స్థలం మారొచ్చు చావు తథ్యం
మారణాయుధం మారొచ్చు
మరణశాసనం మాత్రం అమలవుతుంది.
వయసుతో సంబంధంలేదు
మా మనసుకు విలువే లేదు
మా ప్రాణానికీ అంతేమరి!
చావు ఏవైపు నుండి వస్తుందో
యమపాశం ఎటు నుండి బిగుస్తుందో
కాలయముడు ఏరూపంలో ఉంటాడో
ఒక్కటి మాత్రం ఖాయం
మా ప్రాణాలు గాలిలో కలవడం!
ఊపిరి అనంతవాయువుల్లో కలిశాక
అంతా చేరతారు హడవుడిగా
సాంత్వన వాక్యాలు కోకొల్లలు
దూరవాణిలో ఎక్కడినుండో వస్తాయి
మాకు ధైర్యవచనాలు పలుకుతారు
మా దేహాలకు రక్షణ వాగ్దానాలొస్తాయి
ఇక ఉసురు తీసే వాళ్ళపై ఉక్కుపాదమని
ఉత్తుత్తి మాటలు మళ్ళీ వినబడతాయ్.
సమంగా ఊపిరి తీసుకోనివ్వని
ఈ వ్యవస్థలో ఇక సమానత్వం ఓ కలేనా!
అసలు మాతృస్వామ్యమొకటి
ఈ భూమి మీద నడిచిందంటే
నమ్మబుద్ధవ్వడంలేదు మాకు
ఉండండి.....
ఎవరిదో అడుగుల సవ్వడి వినిపిస్తోంది
చంపడానికి ఏ కొత్తదనాన్ని
మోసుకొస్తున్నాడో?
- జంధ్యాల రఘుబాబు,
సెల్: 9849753298








కామెంట్లు (0)