టీడీపీ శ్రేణులపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
ప్రజాశక్తి-పులివెందుల: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. వైసీపీ సానుభూతిపరులకు చెందిన చికెన్ సెంటర్కు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించడంతో అక్కడి సామగ్రితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందిస్తూ, విధ్వంసానికి టీడీపీ అనుచరులే కారణమని ఆరోపించారు. అగ్నిప్రమాదానికి గురైన చికెన్ సెంటర్ను ఆయన పరిశీలించారు. అర్ధరాత్రి సమయంలో పులివెందులలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. పెట్రోల్ క్యాన్లతో చికెన్ సెంటర్లోకి ప్రవేశించి నిప్పంటిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. పోలీసులు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.








కామెంట్లు (0)