సిపిఎం జెడ్‌పిటిసి, ఎంపిటిసిల అభ్యర్థులను గెలిపించండి
పార్టీ అభ్యర్థుల ప్రచారంలో రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి - యంత్రాంగం : పోలవరం నిర్వాసితులకు న్యాయమైన పరిహారం, గిరిజనుల హక్కులు, పోడు భూములకు పట్టాలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక పార్టీ సిపిఎం అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిపిఎం జెడ్‌పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. శనివారం పోలవరం జిల్లా విఆర్.పురం, చింతూరు మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లను పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ ఎన్నికల గుర్తు సుత్తి, కొడవలి, నక్షత్రంతో కూడిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. విఆర్.పురం మండలంలోని చొప్పల్లి మీదుగా రామవరం, వడ్డిగూడెం, విఆర్.పురం, రాజుపేట, రేఖపల్లి ప్రాంతాల్లో ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ప్రచారం చేశారు. రామవరం, వడ్డిగూడెం, రేఖపల్లిల్లో జరిగిన సభల్లో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విలీన మండలాల్లో ప్రతి ఏడాదీ ముంపు సమస్యలు తలెత్తుతున్నా నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, పునరావాస సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. 15 ఏళ్లుగా పోలవరం నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించాలని సిపిఎం అలుపెరుగని పోరాటం చేస్తోందని తెలిపారు. చట్టసభల్లో, స్థానిక పరిషత్తుల్లో ప్రజా సమస్యలపై గళం వినిపించాలన్నా, గ్రామాల్లో మౌలిక వసతులు సాధించాలన్నా సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఓట్ల కోసం డబ్బు ఆశ చూపే పార్టీల మాటలు నమ్మవద్దని, పన్నుల భారంతో సామాన్య ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్న పాలకుల విధానాలను వ్యతిరేకించాలని కోరారు. రామవరం పంచాయతీ పరిధిలోని రామవరంపాడు గ్రామంలో 104 కుటుంబాలకు సంబంధించి పోలవరం సర్వే విషయంలో ప్రభుత్వం ఒకవైపు సర్వే చేసి, మరోవైపు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వివరించారు. ఈ సమస్యపై తమ పార్టీ అనేక ఉద్యమాలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. రేఖపల్లి, అన్నవరం, శుద్ధిగూడెం, ఉమ్మడివరం, ఎస్సీ కాలనీ, గొల్లగూడెం గ్రామాల్లో తక్షణమే సర్వే నిర్వహించి నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందించాలని డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవి.నాగేశ్వరరావు మాట్లాడుతూ... ఉపాధి హామీ, అంగన్‌వాడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో పార్టీ జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, పార్టీ జెడ్‌పిటిసి అభ్యర్థి కారం సుజాత, ఎంపిటిసి అభ్యర్థులు సున్నం రాజులు, కారం సుందరయ్య, పులి సంతోష్ కుమార్, సొంది నాగమణి, చింతకాయల రజిని, పూసం రవివర్మ, కొనాలా శేషమ్మ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
చింతూరు మండలంలో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ చింతూరు మండల కేంద్రంలో వి.శ్రీనివాసరావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. స్థానిక జెడ్‌పిటిసిగా మిడియం శ్రీదేవి, తొమ్మిది ఎంపిటిసి స్థానాల నుంచి తమ పార్టీ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారన్నారు. వారంతా పలు పోరాటాల్లో కీలక భూమిక పోషించారన్నారు. మండల కేంద్రంలోని లారీ యూనియన్ కార్యాలయం నుంచి శ్యామల వెంకటరెడ్డి స్మారక భవన్, ఆదివాసీ అమరవీరుల సెంటర్, అంబేద్కర్ సెంటర్ మీదుగా ఎర్రంపేట వరకూ ప్రచార ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా నాయకులు పల్లపు వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

ఉధృతంగా ప్రచారం
పోలవరం జిల్లా కూనవరం మండలంలో పెద్దార్కూరు పరిధి సిపిఎం ఎంపిటిసి అభ్యర్థి పాయం సీతారామయ్యను, బొజ్జరాయిగూడెం ఎంపిటిసి అభ్యర్థి గుండం బుచ్చమ్మను, చింతూరు మండలం మోతుగూడెం ఎంపిటిసి అభ్యర్థి కిలో రాధమ్మను గెలిపించాలని పలుచోట్ల ప్రచారం నిర్వహించారు. రాజవొమ్మంగి సిపిఎం జెడ్‌పిటిసి అభ్యర్థి లోతా రామారావును గెలిపించాలంటూ వారపు సంతలో సిపిఎం విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ ప్రచార ర్యాలీకి స్వచ్ఛందంగానే పెద్ద సంఖ్యలో గిరిపుత్రులు తరలివచ్చారు. బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర నాయకులు వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తి, నిస్వార్ధపరుడైన రామారావును గెలిపించుకుంటే మండలం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు జి.రామన్న, కె.ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలంటూ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం తదితరులు ర్యాలీ చేపట్టారు. సిపిఎం అరకులోయ జెడ్‌పిటిసి అభ్యర్థి జి.చిన్నబాబును గెలిపించాలంటూ మండలంలోని మాడగడ పంచాయతీలో ప్రచారం నిర్వహించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సిపిఎం జెడ్‌పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మెంటాడ మండలంలో సిపిఎం జెడ్‌పిటిసి అభ్యర్థి సిడగం శాంతి, గుర్ల తమ్మిరాజుపేట ఎంపిటిసి అభ్యర్థి గేదెల పెదరాము, ఆండ్ర ఎంపిటిసి అభ్యర్థి రాకోటి రాములు, ఇప్పలవలస ఎంపిటిసి అభ్యర్థి చిలక సింహాచలమ్మ, పిట్టాడ అభ్యర్థి తామరపల్లి కుమారిని గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు కుంటినవలస, కొండపర్తి, మెంటాడ, పిట్టాడ, ఉయ్యాడవలస గ్రామాల్లో ప్రచారం చేశారు. గుమ్మలక్ష్మీపురం మండలం చెముడు గూడ సిపిఎం ఎంపిటిసి అభ్యర్థి బిడ్డిక చామంతి, జెడ్‌పిటిసి అభ్యర్థి మండంగి శ్రీనివాసరావు ప్రచారం నిర్వహించారు. కొమరాడ మండలం కూనేరు సంతలో పూడేసు ఎంపిటిసి అభ్యర్థి కొండగొర్రి మధు, చోళ్లపదం ఎంపిటిసి అభ్యర్థి ప్రచారం చేశారు. పాచిపెంట మండలంలోని గొట్టూరు ఎంపిటిసి అభ్యర్థి గెమ్మెల పైడితల్లి... వేటగానివలస, ఇప్పలవలస, మెట్టవలస తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బలిజిపేట మండలంలో పెద్దింపేట పంచాయతీ పోలినాయుడు వలస, గౌరీపురం, రాయివలస, పెదమాయివలస, పలగర దళిత కాలనీ, నూకలవాడలో ఎంపిటిసి అభ్యర్థులు బొద్దన భానుమూర్తి, వెన్నె లక్ష్మి, సీతంపేట మండలంలో పూతికవలస ఎంపిటిసి అభ్యర్థి మండంగి కాంతారావు ప్రచారం నిర్వహించారు.
అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి మండల సిపిఎం జెడ్‌పిటిసి అభ్యర్థి కాళ్ళ తేలయ్యబాబు... మండలంలోని కొత్తూరు, మూలపేట, జగన్నాధపురం, తుమ్మపాల, వెంకుపాలెం, సీతానగరం, మెట్టపాలెం గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. కె.కోటపాడు మండలం సింగన్నదొరపాలెం సిపిఎం ఎంపిటిసి అభ్యర్థి ఈర్లె నాయుడుబాబు కొత్త అగ్రహారం, సింగన్నదొరపాలెంలోనూ, రాంబిల్లి మండలం కొత్తపట్నం గ్రామంలో సిపిఎం జెడ్‌పిటిసి అభ్యర్థి మైలపల్లి లక్ష్మి, కొత్తపట్నం ఎంపిటిసి అభ్యర్థి ధోని లక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కర్నూలు జిల్లా దేవనకొండ మండల జెడ్‌పిటిసి అభ్యర్థి బోయ పావని, ఎంపిటిసి అభ్యర్థులు రవీంద్రబాబు, కౌలుట్లయ్యస్వామి విజయాన్ని కాంక్షిస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పాలక, ప్రతిపక్ష పార్టీలు మాటలు చెబుతున్నాయే తప్ప ఆచరణలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఏళ్లు గడుస్తున్నా రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపడం లేదన్నారు.
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం ఎనికపాడు గ్రామం సిపిఎం జెడ్‌పిటిసి అభ్యర్థి నెరుసుల ప్రేమకుమారి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో సిపిఎం జెడ్‌పిటిసి అభ్యర్థి కొల్లి ఎల్లయ్య, టెక్కలి ఎంపిటిసి-1, 8 అభ్యర్థులు నంబూరు షణ్ముఖరావు, కిల్లాన డేనియల్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. కొత్తూరు మండలం గొట్టిపల్లి సిపిఎం ఎంపిటిసిగా పోటీ చేస్తున్న నిమ్మక అప్పన్నను గెలిపించాలని గొట్టిపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ప్రచారం చేశారు. ఎచ్చెర్ల సిపిఎం జెడ్‌పిటిసి అభ్యర్థి పొందూరు చంద్రరావును గెలిపించాలని కోరుతూ స్థానిక శ్యాంపిస్టన్స్ ప్లాంట్-3 వద్ద గేటు మీటింగ్ నిర్వహించారు. మందస సిపిఎం జెడ్‌పిటిసి అభ్యర్థి రుష్యశృంగ బినితకుమారిని గెలిపించాలని మండలంలోని కొండలోగాం, సవరమధ్య, కరియాపల్లి, ఇంద్రాడవీధి, టంగరపుట్టి, కొత్తపల్లి, ముకుందపురం, బాలాజీపురం, మూలిపాడు, సొండిపూడి తదితర గ్రామాల్లో ప్రచారం సాగింది. నందిగాం మండలంలోని హరిదాసుపురం సిపిఎం ఎంపిటిసి అభ్యర్థి పాలిన సాంబమూర్తి హరిదాసుపురం, మర్లపాడు, పి.వి పురం, చెరుకుపల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు.
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాత వీరాపురం ఎంపిటిసి అభ్యర్థి చల్లా సరళకు మద్దతుగా సిపిఎం నాయకులు ప్రచారం నిర్వహించారు. బుచ్చినాయుడు కండ్రిగ మండలం నేర్పాకోట, కంచన పుత్తూరు ఎంపిటిసిలుగా పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులు ఎన్.రమణయ్య, కె.రమణయ్య ఇంటింటి ప్రచారం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు గ్రామంలోని రెండు సెగ్మేంట్‌లలో సిపిఎం ఎంపిటిసి అభ్యర్థులుగా పోటీ చేసిన గరికపాటి సురేష్, వంజి వాక సరితలను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు సిపిఎం జెడ్‌పిటిసి అభ్యర్థి అశ్రియ్య గెలుపును కాంక్షిస్తూ విస్సాకోడేరులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరసాపురం జెడ్‌పిటిసి అభ్యర్థిని కవురు లక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ గొంది, చిట్టవరం గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం జెడ్‌పిటిసి అభ్యర్థి తెల్లం నాగమణి, కెఆర్‌పురం ఎంపిటిసి అభ్యర్థి పోలోజు నాగేశ్వరరావులను గెలిపించాలని కోరుతూ కెఆర్‌పురం, పులిరాముడుగూడెం, రవ్వారిగూడెం పంచాయతీలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.








కామెంట్‌లు (0)