సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జీవితం పట్ల కృతజ్ఞత చాటిన కథలు..

5 గంటల క్రితం

జీవితం పట్ల కృతజ్ఞత చాటిన కథలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 05:00 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఏ రచన మనిషిలోని సున్నితమైన మూలల్ని తడిమి, జీవన వివేకాన్ని వెలిగిస్తుందో, అటువంటిదాన్ని గుర్తించడం పెద్ద కష్టం కాదు. పాఠకుడు అసంకల్పితంగా నిశ్శబ్దం కావడం, కళ్లలో తడి నింపుకోవడం, ఏదో ఒక సంతృప్తికి లోనవడం వంటి లక్షణాలు కనిపిస్తే, తెలియని ఉద్వేగాలు అతణ్ణి చుట్టుముడతాయి. మారుతి కథలతో మన ప్రయాణం అటువంటిదే. వాటిని చదివాక మనం ఉన్న స్థితిని విడిచి వేరొక చోటికి ఎప్పుడు చేరుతున్నామో చాలా సేపటిగానీ తెలియదు. మనం ఉన్న స్థితికీ, మరొక స్థితికీ మధ్య తేడా ఏమిటి? ఆ తేడాను తెలియజెప్పినవే ఈ ‘ఇల్లిడిసిపెట్టిన తొమ్మిది కథలు’.

మారుతి స్వభావంలోనే చారిత్రక ఆసక్తి ఉంది. అతను రాసిన ‘ప్రణయహంపి’ నవలను దృష్టిలో ఉంచుకుని నేనీమాటలు అనడం లేదు. అతని రచనల్లోని భవిష్యద్వర్తమానాలు జీవితం యొక్క గతం చేత ప్రభావితమవడం ఈ కథల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నిజానికి అదే అతని కథలకు ఉన్న సూత్రంగా (ఫార్ములా) తోస్తుంది. ‘కొల్లాయిగడితేనేమి’ నవలా విమర్శ చేస్తూ ‘చారిత్రక శక్తులకు ప్రతినిధులైన పాత్రల సంఘర్షణ ఏ పక్షం వహిస్తాయో’ రారా చెప్పిన మాటలు ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. గత కాలపు ఘటనల సారాంశంతోనే మారుతి కథల్లోని వర్తమాన సాఫల్యత సిద్ధిస్తుంది. ‘విప్రతీసారం’లో నారాయణస్వామి, ‘అస్మిత’లో మాళమ్మ, ‘పిల్లోళ్ళు వొస్తారు’లో మద్దిలేటి, ‘వయా సౌదీ ఓ ప్రేమ కథ’లో షేక్ దౌలత్ బీ — ఈ పాత్రల గత చిత్రణ కథనానికి ఆలంబన కావడం మారుతిలోని చారిత్రక దృష్టికి సాక్ష్యం. అయితే రారా ఉటంకించిన జ్ఞానదానదృష్టి (Didactic/Pedagogic) మారుతిలో నాకు కనబడలేదు.

‘సియాల్ కోట్ టు గడివేముల వయా సౌదీ ఓ ప్రేమ కథ’లో పాకిస్తాన్‌కు చెందిన గుల్జార్ దుబాయ్ నుంచి ఎమర్జెన్సీ సెర్టిఫికేట్‌పై వచ్చి, ఈ దేశపు ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. రచయిత కథాంతంలో ఎన్నార్సీ (NRC) చట్ట వివాదాలతో కథను ముడిపెట్టే వ్యర్థ ప్రయత్నం కూడా చేస్తాడు. కానీ కోర్టుల చుట్టూ తిరిగే దౌలత్ బీ, ‘ఒకవేళ నీవొక్కడివే పాకిస్తాన్‌కు వెళ్లడానికి అనుమతి ఇస్తాం, వీరిని ఇక్కడే వదిలి వెళ్లమంటే ఏం చేస్తావు’ అని అరెస్టయిన గుల్జార్‌ని అడుగుతుంది. ‘చావనైనా చస్తాను కానీ పిల్లోళ్ళను, నిన్ను వదిలి వెళ్లను. నీ కోసం, నీ ప్రేమ కోసం, నీకిచ్చిన మాట కోసమే ఇక్కడికి వచ్చాను’ అంటాడు. మన గుండె కలుక్కుమంటుంది. ఇటువంటి అనుసంధాన చాతుర్యమే మిగతా కథల్లోనూ కనిపిస్తుంది. జీవితానుభవాల్ని, హేతుబద్ధతని రచయిత ఎలా తూకం వేస్తున్నాడో ఇక్కడ అర్థమవుతుంది. మారుతిలోని సృజనాత్మకతకు ఉధృతమైన ఊహాశాలీనత కన్నా సావకాశ ఆలోచనా శక్తే కారణం. ఆలోచనకీ, ఊహకీ భేదం ఉంటుందంటే ఒప్పుకోనివారుంటారా? ఈ సంపుటిలో ‘టైలర్ శ్యామణ్ణ’, ‘తాతారావ్ అలియాస్ రజనీకాంత్’ కథలు కొంత ప్రత్యేకమైనవి. వీళ్లు బహుశా మారుతి నిజజీవితంలో స్వయంగా దర్శించిన పాత్రలుగా అనిపిస్తాయి. వాటి కథనంలోని గాఢత ఇందుకు నిదర్శనం. రచయిత కాల్పనికత కన్నా వాస్తవ అనుభవాన్ని పాఠకుడు త్వరగా పట్టుకోగలుగుతాడు. ఇది ఏ తాత్విక తర్కం (philosophical logic) లేకుండానే సహజంగా జరగడం వెనుక రచయిత విశేష ప్రతిభ దాగి ఉంటుంది.

మారుతి సత్యాన్వేషణ కోసం కథల్ని నడిపించినట్టే, కథా వస్తువుల్లో కొంత సంప్రదాయక స్వభావం కోసం కూడా వెంపర్లాడినట్టూ తోచింది. ఏదో పరిష్కార పూర్వకత (Absoluteness) కోసం తాపత్రయపడుతున్నాడా అన్న ఆలోచన వస్తుంది. దాన్ని ప్రాణేష్ ఆచార్ వంటి పాత్రల పేర్లు, ‘విప్రతీసారము’ వంటి కథా శీర్షికలు బలపరుస్తాయి. ‘పిల్లోళ్ళు వస్తారు’ కథలో విడిపోయిన భార్యాభర్తల మధ్య పిల్లలు తండ్రి దగ్గర పెరుగుతారు. తల్లి దగ్గరకు వెళ్లిన పిల్లలు తిరిగి తన దగ్గరకే రావాలని తండ్రి బాధపడటంతో కథ ముగుస్తుంది. తండ్రి మద్దిలేటి కన్నా రచయితే ఆ పిల్లలు తిరిగి తండ్రి వద్దకు రావాలన్న స్పృహ కలిగించాలనుకుంటాడు. ‘అమ్మ పోస్టు చేయలేని ఉత్తరం’ కూడా ఆ కోవకు చెందిన కథే.

‘టైలర్ శ్యామణ్ణ’, ‘తాతారావు’లు కథ కావడంలో సఫలమైన వాస్తవికతలైతే, కంభంపాటి సాయినాథ్ శర్మని కథగా ఒప్పుకోలేని వాస్తవికత ఒకటి మనకు అడ్డుపడుతుంది. మనుషుల పట్ల (వెంకటకృష్ణ అన్నట్టు నిష్టూరభరితమైన) మానవ సంబంధాల పట్ల మనకుండే ఆపేక్షల నుంచి విడివడి అన్ని సందర్భాల్లోనూ వాస్తవికంగా ఆలోచించడం కష్టం. అటువంటి నైతిక ఆవశ్యకత (Moral reality అంటే సబబేమో) ఏ సందర్భంలో మనల్ని మనకి తెలియకుండానే లోబర్చుకుంటుందో తేల్చలేము. సాయినాథ్ గురించిన కథ ఒక ఉత్తరం. దీన్ని లేఖారూప కథ అనాలి కామోసు. విషయం అత్యంత గంభీరంగా ఉండటంతో శిల్పం దాన్ని పూర్తిగా ఇముడ్చుకోలేకపోతుంది. ఇందులోని భాష కూడా మిగతా కథలకంటే వేరుగా ఉంటుంది. సాయినాథ్‌కి ఈ పుస్తకాన్ని అంకితం చేయడం వల్ల కూడా ఈ లోపం సంభవించింది. పిల్లల్ని పెంచడంలో ఎదురవుతున్న ఆధునిక సమస్యల్ని చిత్రించిన ‘విప్రతీసారము’ కూడా అటువంటి తడబాటుకు లోనైనా, చివరకు మనల్ని హత్తుకుంటుంది.

మారుతి తన కథాశిల్పాన్ని రాయలసీమ నుడికారంలోంచి నిర్మించుకుంటారు. ఏ భాషా పలుకుబడి అయినా మన చుట్టూ ఉండే జీవితాన్ని అర్థం చేసుకోవడానికి మరింత వీలు కలిగిస్తుందనుకున్నప్పుడు, ఆయా సామాజిక ప్రవర్తనలోని ముడి పదార్థమో, మూల కారణమో దొరకబుచ్చుకున్నట్టే కదా. మారుతి కథల్లోని భాష పాత్రల అభివ్యక్తికి నప్పుతుంది. భాషాపరమైన అర్థాల్ని స్థిరీకరించే కన్నా, వ్యవహారికాన్ని సౌందర్యాత్మకంగా ప్రయోగించిన నేర్పు మెచ్చుకోదగ్గది. కనుకనే ఆ మాండలికం వేరే ప్రాంతాల వారికి కూడా సులువుగా అర్థమవుతుంది. రావిశాస్త్రి, అల్లం రాజయ్య వంటి వారి రచనలు ప్రాంతాల్ని దాటి వెళ్లాయంటే వేరే కారణం లేదు. రాయలసీమ అస్తిత్వ స్పృహ ఉన్న రచయిత కావడం చేతనే మారుతి ‘కన్నీటి మేఘం’ రాశారు. సీమలో నీళ్లు లేనితనం ఎన్నేళ్లైనా పునరుక్తమయ్యే సీరియస్ విషయం. మరొక కథలో రాయలసీమ తనని ఆదరించిన ఆత్మీయురాలిగా భావించిన తాతారావు పాత్రని మారుతి గొప్పగా సృష్టించగలిగారు.

మారుతి కథనం గురించి ముందు మాటలో అనంతు గారు ఉటంకించిన మాటలు వాస్తవమైనవి. సంభాషణల్లో సుదీర్ఘత సహజత్వాన్ని హరిస్తుంది. కావాల్సిన నాటకీయతను సైతం బలహీనపరుస్తుంది. మారుతికి ఆ అదుపు కొంత అవసరం. అది లేకపోవడం చేత ‘అమ్మ పోస్టు చేయలేని ఉత్తరం’ కథా చట్రంలోంచి బయటకి వచ్చేసింది. ‘టైలర్ శ్యామణ్ణ’లో దర్జీపని గురించి కవితాత్మకంగా (బాగున్నప్పటికీ) అవసరమైనదానికంటే ఎక్కువ చెబుతారు. అటువంటిదే ‘84 వనవాసం నెంబరోడు’లో మట్కా జూదం గురించిన వివరణ. ఇటువంటివి ప్రక్రియా ప్రభావాన్ని పల్చన చేస్తాయని నాలాంటివాడి భయం. ‘అస్మిత’ బసివినుల సమస్యని తీసుకుని అద్భుతంగా రాసిన కథ. కానీ మాళమ్మ, మల్లికార్జునల సంభాషణల్ని కొంత తగ్గించి ఉంటే కథలోని గాఢత మరొక వంద రెట్లు పెరిగి ఉండేది. శిల్పపరంగా ‘పిల్లోళ్ళు వస్తారు’ మెచ్చదగినది. ఆ తర్వాత ‘సియాల్కోట్ టు గడివేముల’ కథ. వాటి నిర్మాణంలోనే ఒక అందం ఉంది.

మారుతి కథా వస్తువుల మాస్టరు. ఆయన కథల్ని తయారుచేసుకునే పద్ధతి ఎటువంటి వస్తువునైనా తనలో సంలీనం చేసుకుంటుంది. అందుకే ఈ సంకలనంలో అనేక విభిన్నమైన కథా వస్తువులు సాధ్యమయ్యాయి. ‘పద్ధతి’ అన్నాను కనుక, అది శిల్ప వ్యవహారం కాదు. వస్తు విన్యాసమే! ప్రాంతీయ చైతన్యాన్నీ, సీమ అస్తిత్వ వలపోతనీ కాస్తంత పక్కనబెడితే మారుతిలో ఒక గొప్పదనం చూడగలిగాను. అది జీవితం పట్ల హృదయపూర్వక కృతజ్ఞత చాటిన లక్షణం. అతని కథలు నడిచే నేలకు నమస్కరిస్తాయి. పీల్చే గాలికి పరవశిస్తాయి. మనని ఆలోచనా మార్గంలోకి నడిపే వెలుతురుకి వేవేల సార్లు మోకరిల్లుతాయి. కథల్లోని పాత్రలన్నీ ఎందుకు ఇల్లిడిసి పెట్టాయో, అలా ‘ఇడిసి’ పెట్టడం మనకేం నేర్పుతుందో కూడా నాకు ప్రాధాన్యం అనిపించలేదు. ఎందుకంటే ఈ యప్ప మనిషి తన సార్థక జీవితం బుడనాశనం కాకుండా ఏం ‘ఇడిసి’ పెట్టాలో, జాగ్రత్తగా గుప్పిట్లో ఏం పట్టుకోవాలో ఇడమర్సి చెప్పినట్టు చెప్పే. అంతే!


‘ఇల్లిడిసిపెట్టిన తొమ్మిది కథలు’ (కథలు) - మారుతి పౌరోహితం, పేజీలు - 126, ధర - 160, ప్రతులకు - 70931 65151.

- శ్రీరామ్ పుప్పాల

99634 82597

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్