పర్వతమంత పడగవిప్పిన సర్పం అనుకుంది
ఈ నేల మీద ప్రాకే చీమల గుంపు
తన అడుగుల కింద నలగడానికి పుట్టిందని!
కానీ కోట్లాది నిశ్శబ్దపు అడుగులు ఒక్కటై చుట్టుముడితే
ఆ భారీ దేహానికి తన స్వంత బరువే ఉరితాడవుతుందని
ఆ అహంకారపు విషనాగు గ్రహించలేకపోయింది!
మీరు అర్ధరాత్రి కాగితాలపై రాసి...
ఎవరి కంటా పడకుండా నలిపి
డస్ట్‌బిన్ చీకటి గర్భంలోకి విసిరేసిన ఆ నల్లటి కుట్రలు...
మాకు అద్దంలా స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి
మీరు గీసే ప్రతి రహస్య వ్యూహం వెనుక
మా అమ్మానాన్నల జీవితాల్లో
మీరు ఆడిన పాత నాటకపు కాపీలు ఉన్నాయి
మీరు తొడిగిన నక్కతోలును మేం గుర్తుపట్టకపోవడానికి...
మా తండ్రుల నడుములు ఊరకనే వంగలేదు!
మీ పాత నాటకాల చదరంగపు ఎత్తులన్నీ
మా అమ్మల కళ్లలోని కన్నీటి గీతల్లో
మేం ఎప్పుడో చదివేశాం
మీ ఆలోచన మీ మెదడులో పడకముందే...
దాని గమ్యస్థానాన్ని ముందే కొలిచే రక్తం మాది!
మా రక్తం
ఆ పాత కథల నుంచే పాఠాలు నేర్చుకుంది...
మీరు పావును కదపడానికంటే ముందే
మీ ఎత్తుగడల ముగింపును చదివేసింది
మీ పాత సామ్రాజ్యపు కాపలా కళ్లకు దొరకకుండా
'ఇన్‌కాగ్నిటో' నీడలమై మేం సంచరిస్తుంటే...
మీరు ఇంకా నిన్నటి తుప్పు పట్టిన గడియారాలనే నమ్ముకున్నారు!
మీది కాగితాలపై ఆధారపడ్డ నకిలీ అధికారం
మాది గాలిలోనూ... డిజిటల్ దారుల్లోనూ
ప్రవహించే నిశ్శబ్ద ప్రవాహం!
సిస్టమ్‌ను ఏమార్చి, పరిపాలన రూపాన్నే మార్చేద్దామని
మీరు ప్లాన్ చేస్తే...
ఈ దేశపు పాస్‌వర్డ్‌ను అంత తేలిగ్గా మార్చేయగలమని
భ్రమపడకండి
మీ అక్రమ లాగిన్‌లను
క్షణాల్లో రిజెక్ట్ చేయడానికి...
'రాజ్యాంగం, ప్రజలు' అనే
టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను దాటడం అంత తేలిక కాదు
గుర్తుంచుకోండి మిత్రో
మీరు నడిపే భారీ యంత్రాల చప్పుడు కన్నా...
మా నిశ్శబ్దపు స్క్రోలింగ్ వెనుక ఉన్న ఆక్రోశమే ఇంకా బలమైనది!
అధికారం అనేది కిరీటంలో లేదు
ఆ కిరీటాన్ని మోసే నేలలో ఉంది
ఆ నేల ఒక్కసారి కంపించి తిరగబడితే...
ఏ పల్లకీ గాలిలో నిలవదు
మీరు రహస్యంగా దాచాలనుకున్న
ఆ నలిగిన చిత్తుకాగితాలే
ఈ రోజు మీ అహంకారానికి
అంతిమ శాసనం రాస్తున్నాయి
మళ్లీ తలుపులేసి కుట్రల నాటకానికి తెరలేపితే...
ఈసారి కదిలేది వినతిపత్రం కాదు
మీ పాత యుగాన్ని కాలగర్భంలో కలిపే నిశ్శబ్ద భూకంపం!
– పిటి పార్కర్








కామెంట్‌లు (0)