సోమవారం, 20 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నాళ్ళీ దృష్టి మరల్చే కళ?

19 గంటల క్రితం

poetry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 10:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

నా చేతిలో

ఎప్పుడూ ఏదొక దరఖాస్తే

రేషన్ కార్డు కోసమో,

ఆధార్‌లో పేరు సరిచేయించుకోవడానికో,

పింఛన్ కోసమో, ఆరోగ్యశ్రీ కోసమో,

ఓటును నిలబెట్టుకోవడం కోసమో...

నా జీవితాన్ని

ఒక కిటికీ ముందు నిలబెట్టి

నువ్వు నిశ్చింతగా వేడుక చూస్తుంటావు.

"సర్వర్ పనిచేయడం లేదు..."

అనే ఒక్క వాక్యం

నా రోజంతా మింగేస్తుంది

వేలిముద్ర పడదు ఓటీపీ రాదు

తలుపు తెరుచుకోదు.

ఒక యంత్రం నన్ను గుర్తుపట్టే వరకూ

నేను మనిషినని కూడా నిరూపించుకోవాల్సిందే!

నా చేతిలోని టోకెన్

కౌంటర్ దగ్గర వినిపించే సంఖ్యలే

నా ప్రపంచమైపోతాయి!

నువ్వు నా భుజం మీద మెల్లగా

ఒక మతాన్ని ఉంచుతావు

నా నుదుటిపై ఒక కులాన్ని రాస్తావు

నా చుట్టూ ఒక ప్రాంతాన్ని గీస్తావు

చివరికి ఒక జెండాను నా చేతిలో పెట్టి

"ఇదే నీ దేశం అనీ" అంటావు

నేను ఆ జెండా రంగుల గురించే

వాదిస్తూ ఉంటాను

నా ఇంటి పొయ్యిలో

మంట ఆరిపోయిందన్న వాస్తవాన్ని

గమనించలేను!

నా బిడ్డ ఉద్యోగ ప్రకటన కోసం

ప్రతిరోజూ వార్తాపత్రికను తిరగేస్తున్న

వాడి ఆందోళనను చూడలేను

నా తండ్రి మందుల సీసాలో

పెరుగుతున్న ఖాళీనీ నేను చూడలేను

నా ఊరి చెరువు రోజుకో అడుగు చొప్పున

మాయమవుతోందన్న నిజాన్నీ ఎవరూ చెప్పరు!

ఒకరోజు సినిమానే దేశమవుతుంది

మరొకరోజు ఒక వ్యాఖ్యే యుద్ధమవుతుంది

ఇంకోరోజు సోషల్ మీడియానే నా కోపానికి చిరునామా!

అంతలోనే ఒక చట్టం

నా జీవితంలోకి నిశ్శబ్దంగా ప్రవేశిస్తుంది

ఒక హక్కు

నా చేతిలోంచి శబ్దం చేయకుండా జారిపోతుంది!

నేను మాత్రం హ్యాష్‌ట్యాగ్‌లతో గెలిచానని

నన్ను నేనే అభినందించుకుంటాను!

అప్పుడు అర్థమవుతుంది

నన్ను ఓడించింది నీ బలం కాదు,

నా దృష్టిని మరల్చే నీ కళ!

ఎన్నాళ్లిలా? ఏదొకనాడు

నేను క్యూలో నిల్చున్న మనిషిని కాను

ప్రశ్న అడగడం నేర్చుకుంటున్న పౌరుడినవుతాను

ప్రజాస్వామ్యం

ఓటు వేసిన రోజుతో ముగిసే పండుగ కాదనీ,

ప్రతి రోజూ అధికారాన్ని ప్రశ్నించే

సజీవమైన జ్ఞాపకమనీ గుర్తు చేస్తాను!

ఆ జ్ఞాపకం మేల్కొన్న రోజు

సర్వర్లు మాత్రమే కాదు,

మౌనాలూ పనిచేయడం మొదలుపెడతాయి!

కార్డుల కంటే ముందు మనిషి కనిపిస్తాడు

జెండాల కంటే ముందు ఆకలి కనిపిస్తుంది

నినాదాల కంటే ముందు నిజమే వినిపిస్తుంది

ఆ రోజు

తలవంచి క్యూలో నిల్చున్న "నన్ను" కాదు,

తలెత్తి ప్రశ్నించే ఓ పిడికిలిని చూస్తావు!

- దార్ల వెంకటేశ్వరరావు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్