ తాత్విక ఆలోచనలతో, చారిత్రక అనుభవాలతో, సమకాలీన రాజకీయ పరిణామాలతో మేళవించడం ఈ రచన ప్రత్యేకత. చరిత్ర, సామాజిక శాస్త్రం, రాజకీయ ఆర్థిక శాస్త్రం వంటి సంక్లిష్ట అంశాలను కవిత్వం ద్వారా చెప్పాలనే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది.
తెలుగు కవిత్వంలో సామాజిక చింతనకు, అభ్యుదయ భావజాలానికి ఒక సుదీర్ఘ సంప్రదాయం ఉంది. అయితే మానవ సమాజం మొత్తాన్ని ఒక చారిత్రక గమనంగా చిత్రించిన రచనలు చాలా తక్కువ. “గమనం” ఆ లోటును పూరించడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. ఈ రచనలో సమాజమే కథానాయకుడు. మానవజాతే కేంద్ర పాత్ర. విశ్వం నుంచి భూమి ఎలా ఏర్పడింది? జీవం ఎలా పుట్టింది? మనిషి ఎలా ఆవిర్భవించాడు? వేటాడే జీవితం నుంచి వ్యవసాయ జీవితం ఎలా వచ్చింది? సమాజాలు ఎలా ఏర్పడ్డాయి? వర్గాలు ఎందుకు పుట్టాయి? సంపద ఎవరి చేతుల్లోకి వెళ్లింది? దోపిడీ ఎలా మొదలైంది? వంటి ప్రశ్నలను రచయిత ఒక క్రమంలో తీసుకుంటారు. అందుకే ఈ కావ్యం విడివిడిగా ఉన్న కవితల సమాహారంలా అనిపించదు. మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఒకే ప్రవాహంలో సాగే చారిత్రక గాథలా అనిపిస్తుంది.
ఈ రచనకు మూలాధారంగా నిలిచిన భావన శ్రమ. నాగరికత నిర్మాణంలో పాలకుల పాత్ర కంటే శ్రమజీవుల పాత్ర గొప్పది. కీలకమైనది. రైతు, కూలీ, కార్మికుడు, ఉత్పత్తి సృష్టించే సాధారణ మనుషులే చరిత్ర నిర్మాతలని ఈ కావ్యం చెబుతుంది. సమాజ మార్పులను అర్థం చేసుకోవాలంటే శ్రమ చరిత్రను అర్థం చేసుకోవాలని సూచిస్తుంది. కుటుంబ వ్యవస్థ పుట్టుక నుంచి వ్యక్తిగత ఆస్తి ఏర్పాటువరకు, వర్గ విభజనల నుంచి రాజ్య వ్యవస్థల నిర్మాణం వరకు ప్రతి అంశాన్ని ఇదే దృష్టితో పరిశీలిస్తుంది. ఈ కారణంగా “గమనం” కేవలం చరిత్రను చెప్పే రచన కాదు. చరిత్ర వెనుక పనిచేసిన చోదక శక్తులను వెతికే రచనగా మారుతుంది. మనిషి సృష్టించిన సంపద, దాని పంపిణీ, దాని చుట్టూ ఏర్పడిన అసమానతలు, వాటి వల్ల పుట్టిన సంఘర్షణలు ఈ కావ్యంలో ముఖ్యమైన చర్చాంశాలుగా నిలుస్తాయి.
మార్క్సిస్టు సామాజిక విశ్లేషణ ఈ రచనకు ప్రధాన ఆధారం. అయితే రచయిత అక్కడితో ఆగిపోలేదు. భారతీయ తాత్విక సంప్రదాయాలను కూడా ఇందులో ప్రస్తావించారు. చార్వాకం, బౌద్ధం, భౌతికవాద ఆలోచనలు, ఆధునిక రాజకీయ పరిణామాలు... ఇవన్నీ రచనలో భాగమవుతాయి. అందువల్ల ఈ గ్రంథం వివిధ ఆలోచనా ప్రవాహాల మధ్య జరిగే సంభాషణలా కనిపిస్తుంది. ఒకవైపు చరిత్ర, మరోవైపు తత్వశాస్త్రం, ఇంకోవైపు రాజకీయ ఆర్థిక విశ్లేషణ ఉంటాయి. ఈ మూడింటినీ రచయిత ఒకే దారంలో అల్లే ప్రయత్నం చేశారు. అదే ఈ రచనకు ఉన్న ప్రత్యేకత.
కవిత్వ పరంగా చూస్తే “గమనం” బలం దాని కథన స్వభావంలో ఉంది. ప్రతి భాగం తదుపరి భాగాన్ని అనుసంధానిస్తూ ముందుకు సాగుతోంది. కవి క్లిష్టమైన భావనలను కూడా సరళమైన వాక్యాల్లో చెబుతారు. కొన్ని చోట్ల ఈ రచన చరిత్రను వివరిస్తున్న ఉపాధ్యాయుడిలా కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఉద్యమ సభలో వినిపించే ప్రసంగంలా అనిపిస్తుంది. మరికొన్ని చోట్ల గాథలా ప్రవహిస్తుంది. ఈ భిన్న స్వరాలే దీనికి ప్రత్యేకమైన కవితాత్మక రూపాన్ని అందించాయి. సిద్ధాంతాన్ని కవిత్వంగా మార్చడం ఒక సవాలు. ఆ సవాలును రచయిత ఎంతో ఓర్పుతో స్వీకరించినట్లు ప్రతి అధ్యాయంలో కనిపిస్తుంది. రచయితకు ఉన్న విషయ స్పష్టత భాషలో కూడా కనిపిస్తుంది. అవసరమైన చోట పదునైన పదాలు వస్తాయి. ఉరికించే పదప్రయోగం, వేగంగా ముందుకు తీసుకెళ్లే నిర్మాణం, సంభాషణాత్మక ధోరణి ఈ రచన పఠనీయతను పెంచాయి. మానవ సమాజ వికాసాన్ని అర్థం చేసుకోవడానికి, మున్ముందుకు సాగించడానికి కవిత్వాన్ని సాధనంగా ఉపయోగించిన విశిష్ట రచన ‘గమనం’. విశ్వ ఆవిర్భావం నుంచి ఆధునిక ప్రపంచం వరకు సాగిన మానవ గమనాన్ని, శ్రమ పాత్రను, సామాజిక మార్పుల అంతర్గత చలనాన్ని ఒకే కవితా ప్రవాహంలో ఆవిష్కరించిన గ్రంథం. అధ్యయనం, సిద్ధాంతం, చరిత్ర, కవిత్వం- ఈ నాలుగింటినీ మేళవించిన ఈ రచన తెలుగు అభ్యుదయ సాహిత్యానికి ఓ మేలిమి చేర్పుగా నిలుస్తుంది.
- సుజయ సాహితి









కామెంట్‌లు (0)