సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఈశ్వర్‌కు ఎంవివి స్మారక కథాపురస్కారం

20 గంటల క్రితం

chat
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 05:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

సాహిత్యాన్ని సామాజిక చైతన్యానికి సాధనంగా మలుచుకున్న కథకుడు, పాత్రికేయుడు వెంకటమణి ఈశ్వర్‌కు ఈ ఏడాది 'ఎం.వి.వి. సత్యనారాయణ స్మారక పురస్కారం' లభించడం ఆయన సాహిత్య, పాత్రికేయ, సామాజిక ప్రస్థానానికి దక్కిన విశిష్ట గుర్తింపు. నిబద్ధతతో రచనావ్యాసంగం సాగించిన ప్రముఖ సాహిత్యవేత్త, అనువాదకుడు, అపరాధ పరిశోధక రచయిత ఎం.వి.వి. సత్యనారాయణ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఆగస్టు 5న విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో జరిగే కార్యక్రమంలో ఈశ్వర్‌ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.​

అనకాపల్లి సమీపంలోని సీతానగరంలో 1974లో జన్మించిన ఈశ్వర్‌, జంజాల వెంకటరావు, మణి దంపతుల కుమారుడు. వెంకటరావు పశుసంవర్ధక శాఖలో ఉద్యోగి కావడంతో విశాఖ మన్యం, లంబసింగి సమీపంలోని డౌనూరులో ఈశ్వర్‌ బాల్యం, యవ్వన దశలు గడిచాయి. ఇంటర్మీడియట్‌ వరకు నర్సీపట్నంలో, డిగ్రీని చోడవరంలో పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని ప్రజాశక్తి జర్నలిజం కళాశాలలో శిక్షణ పొందిన ఆయన, అనంతరం 'ప్రజాశక్తి' దినపత్రికలో స్టాఫ్‌ రిపోర్టర్‌గా, సబ్‌ఎడిటర్‌గా వివిధ బాధ్యతలు నిర్వహించారు. 2013లో 'సెంటర్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ సొసైటీ'ని స్థాపించారు. బొబ్బిలి లోక్‌సభ తొలి సభ్యుడు, సోషలిస్టు నాయకుడు కె.ఎస్‌. తిలక్‌, ప్రముఖ కార్మిక నేత, గాంధీ పీస్‌ సెంటర్‌ స్థాపకుడు కె.ఎస్‌. శాస్త్రి వంటి స్వాతంత్ర్య సమరయోధుల సాన్నిహిత్యం ఆయనకు లభించింది. వారి స్ఫూర్తితో ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టారు.

​ఈశ్వర్‌ రాసిన ప్రతి కథకు పాఠకుల ఆదరణ లభించింది. స్వాతి, నవ్య వీక్లీ, జాగృతి, నవ తెలంగాణ, బాలభారతం, నవ మల్లెతీగ, విశాలాక్షి, నెలవంక వంటి సాహిత్య వార, మాసపత్రికల్లో యాభైకి పైగా కథలు ప్రచురితమయ్యాయి. 2023లో 'అకాలం' పేరుతో కథా సంకలనం వెలువడింది. 2021లో 'సహరి' నవలల పోటీలో ఆయన రచించిన 'ఏటిగట్టు' నవల ఎంపికై ప్రచురితమైంది. సామాజిక ఉద్యమ కార్యకర్తగా ఆయన రాసిన ప్రజాభిప్రాయ వ్యాసాలు 'ఆంధ్రజ్యోతి', 'ప్రజాశక్తి', 'వార్త', 'నవ తెలంగాణ', 'స్పెక్ట్‌ వాయిస్‌' తదితర దిన, మాసపత్రికల్లో ప్రచురితమై మేధావులు, ప్రజాస్వామ్యవాదుల ప్రశంసలు పొందాయి. 'సమత ఇంప్రెసన్స్‌' పేరుతో ముద్రణ రంగంలోనూ విలువలకు కట్టుబడి కొనసాగుతున్నారు. ఆయన సాహిత్య, సామాజిక సేవలకు గుర్తింపుగా 'స్వాతి అనిల్‌ అవార్డు', 'డా. కేశవరెడ్డి స్మారక పురస్కారం', 'సోమేపల్లి జాతీయ పురస్కారం', 'షోయబుల్లా ఖాన్‌ స్మారక పురస్కారం' తదితర పురస్కారాలు అందుకున్నారు. ఎం.వి.వి. సత్యనారాయణ స్మారక పురస్కారం వెంకటమణి ఈశ్వర్‌ వ్యక్తిగత విజయానికి మాత్రమే కాదు; నిబద్ధతతో సాగుతున్న ఆయన సాహిత్య, పాత్రికేయ, సామాజిక ప్రస్థానానికి దక్కిన గౌరవం కూడా. సమాజాన్ని ఆలోచింపజేసే ఆయన కలం నుంచి మరిన్ని విలువైన రచనలు వెలువడాలని ఆకాంక్షిద్దాం.

- బి.వి. అప్పారావు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్