శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅక్రమాలు జరిగిన చోట రీ నోటిఫికేషన్‌ ఇవ్వాలి..

3 గంటల క్రితం

అక్రమాలు జరిగిన చోట 
రీ నోటిఫికేషన్‌ ఇవ్వాలి
- నామినేషన్ల ప్రక్రియను రద్దు చేయాలి
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌కు సిపిఎం, సిపిఐ వినతి
- పోలీసులే దగ్గరుండి దౌర్జన్యాలకు సహకరించారని వెల్లడి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 12:51 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

  • మళ్లీ నామినేషన్లకు అవకాశమివ్వాలి

  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌కు సిపిఎం, సిపిఐ వినతి

  • పోలీసులే దగ్గరుండి దౌర్జన్యాలకు సహకరించారని వెల్లడి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : మున్సిపల్, ఎంపిటిసి, జెడ్‌‌పిటిసి ఎన్నికల నామినేషన్లను అడ్డుకున్నచోట ఇప్పటి వరకు నిర్వహించిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని సిపిఎం, సిపిఐ రాష్ట్ర నాయకులు.. ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ ‌చంద్ర పునేఠాను కోరారు. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి రమాదేవి, వై వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ శనివారం వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు సంఘటనలపై వీడియోలతో సహా చూపించి జరుగుతున్న పరిణామాలను వివరించారు. అన్ని ఏకగ్రీవాలు అయినా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదని అడిగారు. దీనిపై రికార్డెడ్‌ ఎవిడెన్స్‌ ‌కావాలని నాయకులను ఎన్నికల అధికారులు కోరారు. పలుచోట్ల డిఎస్‌‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు కూడా నాయకులపై దాడులకు దిగుతున్నారని వివరించారు. గుంటూరు జిల్లా క్రోసూరులో ఎస్‌ఐ.. సిపిఎం నాయకుడి చేయి విరగ్గొట్టాడని, ఆర్‌ఒ కృష్ణ నామినేషన్‌ ‌తీసుకోకుండా వేధింపులకు గురిచేసి సమయం అయిపోయిందని తెలిపారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నామినేషన్ల ప్రక్రియలో పోలీసులే దగ్గరుండి ప్రతిపక్ష నాయకులను అడ్డుకుంటున్నారని వివరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పదుల సంఖ్యలో రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ‌కార్యాలయాల్లోకి చేరి ఇతరుల నామినేషన్‌ ‌పత్రాలు లాక్కుని చించేస్తున్నారని, వారికి పోలీసులు సహకరిస్తున్నారని, దగ్గరుండి చూస్తూ ఊరుకున్నారే తప్ప కనీసం చర్యలు తీసుకోలేదని పునేఠాకు వివరించారు. పలు జిల్లాల్లో నామినేషన్లు వేసిన వారిని విత్‌‌డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. బయట ప్రాంతాల నుండి రౌడీలను తీసుకొచ్చి కొట్టిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా.. పూర్తి అధికారాలు ఉండి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏమి చేస్తుందని ప్రశ్నించారు. దీనికి సంబంధించి పలు ఆధారాలు చూపించారు. నామినేషన్లకు అడ్డుపడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా కోయ ప్రవీణ్‌‌ను ఎన్నికల విధుల్లోంచి తప్పించాలని, ఆయన వ్యవహారశైలి అన్యాయంగా ఉందని, ఉన్నతాధికారిగా కాకుండా అధికార పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నారని తెలిపారు.

అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అన్యాయాలు జరిగాయని స్పష్టంగా చెప్పినా ఎంపిటిసి, జెడ్‌‌పిటిసి ఎన్నికల్లో మరలా అదే తంతు జరిగిందని అన్నారు. సిపిఎం, సిపిఐకి చెందిన అనేక మంది నామినేషన్లు వేయలేకపోయారని, అటువంటి చోట్ల గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ ‌రద్దుచేసి మరలా నోటిఫికేషన్‌ ఇచ్చి నామినేషన్లు స్వీకరించి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కేరళం రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కూడా ఫోన్‌‌ చేసి ఎన్నికల తీరుపై ఎపిలో ఉన్నారా? బీహార్లో ఉన్నారా? అని ప్రశ్నించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. రాయలసీమ జిల్లాల పరిధిలో అనేక ఘటనలు జరిగాయని, సిపిఎం, సిపిఐ వారిని కూడా నామినేషన్లు వేయనీయలేదని తెలిపారు. చిత్తూరు జిల్లాలో సిపిఎం జిల్లా కార్యదర్శిని ఎమ్మెల్యే మురళీ కిడ్నాప్‌ ‌చేశారని, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే సాయంత్రానికి వదిలారని అన్నారు. సిఐటియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఆవులయ్యను బయట నుండి వచ్చినవారు కొట్టారని తెలిపారు. క్రోసూరులో ఆర్‌ఒ కృష్ణ రిటర్నింగ్‌ ‌కార్యాలయంలో తెలుగుదేశం కార్యకర్తలు బ్యాడ్జీలు పెట్టుకుని కూర్చున్నా అనుమతినిచ్చారని అన్నారు. ఫారాలు చించేసిన ఘటనను వీడియో తీస్తున్న వ్యక్తి చేయి ఎస్‌ఐ విరగొట్టారని అన్నారు. పామూరులో సిపిఎం తరపున మహిళ నామినేషన్‌ ‌వేసేందుకు వెళుతుంటే కొట్టి గాయపరిచారని అన్నారు. టిడిపి నాయకులు నామినేషన్‌ ‌పత్రాలు చించేస్తున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని అన్నారు. పోలీసులు కూడా అధికార పార్టీ తరపున వ్యవహారం నడుపుతున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని అన్నారు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పార్టీ చెప్పినట్లు పోలీసులు, ఆర్‌ఒలు తయారైతే వారే ఎన్నికలు డిక్లేర్‌ ‌చేసుకోవచ్చని, లిస్టు ప్రకటిస్తే సరిపోతుందని, ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌ ‌కూడా చర్యలు తీసుకోవడంలో విఫలమైతే ఏమి చేయాలో పార్టీలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అన్యాయంగా ఉందని, ఎవరు నామినేషన్ వేయాలో వద్దో కూడా వారే చెబుతున్నారని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో కార్పొరేషన్లలో మెజార్టీ స్థానాల్లో ఏకగ్రీవాలు చేసి అతి తక్కువ వార్డుల్లోనే నామినేషన్లు తీసుకునేందుకు అనుమతించారని, దీనివల్ల ఫలితాల్లో మార్పులు లేవని, అధికార పార్టీకి అనుకూలంగానే తీర్పులొస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని తెలిపారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ఎన్నికల కమిషన్‌ ‌చోద్యం చూస్తుందే తప్ప పట్టించుకోలేదని అన్నారు. దాడులకు సంబంధించిన అన్ని అంశాలనూ ఎన్నికల కమిషన్‌ ‌దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు.


సిపిఎం, సిపిఐ అభ్యర్థులపై దాడులు

  • నామినేషన్‌ పత్రాలు చించివేత

  • ఎన్నికల కమిషనర్‌‌కు నాయకత్వం ఫిర్యాదు

  • ఫిర్యాదుల్లో కీలక అంశాలు

(1) తిరుపతి జిల్లా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 58వ వార్డులో ప్రతిపాదకుని ఓటు ఉన్నప్పటికీ అభ్యర్థి ఓటు లేదనే కారణంగా సిపిఎం అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించారు.

(2) చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ 27వ వార్డులో సిపిఎం అభ్యర్థి ఎం జయంతి నామినేషన్ వేయడానికి వెళ్లిన సందర్భంగా అధికారులు డిపాజిట్ డబ్బులు కట్టించుకోకుండా ఆలస్యం చేసి తరువాత సమయం అయిపోయిందని నిరాకరించారు. ఫలితంగా నామినేషన్ వేయలేదు.

(3) చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ అభ్యర్థిగా ఎస్ నాగరాజు 50వ డివిజన్ కార్పొరేటర్‌గా నామినేషన్ వేయగా, దానిని ధృవీకరిస్తూ అధికారులు పత్రం కూడా అందజేశారు. దానికి సంబంధించి ఎన్నికల సిబ్బందితో వీడియో కూడా తీశారు. కానీ తరువాత నాగరాజు సంతకం లేకుండా విత్‌డ్రా అయినట్లు అధికారులు ప్రకటించారు.

(4) అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీలో 19వ వార్డు సిపిఐ అభ్యర్థి బత్తుల అలివేణిని నామినేషన్ వేయనీయలేదు.

(5) పుంగనూరు మున్సిపాలిటీ వార్డులో పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి డి చందు భర్త మున్నాను జనసేన పార్టీ వారు ఇంటికిపోయి బెదిరింపులు, దాడిచేసే ప్రయత్నాలు చేశారు. ఎస్‌పికి ఫోన్‌ చేసినా ఫోన్ ఎత్తడం లేదు.

(6) పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో 25వ వార్డు, 27వ వార్డుల్లో సిపిఐ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి మందపాటి రమాదేవి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ వారు అడ్డుకున్నారు.

(6) కడప కార్పొరేషన్‌లో 4 (సుబ్బారాయుడు), 18 (వడ్ల భాగ్యలక్ష్మి), 26 (జి వేణుగోపాల్), 27 (ఎన్‌ వెంకట సుధ), 53 (కెసి బాదుల్లా), 64 (కె మునయ్య) డివిజన్‌లలో సిపిఐ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.

(7) కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ 5 (ముణిరత్నం), 12 (సీలి స్వాతి), 17 (పొంగూరు సుజాత), 20 (జిఎల్ నర్సింహులు), 21 (పెదుల్లపల్లి మేరీ), 23 (నాగమణి) వార్డుల్లో కార్పొరేటర్‌ అభ్యర్థులుగా, చైర్మన్‌గా వి వీరశేఖర్‌ను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు.

(8) కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 37వ వార్డు సిపిఐ అభ్యర్థి బోనాల రామలతను నామినేషన్ వేయనీయలేదు. జమ్మలమడుగు 6, 7వ వార్డుల్లో సిపిఐ అభ్యర్థి మిడితూరు ప్రసాద్‌, నాగేంద్రను నామినేషన్ వేయనీయలేదు.

(9) కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కౌన్సిలర్‌గా సిపిఐ అభ్యర్థి నామినేషన్ వేసిన తరువాత జనసేన నాయకులు కిడ్నాప్ చేశారు.

ఎంపిటిసి, జెడ్‌పిటిసి స్థానాల్లో

(1) కర్నూలు జిల్లా కౌతాలం మండల కేంద్రం ఎంపిటిసి స్థానానికి, ఎరికేరి ఎంపిటిసి స్థానానికి సిపిఎం అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ముందే టిడిపి నాయకులు ఇళ్ళకు వెళ్ళి బెదిరించి నామినేషన్ వేయకుండా చేశారు.

(2) కర్నూలు జిల్లా కొసిగి మండలం 5వ, 6వ ఎంపిటిసి స్థానాలకు నామినేషన్ వేసేందుకు వెళ్లిన సిపిఎం అభ్యర్థులను టిడిపి నాయకులు దౌర్జన్యంగా నామినేషన్ పత్రాలను గుంజుకొని చించేశారు. స్థానిక సిఐని రక్షణ కల్పించాలని కోరినా స్పందన లేదు.

(3) కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కొసిగి మండలి ఎంపిటిసి సిపిఐ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు.

(4) పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఉటుకూరు, ఎర్రబాలెం, పెరికపాడు స్థానాలకు నామినేషన్లు వేసేందుకు ఉదయం 10 గంటలకే వెళ్ళిన సిపిఎం అభ్యర్థుల నుండి నామినేషన్లు తీసుకోకుండా రిటర్నింగ్ ఆఫీసర్ వి కృష్ణ తిరస్కరించారు. నాలుగు గంటల వరకు వేచి ఉంచి చివరకు తీసుకోలేదు. ఆర్‌ఒ వ్యవహరించిన ఫలితంగా ఆయన సమక్షంలోనే టిడిపి నాయకులు దౌర్జన్యం చేసి, నామినేషన్ పత్రాలు చించి ఆఫీసు నుండి తరిమేశారు. అడ్డుకున్న సిపిఎం నాయకులు లక్ష్మీశ్వరరెడ్డి, నాయక్‌లపై పోలీసులు దాడి చేశారు.

(5) నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం నందిపాడు ఎంపిటిసి సిపిఐ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు.

(6) నర్సరావుపేట రొంపిచర్ల మండలం మాచవరం ఎంపిటిసి సిపిఐ అభ్యర్థి రొడ్డా అంజిరెడ్డి నామినేషన్ వేయడానికి వెళితే టిడిపి కార్యకర్తలు నామినేషన్ పత్రాలు చించేశారు.

(7) వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి ఎంపిటిసి సిపిఐ అభ్యర్థి ధరివేముల సలోమి నామినేషన్ పత్రాలను టిడిపి కార్యకర్తలు చించేశారు.

(8) మార్కాపురం జిల్లా పామూరు 1వ, 2వ ఎంపిటిసిలకు సిపిఐ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకొని నామినేషన్ పత్రాలు చించేశారు.

(9) మార్కాపురం జిల్లా పామూరులో సిపిఎం 5వ ఎంపిటిసి అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను టిడిపి నాయకులు చించి, మహిళలను గాయపర్చి అసభ్యంగా మాట్లాడుతూ దాడి చేశారు.

(10) మార్కాపురం జిల్లా కనిగిరి మండలం ఎరువారిపల్లె మండల పరిషత్‌కు సిపిఐ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు.

(11) అన్నయయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం ములకల చెర్వు మండలం బురకాయలకోట ఎంపిటిసి సిపిఐ అభ్యర్థి మంచాల హరికుమార్ నామినేషన్‌‌ను చించేశారు. తరువాత జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు నామినేషన్ పత్రం పూర్తిచేసి వేయించారు.

(12) అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కొట్టాల ఎంపిటిసి (ఎస్‌సి జనరల్) సిపిఐ అభ్యర్థిగా సూర్యనారాయణ నామినేషన్ వేయగా టిడిపి వారు పోలీసులు, ఎన్నికల అధికారుల ముందే కులధృవీకరణ పత్రాన్ని చించేశారు. స్క్రూటినీ సందర్భంగా క్యాస్ట్ సర్టిఫికెట్ సమర్పించేందుకు వెళ్తున్నారు. దీనిని అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేశారు. దీనిని పరిశీలించి ఈ వార్డులో ఎన్నిక ఆపివేసి నామినేషన్ వేయడానికి అవకాశం కల్పించాలి.

(13) కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఉప్పలపాడు ఎంపిటిసిగా సిపిఐ అభ్యర్థి రామ్‌ప్రసాద్‌ను, కొండాపూర్ మండల కొండాపురం ఎంపిటిసి అభ్యర్థిగా మనోహర్‌బాబును నామినేషన్ వేయనీయలేదు.

(14) తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం కోబాక ఎంపిటిసి (ఎస్‌‌సి) సిపిఐ అభ్యర్థి టి రమేష్ నామినేషన్‌ను అడ్డుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్