సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కులరహిత సమాజ స్వప్నం

2 గంటల క్రితం

కులరహిత సమాజ స్వప్నం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 06:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఆధునిక తెలుగు సాహిత్యంలో చారిత్రక నవలలకు ప్రత్యేక స్థానం ఉంది. 1872లో గోపాలకృష్ణమ శెట్టి రచించిన ‘శ్రీరంగరాజ చరిత్ర’ మొదలుకొని ఇటీవల వచ్చిన మారుతీ పౌరోహితం ‘ప్రణయ హంపి’ వరకు ఈ ప్రక్రియలో అనేక రచనలు వెలువడ్డాయి. సంఘసంస్కరణోద్యమ కాలం నుంచి అస్తిత్వ ఉద్యమాల వరకు సామాజిక పరిణామాలకు స్పందనగా ఇవి వచ్చాయి. తొలినాళ్ల నవలల్లో గతస్మరణ వర్తమానానికి ప్రేరణగా నిలిస్తే, తర్వాతి రచనల్లో చరిత్రను హేతుబద్ధంగా వ్యాఖ్యానించినవీ, భూస్వామ్య విలువలను తిరిగి ప్రతిష్ఠించినవీ ఉన్నాయి. భగీరథ రచించిన ‘నాగలాదేవి’ (2022) మొదటి కోవకు చెందిన నవల. శ్రీకృష్ణదేవరాయలు, ఆయన రెండో భార్య నాగలాదేవి ప్రేమజీవితాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. దాదాపు 15 ఏళ్ల పరిశోధనతో, హంపి శిథిలాలు, చరిత్ర, శాసనాలు, సాహిత్యాన్ని అధ్యయనం చేసి ఈ నవలను రచించారు. శ్రీకృష్ణదేవరాయల రెండో భార్య చిన్నాదేవి అసలు పేరు నాగలాదేవి. ఆమె తల్లి రూపవల్లి ఒక సంపన్నుని చేతిలో మోసపోయిన మహిళ. ఆ వ్యక్తి ఎవరో ఆమెకు తప్ప నాగలాదేవికి కూడా తెలియదు. అద్భుతమైన నృత్యకళాకారిణి అయిన నాగలాదేవి నృత్యాన్ని చూసి రాయలు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. సామ్రాజ్య నిర్మాతగా, గొప్ప వీరుడిగా పేరొందిన రాయలు కళాప్రియుడు, స్వయంగా కవి కూడా. వీరిద్దరి ప్రేమకు ఎదురైన అడ్డంకులే నవలలో ప్రధాన సంఘర్షణ.

చారిత్రక నవలల్లో నాటి రాజకీయాలు, యుద్ధాలు, రాజ్యనిర్మాణం, ప్రజాపాలన చిత్రణ సహజం. భగీరథ వీటన్నింటినీ నవలలో ప్రస్తావించారు. విజయనగర రాజుల రాజకీయాలు, హత్యాకాండ ఒక పార్శ్వంగా ఉంటే, నేటి సమాజానికి అవసరమైన మరో పార్శ్వం కులాంతర ప్రేమవివాహం. ప్రస్తుతం పరువు హత్యల పేరుతో కులాధిపత్య శక్తులు ప్రేమజంటలను బలితీసుకుంటున్నాయి. పెళ్లి చేసుకుని కలిసి జీవించాలనుకునే యువతకు లేని కులపట్టింపు పెద్దలకు ఉండటం భూస్వామ్య వ్యవస్థ అవశేషాల ప్రభావమే. అలాంటి నేపథ్యంలో ఒక సామ్రాజ్యాధినేత సామాన్య కుటుంబానికి చెందిన స్త్రీని కులాతీతంగా వివాహం చేసుకున్నట్లు చిత్రించడం ద్వారా రచయిత ఆధిపత్య కులవాదానికి సవాలు విసిరారు. ఈ నవల చదువుతుంటే గురజాడ ‘లవణరాజు కల’ గుర్తుకొస్తుంది. అందులో ఒక రాజు మాల యువతిని ప్రేమిస్తాడు. ఆమె తన కులాన్ని వెల్లడించగానే వర్ణవ్యవస్థను సమీక్షించి, ‘వర్ణధర్మమధర్మధర్మంబే’ అని ఖండిస్తాడు. ఇలాంటి భావన ‘నాగలాదేవి’లోనూ కనిపిస్తుంది. రాయలు, నాగలాదేవి ఒకరినొకరు ప్రేమించుకునే సమయంలో ఆయన రాకుమారుడని, ఆమె వేశ్య కుమార్తె అని ఇద్దరికీ తెలియదు. పెళ్లి నిర్ణయం తీసుకున్నాక నిజాలు వెల్లడవుతాయి. నాగలాదేవి భయపడుతుంది. రాయలు కూడా అంతర్మథనానికి గురవుతాడు. కుటుంబం అంగీకరిస్తుందా? ఆమె లేకుండా జీవించగలడా? కులం కన్నా మనసుల కలయిక ముఖ్యం కాదా? అని ఆలోచిస్తాడు. చివరకు ‘నా దృష్టిలో అందరూ సమానం. మనిషికి కులం కన్నా గుణం ముఖ్యం’ (పు.44) అని ప్రకటిస్తాడు. ఈ భావన వేమన చెప్పిన ‘కులము కన్న మిగుల గుణము ప్రధానంబు’ అన్న మాటను గుర్తుచేస్తుంది.

నవల ప్రారంభంలో తిరుమలలో వేంకటేశ్వరుని దర్శించుకున్న యువకుడికి (రాయలు) ఒక చెట్టుకింద బైరాగి తంబూర మీటుతూ ‘ఏ కులజుడైననేమి? ఆకడ నాతడే హరినెరిగినోడు’ అనే తత్వాన్ని పాడుతుంటాడు. ఆ బైరాగి తాళ్లపాక అన్నమయ్య. భక్తకవిగా అస్పృశ్యతను ఖండించి, మానవ సమానత్వాన్ని చాటిన అన్నమయ్య గీతంతో నవలను ప్రారంభించడం రచయిత ఉద్దేశాన్ని సూచిస్తుంది. రాయలు తన ప్రేమ విషయాన్ని అప్పాజీకి చెప్పినప్పుడు ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. నాగలాదేవి ఏ సామంతరాజు కుమార్తె అని అడిగి, ఆమె వేశ్య కుమార్తె అని తెలుసుకున్నాక, రాజ్యక్షేమం కోసం రాచకన్యను వివాహం చేసుకోవాలని సూచిస్తాడు. అప్పటికి రాయలు రాజు కాకపోవడంతో మౌనం వహిస్తాడు. ఆ తర్వాత తిరుమలదేవితో ఆయన వివాహం జరుగుతుంది. మరోవైపు రాయలు సూచనతో హంపి సమీపంలోని సత్రంలో ఉంటున్న నాగలాదేవిపై మంగయ్య అనే ఉద్యోగి మోహం పెంచుకుంటాడు. ఆమె చెంపదెబ్బ కొట్టి అతడిని తరిమేస్తుంది. విరూపాక్ష ఆలయంలో ఏనుగు తిరుమలదేవికి వేయాల్సిన పూలదండను నాగలాదేవి మెడలో వేయడం ఆమెకు రాయలుతో వివాహం జరగబోతోందనే సూచనగా రచయిత చిత్రించారు. తర్వాత మంగయ్య క్షమాపణ చెబుతాడు. రాయలు పంపిన పల్లకిలో నాగలాదేవి హంపి చేరుతుంది.

1509 జూలై 26న రాయలు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. బీజాపూర్ సుల్తానుతో యుద్ధంలో విజయం సాధించిన సందర్భంలో నాగలాదేవి చిత్రపటాన్ని చూస్తున్న రాయలును అప్పాజీ మందలిస్తాడు. అప్పుడు రాయలు ‘మాకు అన్ని కులాలూ సమానమే’ అని స్పష్టం చేస్తాడు. రాజు కాకముందు మౌనంగా ఉన్న రాయలు, అధికారంలోకి వచ్చాక తన నిర్ణయాన్ని బలంగా ప్రకటించడం ఇక్కడ గమనించదగిన పరిణామం. అనంతరం నాగలాదేవిని వివాహం చేసుకుంటాడు. ఆమె చిన్నాదేవి అవుతుంది. ఈ వివాహాన్ని రాయలు తల్లి నాగాంబ, పినతల్లులు ఓబాంబ, తిప్పాంబ, మొదటి భార్య తిరుమలదేవి తొలుత అంగీకరించరు. తిమ్మరుసు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తాడు. అయితే తిరుమలదేవి తర్వాత మనసు మార్చుకుని చిన్నాదేవిని స్వయంగా పెళ్లిపీటల మీదకు తీసుకువస్తుంది. రాజాజ్ఞను ధిక్కరించలేక తిమ్మరుసు ఏర్పాట్లు చేస్తాడు. రాయలు గురువు వ్యాసతీర్థ మాత్రం ఈ వివాహాన్ని సాహసోపేతమైన చర్యగా ప్రశంసిస్తూ, జాతికి మంచి సందేశమిచ్చిందని అభినందిస్తాడు. 1510 జనవరి 24న జరిగిన పట్టాభిషేకంలో రాయలు చిన్నాదేవిని కుడివైపు, తిరుమలదేవిని ఎడమవైపు కూర్చోబెట్టుకుంటాడు. అయినప్పటికీ అంతఃపురంలో చిన్నాదేవికి వివక్ష తప్పదు. రాయలు పక్కన ఉన్నప్పుడు గౌరవం లభించినా, ఆయన లేనప్పుడు పట్టించుకునేవారు కాదు.

నాగలాదేవి పుట్టిన ఊరు హరిగంధాపురం. ఆమె జ్ఞాపకార్థం రాయలు ఆ గ్రామం పేరును నాగలాపురంగా మార్చి, వేదనారాయణస్వామి ఆలయాన్ని ఆధునీకరిస్తాడు. అప్పుడు రాయలు తన ఆకాంక్షను స్పష్టంగా ప్రకటిస్తాడు. ‘సమాజంలో కుల ముద్ర చెరిపేయాలన్నదే రాజుగా మా ఆకాంక్ష. మనిషి మనిషిగా బతకాలి తప్ప భేదభావాలు ఉండకూడదు’ (పు.141) అని చెబుతాడు. రాయలు యుద్ధాల్లో ఉన్నప్పుడు చిన్నాదేవి ప్రజాపాలనను పర్యవేక్షించడమే కాక, స్వయంగా యుద్ధంలో పాల్గొని విజయం సాధిస్తుంది. అదే సమయంలో స్త్రీల పట్ల జరిగే అవమానాలను సహించని వ్యక్తిత్వాన్ని కూడా ప్రదర్శిస్తుంది. గజపతులతో యుద్ధం సందర్భంగా పద్మావతిని, ఆమె కుమారుడు వీరభద్రగజపతిని నిర్బంధించడాన్ని తప్పుబడుతుంది. రాయలు తన చర్య సరైంది కాదని అంగీకరిస్తాడు.

‘నాగలాదేవి’ కులరహిత సమాజాన్ని ప్రతిపాదిస్తూ, ప్రేమవివాహాలను సమర్థించే నవల. సామాజిక మార్పు ప్రజా ఉద్యమాల ద్వారా రావచ్చు. లేదా పాలకులే మార్పుకు నాంది పలకవచ్చు. ఈ నవల రెండో మార్గాన్ని ప్రతిపాదిస్తుంది. పాలకులు తమ నుంచే మార్పును ప్రారంభిస్తే సమాజంలో పరివర్తన సాధ్యమని రాయలు పాత్ర ద్వారా రచయిత చెబుతారు. రాజ్యాధికారం ఉన్నవారు కులవివక్షను నిర్మూలించేందుకు చొరవ తీసుకోవచ్చని, అవకాశం కల్పిస్తే ఏ కులానికి చెందినవారైనా సమర్థంగా పాలించగలరని చిన్నాదేవి పాత్ర ద్వారా నిరూపిస్తారు. స్వాతంత్య్రానంతరం భారత పాలకులు కులనిర్మూలనను తమ ప్రధాన సామాజిక ఎజెండాగా స్వీకరించకపోవడం పెద్ద లోపం. కులాంతర వివాహాలు చేసుకున్నవారికి కొంత ఆర్థిక సహాయం అందించడానికే ప్రభుత్వ చర్యలు పరిమితమయ్యాయి. ఇప్పటికైనా కులనిర్మూలన రాజకీయ ఎజెండా కావాలి. రాజ్యం, మతం, కులం పరస్పరం ముడిపడిన వ్యవస్థలు. రాజ్యం కుల, మత ఆధిపత్యాలను పోషిస్తే అసమానతలు కొనసాగుతాయి. వాటిని నిర్మూలించే దిశగా పనిచేస్తేనే సమానత్వ సమాజం సాధ్యమవుతుంది.


- రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

94402 22117

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్