వారణాసి అనగానే గంగానది, కాశీ విశ్వనాథుడి ఆలయం, ఘాట్లు గుర్తుకొస్తాయి. ఆ నగరానికి మరో ప్రత్యేక గుర్తింపు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ షహనాయి. తన అసాధారణ సంగీత ప్రతిభతో భారతీయ శాస్త్రీయ సంగీతానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఆయన నివసించిన, సుమారు 90 ఏళ్ల చరిత్ర కలిగిన ఇంటిని కూల్చివేయడం సంగీతాభిమానుల్లో ఆందోళన కలిగించింది. భవనం శిథిలావస్థకు చేరడంతో కుటుంబ సభ్యులే ఈ నిర్ణయం తీసుకున్నారని, కొత్త భవనంలో బిస్మిల్లాఖాన్ జ్ఞాపకార్థం మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. అయితే, ఈ నివాసాన్ని యథాతథంగా పరిరక్షించి జాతీయ సాంస్కృతిక వారసత్వంగా గుర్తించాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. ప్రభుత్వాలు సకాలంలో జోక్యం చేసుకోకపోవడం, మహానుభావుల స్మారక కేంద్రాల పట్ల తగిన శ్రద్ధ చూపకపోవడం విచారకరం.
1916 మార్చి 21న బిహార్‌లోని దుమ్రావ్‌లో సంగీత కుటుంబంలో జన్మించిన బిస్మిల్లాఖాన్ చిన్నతనంలోనే మేనమామ అలీబక్ష్ వద్ద షహనాయి నేర్చుకున్నారు. కాశీ విశ్వనాథ ఆలయ పరిసరాల్లో, గంగానది ఒడ్డున గంటల తరబడి సాధన చేసేవారు. అప్పటివరకు పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఆలయ ఉత్సవాలకే పరిమితమైన షహనాయికి శాస్త్రీయ సంగీత కచేరీల్లో ప్రత్యేక స్థానం కల్పించారు. 1937లో కలకత్తాలో జరిగిన అఖిల భారత సంగీత సమ్మేళనంలో ఆయన ప్రదర్శన దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి షహనాయి వినిపించే గౌరవం ఆయనకు దక్కింది. తొలి గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్, యూరప్, అమెరికా, జపాన్ తదితర దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఎడిన్‌బరో అంతర్జాతీయ కళా ఉత్సవం, మాంట్రియల్ ఎక్స్‌పో, కాన్స్ కళా ఉత్సవం, న్యూయార్క్ లింకన్ సెంటర్ వంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై ప్రతిభను చాటుకున్నారు. 'గూంజ్ ఉఠీ షెహనాయ్', సత్యజిత్‌రే 'జల్సాఘర్' చిత్రాల్లోనూ షహనాయి వినిపించారు. 2001లో భారతరత్న అందుకున్న ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు కూడా లభించాయి. 2006 ఆగస్టు 21న కన్నుమూశారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినా బిస్మిల్లాఖాన్ వారణాసిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అమెరికాలో సంగీత పాఠశాల స్థాపించి అక్కడే స్థిరపడాలని వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించారు. అమెరికాలో వారణాసిని పోలిన నగరాన్ని నిర్మించి ఇస్తామని చెప్పినప్పుడు 'అక్కడ గంగానదిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు?' అని ప్రశ్నించారు. కాశీ తనకు కేవలం నివాస ప్రాంతం కాదు, తన సంగీతానికి ప్రాణం పోసిన నేల. ముస్లిం కుటుంబంలో జన్మించిన ఆయన హిందూ దేవాలయాల్లో షహనాయి సాధన చేశారు. ఆలయ ఉత్సవాల్లో సంగీత సేవ అందిస్తూనే తన మత విశ్వాసాలనూ కొనసాగించారు. సంగీతానికి మతం, కులం, ప్రాంతం వంటి హద్దులు లేవని తన జీవితంతో చాటారు. భారతీయ సమాజంలోని భిన్నత్వం, సహజీవనం, సమ్మిళిత సంస్కృతికి ఆయన జీవితం సజీవ సాక్ష్యం. ఆయన సంగీతాన్ని సాధన చేసి, పరిపూర్ణం చేసుకున్న ఇంటిని కోల్పోవడం దేశ ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన జ్ఞాపకం చెరిగిపోవడమే! ప్రధానమంత్రి మోడీ సొంత నియోజకవర్గమైన వారణాసిలోనే ఇలాంటి వారసత్వ కట్టడాన్ని కాపాడేందుకు ఆయన జోక్యం చేసుకోకపోవడంపై రాజకీయ విమర్శలు వ్యక్తమయ్యాయి. బిస్మిల్లాఖాన్ వంటి కళాకారుడికి జన్మనిచ్చిన సమ్మిళిత సంస్కృతికి 'వికసిత్ భారత్'లో విలువ లేకుండా పోవడం దారుణం.
కవులు, రచయితలు, కళాకారులు నివసించిన ఇళ్లను చాలా దేశాలు తమ సాహిత్య, కళా చరిత్రలో భాగంగా గుర్తించి భద్రపరుస్తాయి. జర్మనీలోని బాన్ నగరంలో బీథోవెన్ జన్మించిన ఇంటిని 1889లోనే కొనుగోలు చేసి మ్యూజియంగా అభివృద్ధి చేశారు. రచయిత విక్టర్ హ్యూగో నివసించిన పారిస్ ఇంటినీ మ్యూజియంగా మార్చి ప్రజలకు అందుబాటులో ఉంచారు. మహా కళాకారులు జీవించిన ప్రదేశాలను, వారు ఉపయోగించిన వస్తువులను భవిష్యత్తు తరాలకు అందించడం అక్కడి సాంస్కృతిక బాధ్యతగా భావిస్తున్నారు. మన దగ్గర మాత్రం ఇలాంటి వారసత్వ కట్టడాల పరిరక్షణకు ప్రజలు, సాహిత్యాభిమానులు ఉద్యమించాల్సిన పరిస్థితి! 'దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్' అని దేశభక్తికి గొప్ప నిర్వచనం చెప్పిన గురజాడ అప్పారావు ఇంటిని స్మారక కేంద్రంగా మార్చాలని చాలాకాలం డిమాండ్ చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం ఆ ఇంటిని కొనుగోలు చేసి స్మారక కేంద్రంగా అభివృద్ధి చేసినా, వస్తువుల భద్రత, నిర్వహణపై నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. విశాఖపట్నంలో మహాకవి శ్రీశ్రీ జీవితంతో ముడిపడిన నివాసం విషయంలోనూ పరిరక్షణ డిమాండ్లకు తగిన స్పందన లేకపోవడంతో ఆ జ్ఞాపకాలు కనుమరుగయ్యాయి. తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి జన్మించిన ఎట్టయపురంలోని ఇంటిని తమిళనాడు ప్రభుత్వం 1973లో స్వాధీనం చేసుకుని మ్యూజియంగా మార్చింది. ఆయన నివసించిన పుదుచ్చేరి ఇంటినీ స్మారక కేంద్రంగా అభివృద్ధి చేసింది. రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించిన కోల్‌కతాలోని జోరాసంకో ఠాకూర్‌బారిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రవీంద్రభారతి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ప్రేమ్‌చంద్ ఇంటిని మ్యూజియం, గ్రంథాలయం, పరిశోధనా కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ఉద్యమం ఫలితంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2006లో నిధులు, స్థలం కేటాయించింది. అయితే, ప్రభుత్వాలు మారినప్పుడు పనులు నిలిచిపోవడం వంటి సమస్యలూ ఎదురయ్యాయి.
ప్రముఖ కవులు, రచయితలు, కళాకారుల జన్మస్థలాలు, నివాస గృహాలు, వారు పనిచేసిన ప్రదేశాలను గుర్తించి జాతీయ సాంస్కృతిక వారసత్వ జాబితా రూపొందించాలి. వాటి పరిరక్షణ, నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాంస్కృతిక శాఖలు, పురావస్తుశాఖలు, విశ్వవిద్యాలయాలు, సాహిత్య అకాడమీలు సమన్వయంతో పనిచేయాలి. కుటుంబ సభ్యుల హక్కులను గౌరవిస్తూనే వారసత్వ కట్టడాలను కాపాడేందుకు చట్టబద్ధమైన విధానం రూపొందించాలి. వారణాసిలో బిస్మిల్లాఖాన్ నివాసాన్ని పరిరక్షించడం అంటే భారతీయ సమాజపు ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని, సమ్మిళిత విలువలను కాపాడుకోవడమే! ఈ విలువల అవసరం మరింత పెరిగిన ప్రస్తుత సందర్భంలో ఆయన షహనాయి జ్ఞాపకాలు చెరిగిపోవడం విచారకరం. ఇప్పుడైనా ఆయన వస్తువులు, జ్ఞాపకాలను సేకరించి వారణాసిలో ఒక స్మృతి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అవసరం.
- సత్యాజీ









కామెంట్‌లు (0)