కథాదీపధారి కాళీపట్నం రామారావు మాష్టారు దూరమై అప్పుడే నాలుగేళ్లు గడిచిపోయింది. కథకోసం నిరంతరం ఆలోచించే మాష్టారు కథకి ఒక ఆలయం కట్టి తానున్నాళ్లూ ఆ కథల మధ్య ఒక ఋషిలా కథానిలయానికి వచ్చే కథాభిమానుల్ని, కథకుల్ని ప్రశాంతమైన చిరునవ్వుతో పలకరిస్తూ ఎంత సంతృప్తిగా కనిపించేవారో! ప్రతి ఏటా ఫిబ్రవరి రెండో శనివారం, ఆదివారం నాడు కథానిలయం వార్షికోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించేవారు. రాష్ట్ర నలుమూలల్నుంచే గాక ఇతర దేశాల నుంచి కూడా హాజరైన కథాభిమానులతో కళకళలాడేది కథానిలయం. ఎన్నెన్ని పుస్తకావిష్కరణలో! ఎందరో ఉద్దండులైన ప్రసిద్ధ రచయితలు ఎన్నెన్ని గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేరో! ఎంత వైభవమది!
తండ్రి సంపాదనతో బతకడానికి మనసు అంగీకరించక ఇల్లొదిలి వెళ్లిన ఆత్మాభిమానం ఆయనది. 'తనలో ఏదైనా బలహీనత లేదా ఏదో లోపం ఉందని అనిపిస్తే ఆ స్థితి నుంచి బయటపడి తనను తాను సంస్కరించుకునే మార్గమే కథారచన' అని భావించి కథలో తాను చెప్పినదానికి జీవితాంతం కట్టుబడి నిజాయితీగా జీవించి ఆదర్శంగా నిలిచిన వారు. 'స్వార్జితం కాని విత్తము ప్రమాదకరం' అని కథలో చెప్పిన మాష్టారు చివరిదాకా తన స్వసంపాదన మీదనే ఆధారపడ్డారు. 'సాహిత్యం సమాజాన్ని మారుస్తుందా లేదా? అన్న మాట అటుంచితే "నేను చేసిన రచనలు ఇతరుల మీద ఏ ప్రభావం చూపినా, చూపకపోయినా అవి రాయడానికి చేసిన ఆలోచనల వల్ల నేను మారాననడానికి నిదర్శనాలున్నాయి" అంటారు 'నేనెందుకు రాశాను?' అనే వ్యాసంలో ఆయన. 'రచన చెయ్యడమంటే తనలోని లోపాల్ని తొలగించుకోడానికి, తనను తాను సంస్కరించుకోడానికి రచయిత చేసే ప్రయత్నమే' అని మాష్టారి భావన. అయితే అందరు రచయితలూ ఈ పరిధిలోకి వస్తారా అంటే అనుమానమే!
మాష్టారు భౌతికంగా లేకున్నా ఆయన కథలున్నాయి. కథల్లో ఆయన చూపిన దారున్నాయి. కథల్లోంచే గాక ఒక గొప్ప సందేశంగా సాగిన ఆయన జీవితం నుంచి నేర్చుకోదగ్గ విలువైన పాఠాలెన్నో ఉన్నాయి! మాష్టారి కథల్ని ఇప్పుడు చదివినా కొత్తగానే అనిపిస్తాయి. కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. ఆ మహామానవుడి రచనల్లోంచి, వారు చెప్పిన మాటల్లోంచి స్ఫూర్తి పొందవచ్చు.. "మాష్టారి మూర్తిని కథానిలయంలో ఏర్పాటు చెయ్యడం రానున్న తరాలవారికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందేమో" అని మాష్టారి మొదటి వర్ధంతి సందర్భంగా నా అభిప్రాయం చెప్తే "అది మాష్టారికి ఇష్టం లేదు" అన్నారు. ఆ సంభాషణ అక్కడికి ఆగిపోయింది. నాకైతే వారితో ఏకీభవించాలనిపించలేదు. ఏకీభవించాల్సిన అవసరమూ నాకు కనిపించలేదు. నా మాటతో ఏకీభవించాలనేమీ లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. ఆ అభిప్రాయాల్ని గౌరవిస్తూ నాలా అనుకునేవారూ ఉంటే, అందుకోసం ఆలోచన చేస్తే.. ఏమో... గుర్రం ఎగరావచ్చు..!
మాష్టారి అభిప్రాయానికి వ్యతిరేకంగా కథానిలయంలో మాష్టారి విగ్రహం పెట్టడానికి అభ్యంతరం అయితే కావొచ్చు కానీ శ్రీకాకుళంలోనే మరో చోట పెట్టడం వల్ల ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు. విశాఖ సముద్ర తీరాన శ్రీశ్రీ, రావిశాస్త్రి, వంగపండు వంటి సాహితీమూర్తుల విగ్రహాల్ని చూడగానే ఉద్వేగం, ఒక్కసారి వారితో మన జ్ఞాపకాలు ముప్పిరిగొంటాయి కదా. ఆ అనుభూతి కారా మాష్టారి అభిమానులకు కలగాలని కోరుకోవడం అత్యాశ కాదుగదా! అని మిత్రుల అభిప్రాయం. శ్రీశ్రీ గాని, రా.వి.శా. గాని, వంగపండు గానీ ఎవరైనా తమ విగ్రహాలు ఉండాలని కోరుకున్న వారు కాదుకదా. వారి విగ్రహాలు మనల్ని పలకరించి స్ఫూర్తినివ్వడంలేదా? ఆ వరుసలో కథల మాష్టారి విగ్రహం ఎందుకుండకూడదు? ఈ దిశగా కా.రా. మాష్టారి అభిమానులం ఆలోచన చేస్తే బాగుండుననిపిస్తుంది. విజయనగరం, విశాఖలోనే కాకుండా చాలా చోట్ల గురజాడ కనిపిస్తారు. 'పర్వతాలపేటలో ఒక గిడుగు', 'ప్రియాగ్రహారంలో ఒక గరిమెళ్ల', 'అజ్జాడలో ఒక ఆదిభట్ల', 'శ్రీకాకుళం అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆవరణలో బహుభాషా కోవిదుడు ఒక రోణంకి' విగ్రహాలున్నట్టు - మురపాకలోనో, శ్రీకాకుళంలోనో, విశాఖలోనో కథల మాష్టారి మూర్తిని ప్రతిష్ఠించుకోవడం అది కథకి మనమిచ్చే గౌరవమే అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశవిదేశాల్లోనూ కా.రా. మాష్టారి అభిమానులున్నారు.. పలుకుబడి గలిగిన పెద్దలున్నారు. తలచుకుంటే క్షణాల్లో మాష్టారి మూర్తిని విశాఖ సాగరతీరంలో ప్రత్యక్షం చేయగలరని నా నమ్మకం. మాష్టారు తన గురువులుగా భావించే ఇద్దరు శ్రీశ్రీ, రా.వి.శాస్త్రి గార్ల సరసన ఆ వరుసలో కథల మాష్టారూ ఉంటే ఎంత బాగుంటుందో కదా! పక్కనే వంగపండూ ఉన్నాడు. విశాఖ ఎప్పుడెళ్లినా, ఎందుకెళ్లినా సముద్రాన్ని చూడకుండా, సముద్రతీరానున్న ఆ మూడు మహాసముద్రాల్నీ దర్శించుకోకుండా రావడం కుదిరే పనేనా? నాలుగో సముద్రంగా మాష్టారిని అక్కడ దర్శించగలిగే రోజొస్తే మరింత సంతోషం.
- గంటేడ గౌరునాయుడు








కామెంట్లు (0)