పారిశ్రామిక ప్రగతంతా
ప్రమాదాల ప్రహసనం.
ప్రాణానికి విలువలేదు,
గాయాలకు మందులేదు.
భద్రతపై ఖర్చు శూన్యం,
లాభాలే మనకు ముఖ్యం.
నిరుద్యోగుల సైన్యం బారులు తీరి ఉండగా
ఎందుకింక భయం? ఎవడో ఒకడు దొరకడా?
వీడు రానంటే మరొకడు సిద్ధం- బలిపశువుల క్యూ ఉందిగా?
అతిపెద్ద జనాభాలో అవుతాడెవడో బకరా!
ట్రెయినింగులా? అవి శుద్ధ దండగ.
అవన్నీ పబ్లిక్ సెక్టార్ల ఖాతాలోనేగా, ముందుగా.
మూతబడ్డ ప్రభుత్వ పరిశ్రమలు
మనకు రిక్రూట్‌మెంట్ సెంటర్లు.
కల్పించి చూడు కాస్తంత అభద్రత,
కష్టించి చూపుతారు రాత్రనక, పగలనక.
ఉద్యోగం ఊడితే తెలిసొస్తుందోయ్
ప్రైవేటు రంగం తడాఖా! ఇదేమన్నా మజాకా?
వీధినపడ్డ కుటుంబాలు లబోదిబోమంటున్నాయ్,
షేర్లు కుదేలై ఇన్వెస్టర్లు మొరపెడుతున్నారు.
అప్పులిచ్చేవి ప్రభుత్వ బ్యాంకులే, నిజమే మరి;
ప్రజల సొమ్ముతోనేగా మనం ఆడుకొనేది?
తీర్చకపోతే మాత్రం కొంపేం మునుగుతుంది?
గోడకు వేసిన సున్నం అని వాళ్లకీ తెలుసు!
నష్టం వస్తే దుకాణం మూసేస్తాం, బోర్డు తిప్పేస్తాం;
పేర్లు మార్చేసుకుంటాం, షేర్లు అమ్మేసుకుంటాం.
చేతులు దులిపేసుకుందాం,
ఎవరి కర్మకు వాళ్లను వదిలేద్దాం!
మన చేతిలో ఏముంది? నిమిత్తమాత్రులం;
ఇవాళ ఉంటాం, రేపు పోతాం.
వీలైతే మరో కంపెనీ తెరుద్దాం,
లేదంటే దుబాయో, లండనో చెక్కేద్దాం!
- ఉణుదుర్తి సుధాకర్








కామెంట్‌లు (0)