మాటల్ని ఈటెలుగా తిరగేస్తుంటే
ఉద్వేగంతో బరువెక్కిన ఆ క్షణాలు
మనసులో నిప్పుల కొలిమిని రాజేస్తూ
మంత్రముగ్ధం అవుతుంటాయి
ఆవేశంతో పెల్లుబికిన నినాదాల మధ్య
'జంతర్‌మంతర్'గా మారి
ఆక్రోశంతో శపిస్తుంటే
కాలం త్రినేత్ర వర్ణమైంది!
చేసిన తప్పును ప్రశ్నించే
కొన్ని చూపుడు వేళ్లు సాక్షిగా
దేశం మొత్తం సామూహికంగా ఒక్కటై
ప్రశ్నల ప్రవాహమై ఉరకలెత్తింది!
ఉప్పెనలా ఎగిసిపడిన యువత
పాలకుల గుండెల మీదకి శివంగిలా దూకి
యుద్ధ ఫిరంగిలా పేలింది
నెత్తురోడిన కాలం
చరిత్రలో రక్తసిక్తమైంది
చిలికి చిలికి చిరుజల్లు
తుఫానుగా మారినట్టు
చైతన్య పరిభాషలో దీనికి ఏ పేరు పెట్టాలి!
బహుశా
భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనేమో!
నిజం చెప్పాలంటే
హింసలేని ఈ ప్రజా ఉద్యమంలో
రేపటి దేశ ముఖచిత్రం కనిపించింది!
చీకటిని చీల్చుకుంటూ
ఉషోదయం ఎప్పటికైనా
ప్రత్యక్షమవ్వక తప్పదు
ఈ విజయమూ అంతే!
రేపటి కలల భవిష్యత్తు మీద
భరోసాతో తిరగబడ్డ
ఓ అప్రకటిత దాడి చిరునామా
'జెన్ జెడ్' విశ్వ చైతన్యానికి
ఓ పరోక్ష వీలునామా!
- మానాపురం రాజా చంద్రశేఖర్








కామెంట్లు (0)