ప్రముఖ కవి, రచయిత, సాహిత్య విమర్శకుడు దారివేముల అనిల్‌కుమార్ రచించిన 'మహాకవి గుఱ్ఱం జాషువా జీవిత విశేషాలు' గ్రంథంలో జాషువా జీవితాన్ని వచన కవితా రూపంలో సమగ్రంగా క్రోడీకరించారు. జాషువా జీవితం, సాహిత్య విశేషాలను నాలుగేసి పంక్తుల వచన కవితల రూపంలో పాఠకుల ముందుంచారు. ముత్యాల సరాల వంటి ఆణిముత్యాల్లాంటి కవితా పంక్తులను అందించారు. ఈ గ్రంథాన్ని గిడుగు వెంకట నాగేశ్వరరావుకు అంకితం ఇచ్చారు. దీనికి ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డాక్టర్ కల్లెపల్లి ఉదయకిరణ్, గిడుగు వేంకట రామకృష్ణారావు ముందుమాటలు రాశారు. గ్రంథాన్ని రెండు భాగాలుగా విభజించి, 18 ఉపశీర్షికలతో రూపొందించారు.
అంటరాని కులముగా ఎంచబడి
ఊరికి దూరముగా వెలివాడలో
చెప్పులు కుట్టి, డప్పులు వాయించే
మాదిగ కులపు ఆడ బిడ్డ లింగమ్మ
వీరయ్య, లింగమ్మల జీవిత విశేషాలను, వారి పుట్టుపూర్వోత్తరాలను రచయిత పరిచయం చేశారు. యాదవ కులానికి చెందిన వీరయ్య, మాదిగ కులానికి చెందిన లింగమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న విధానాన్ని సరళమైన భాషలో వివరించారు. మహాకవి గుఱ్ఱం జాషువా పుట్టుక, బాల్యం మొదలుకొని జీవిత చరమాంకం వరకు ఎక్కడా విడిచిపెట్టకుండా ఆయన జీవిత విశేషాలను పూసగుచ్చినట్లు అందించడంలో రచయిత సఫలమయ్యారు.
మన్మథనామ సంవత్సరమున
వినుకొండ పురమున విస్సమ్మతోటలో
పురిటినొప్పులుపడి లింగమ్మ
జాషువాను కనెను శనివారము
వీరయ్య, లింగమ్మలకు తొలి సంతానంగా జాషువా జన్మించారు. జాషువా బాల్యాన్ని బాలకృష్ణుడితో పోల్చారు రచయిత. చిన్న కృష్ణుడిలాగే బాల జాషువా కూడా అల్లరి చేసేవారని వివరించారు. చుట్టుపక్కల అమ్మలక్కలు ఆయన అల్లరి గురించి లింగమ్మకు చెప్పినప్పుడు, తన బిడ్డ అలాంటివాడు కాదని, ఎంతో మంచి మనసున్నవాడని ఆమె సమర్థించేది.
చీకు చింతలేని నిన్న నాడు
పగ ప్రతీకారములేని స్వచ్ఛ మనసు
బిచ్చమెత్తి అర్థించినా తిరిగిరావు గుర్తులు
తన బాల్యమెంత గొప్పదని తెలిపే కవి
బాల్యం ఎవరికైనా మధురమైనదే. ఆ వయసులో పగలు, ప్రతీకారాలు లేని స్వచ్ఛమైన మనసు ఉంటుంది. రెండు చేతులూ చాచి దేహీ అని వేడుకున్నా బాల్యం తిరిగి రాదనే జాషువా భావాన్ని రచయిత ఈ పంక్తుల ద్వారా పాఠకుల ముందుంచారు.
సమాజంలోని అన్ని కులాల పిల్లలు ఒకచోట కూర్చునేవారు. అయితే మాల, మాదిగ వంటి దళిత కులాలకు చెందిన పిల్లలను మాత్రం ప్రత్యేకంగా మరోచోట కూర్చోబెట్టేవారు. ఆనాటి ఉపాధ్యాయుల ద్వంద్వ వైఖరిని జాషువా తన రచనల్లో ఎత్తిచూపారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ వివక్ష మధ్య, కులపీడనను ఎదుర్కొంటూ చదువుకొని గొప్ప కవిగా సమాజం ముందు నిలిచిన జాషువా ధన్యజీవి.
బతుకు బండి లాగ బడి పంతులయ్య
విద్యా బుద్ధులు బోధించే స్వగ్రామమున
మేనమామ బిడ్డను మనువాడి
మందావారి ఇంటికి అల్లుడు తానాయే
బతుకుదెరువు కోసం జాషువా బడిపంతులయ్యారు. స్వగ్రామమైన చాట్రగడ్డపాడులో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేవారు. తన మేనమామ కుమార్తె మరియమ్మ (మేరీ)ని వివాహం చేసుకున్నారు. ఆమె 46 సంవత్సరాలపాటు అనుకూలవతిగా సంసార జీవితాన్ని సాగిస్తూ జాషువాకు అన్ని వేళలా చేదోడువాదోడుగా నిలిచారు.
జాషువా రచనల ఔన్నత్యాన్ని, వాటిలోని ప్రత్యేకతను కూడా రచయిత వివరించారు.
బాణీలు కట్టి పాటలు పాడుచు
జీవము ఉట్టిపడు చిత్తరువులు గీయుచు
బాల్య మిత్రుడు దీపాల సహచర్యమున
కవిత్వరచనపైన ఆసక్తి కలిగె జాషువా
సంప్రదాయ సాహిత్యానికే పరిమితం కాకుండా జాషువా పాటలు రాసి, వాటికి బాణీలు కట్టి పాడేవారు. వాటికి తగిన చిత్రాలను కూడా గీసేవారు. బాల్యమిత్రుడు దీపాల పిచ్చయ్యశాస్త్రి సహవాసం ఆయనలో కవిత్వ రచనపై ఆసక్తిని పెంచింది. 'ఛత్రపతి శివాజీ' నుంచి 'అనాథ' కావ్యం వరకు ఆయన సాహిత్య ప్రస్థానాన్ని రచయిత చక్కగా వివరించారు.
చివరిగా మహాకవి జాషువా మరణ ఘట్టాన్ని రచయిత హృద్యంగా చిత్రించారు.
హాస్యోక్తులతో అనునిత్యం ఆనందించుచు
ఇతరులను ఆనందపెట్టుచు
ఇక నవ్వలేనని మూగ బాధ అనుభవించే
పక్షవాయువు సోకిన కవి జాషువా
జాషువా వ్యక్తిత్వంలోనే కాదు, ఆయన రచనల్లోనూ హాస్యం వెల్లివిరుస్తుంది. నిత్యం హాస్యోక్తులతో తాను ఆనందిస్తూ, ఇతరులను ఆనందింపజేసిన ఆయన చివరి రోజుల్లో పక్షవాతానికి గురయ్యారు. ఇక నవ్వలేనన్న మూగబాధను అనుభవించారు. ఈ విషాద ఘట్టాన్ని రచయిత హృద్యంగా ఆవిష్కరించారు.
మెలితిరిగిన మీసకట్టు
ఒద్దికైన పంచకట్టు
వల్లెవాటుగా జారిన కండువా
అచ్చతెలుగు వాని చిరునామా జాషువా
విశ్వకవి జాషువా వ్యక్తిత్వాన్ని ఈ నాలుగు పంక్తుల్లో అద్భుతంగా ఆవిష్కరించారు. గ్రంథం చివరలో ఆధార గ్రంథాలతోపాటు అనేక అరుదైన ఛాయాచిత్రాలను కూడా పొందుపరిచారు. సత్యవోలు, గున్నేశ్వరరావు, ఏకదండయ్య పంతులు, ఏకా ఆంజనేయులు పంతులు, జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి తదితర ప్రముఖులతో కలిసి దిగిన చిత్రాలను ప్రసిద్ధ వేటపాలెం గ్రంథాలయం, ఇతర వ్యక్తుల ద్వారా సేకరించి ప్రచురించారు. ఇన్ని అరుదైన ఛాయాచిత్రాలను సేకరించి ఒకే గ్రంథంలో పొందుపరచడం విశేషం. ఈ గ్రంథం కేవలం జీవిత చరిత్ర మాత్రమే కాదు, పరిశోధనాత్మక విలువలున్న రచన కూడా. భవిష్యత్తులో జాషువా జీవితాన్ని, సాహిత్యాన్ని అధ్యయనం చేసే తరాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
— దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి
80962 25974








కామెంట్‌లు (0)