స్తబ్దత బద్దలైన రోజు
మౌనం మహాప్రభంజనమైన రోజు
చిరు చిరు ఆశలు శబ్దమై విస్ఫోటించిన రోజు
ప్రశ్నలు కాంతి కాళ్లతో కదం తొక్కిన రోజు
జంతర్‌మంతర్ కూడలి ప్రసూతిశాలై
పురిటి నొప్పుల్ని ప్రతిధ్వనించిన రోజు
ప్రపంచం మొత్తం మీవైపే చూసిన రోజు
మీరాగలేదు, మీరు వెనుదిరగలేదు
రాజ్యం లాఠీదేవుళ్లకు
మీ రక్తమాంసాలను నైవేద్యం పెట్టారు
జంతర్‌మంతర్‌లో
రాజ్యదండానికి రక్తాభిషేకం జరిపారు
మీ భవిష్యత్ చిత్రపటానికి
మీరే రంగులద్దుకున్నారు!
మీరు అలసిపోలేదు, మీరు సోలిపోలేదు
శాస్త్రీయ విద్యావిధానం కోసం యుద్ధం ప్రకటించారు
మీ కష్టాల రసాల సారాన్ని
అర్హతలేని నోళ్లల్లో కుక్కే చేతులపై
తిరుగుబాటు జెండా లెత్తారు
మీ కలల ఊయల తాళ్లను కోసేద్దామనుకున్నా
మీ చిరుకోర్కెల పూరేకుల్ని
ఇనప బూట్లతో నలిపేద్దామనుకున్నా
మీ ఆశల ఊపిరిని ఆర్పేస్తున్నా
మీరాగలేదు, వెనుదిరగలేదు
మీ సాహసమే రేపటి బలం
మీ ధైర్యమే రేపటి వెలుగు
మీ చిందిన రక్తమే రేపటి సూర్యోదయం
జెన్ జెడ్ దీపాల వెలుగుల్లో
దేశం దీపావళి చేసుకుంటోంది
ఈ రోజు ఈ నేల పులకించిపోతోంది
మీ త్యాగాల గాలుల్లోంచి
ప్రజాస్వామ్యం కొత్త ఊపిరులందుకుంది
జంతర్‌మంతర్‌లో
భవిష్యత్ ఆశల బిడ్డ ఉదయించింది!
- బొడ్డ కూర్మారావు








కామెంట్లు (0)