షాడో ప్రగతినీ సూడో అభివృద్ధినీ
వంటింటి పత్రికల్లో వండి వడ్డిస్తే
లొట్టలేసుకు తింటానికి వాళ్లేం
కరుడుగట్టిన ఫ్యూడల్ సమాజపు
వెట్టికి పుట్టిన చాకిరి పిట్టలేం కాదు
తొక్కి పడేస్తే కుక్కిన పెనుల్లా
పడుండటానికి మన కాలపు
తోలు మందపు కీలుబొమ్మలూ కాదు
వాళ్లు ఈతరం జెన్ ఆల్ఫా తూనీగలు!
అప్పుడే పూసిన మందార మొగ్గల్లా
ఇప్పుడిప్పుడే రాజుకుంటున్న నిప్పు కణికలు!
మీ బిజీ షెడ్యూల్ ప్యాకేజీల రహస్య
మంతనాల గుట్టు పసికట్టలేకున్నా
మీ నట్టింటి చూరుకు వేలాడుతూ
మీ భుజాలమీదెక్కి అల్లరిచేసే
కల్లా కపటం తెలియని బుల్లి పిచ్చుకలు!
వాళ్లు అన్నీ చూస్తున్నారు
ఏ బడి మడిలో ఏ చదువుల పంటకు
ఏ చీడ పడుతుందో
ఏ అధికార్ల ముందు అలిగి కూర్చుంటే
ఏ చీడపీడ ఎలా విరగడవుతుందో
వాళ్లు ఎక్కాలు వల్లించినంత సులభంగా
గుక్కతిప్పుకోకుండా చెప్పేయగలరు
ఇంతకీ వాళ్లు ఏం అడుగుతున్నారు!
మీ కార్లూ, మీ బంగ్లాలూ
మీ బోషాణప్పెట్టెల్లోని కరెన్సీ కట్టలూ కాదు కదా!
మీ సుఖమయ గమనానికి
అనువైన విమానాశ్రయాలో
సీడ్ యాక్సెస్ రోడ్లో, స్టీల్ బ్రిడ్జిలో కాదు కదా
బతుకు పాఠాల అన్వేషణలో
నిత్యం నింగిని చీల్చుకుంటూ
రెక్కలు తెగేలా ఎగురుతున్నా
అందనంత దూరానికి విసిరేయబడ్డ
చదువుల తీరాలను తిరిగి మళ్లీ
తమ దరికి చేర్చమంటున్నారు
రాళ్లూ రప్పల మధ్య బురద కాల్వల్లో
ఈదులాడుతూ సాగాల్సి వస్తున్న
అధ్వాన్నపు అక్షర దారుల్ని
కాస్త కాంక్రీట్ పోసి సరిచేయమంటున్నారు
తరగతి గదుల్లో దాహార్తిని తీర్చే
నిర్మలమైన నీటి వసతుల్నీ
ఆరోగ్యకరమైన విసర్జన శాలల్నీ నిర్మించి
మానసిక బుద్ధి కుశలతతో పాటు
దైహిక శుద్ధి సఫలతనూ
సమకూర్చమంటున్నారు
బుల్లి పిచ్చుకలవన్నీ బుల్లి బుల్లి కోర్కెలే కదా!
అవి కూడా అలక్ష్యానికి గురైతే
ఆగ్రహించకేం చేస్తారు!
అదిగో...! కుంభవృష్టిని సైతం
లెక్కచేయని దున్నపోతుల్ని
తోక మెలిదిప్పి రంకెలేయించగల
జెన్ జీ యువత కూడా రంగంలోకి దిగింది
చూస్తోంటే రంగురంగుల ఇంద్రధనుస్సులు
ఎక్కడో గగనతలమ్మీద కాదు
ఇక్కడే మన బోధనాశాలల
ఇంటికప్పుల మీదే
వెల్లివిరుస్తాయన్న ఆశ అంకురిస్తోంది!
- పతివాడ నాస్తిక్, 94417 24167








కామెంట్‌లు (0)