ఎన్నికల కమిషనర్‌కు వైసిపి ఫిర్యాదు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కూటమి ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతూ, వ్యవస్థలను ఉపయోగించుకుంటూ, బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వైసిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టిజెఆర్ సుధాకర్‌బాబు సోమవారం ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలున్నా నామినేషన్ల పరిశీలన, అప్పీళ్లలో వైసిపి అభ్యర్థులకు న్యాయం జరగడం లేదన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కొన్ని ధ్రువపత్రాలు అవసరం లేదని చెబుతున్నా, సంతకం వేరేచోట పెట్టారని, భార్య ఆస్తుల వివరాలు లేవని, అప్పుపై వడ్డీ వివరాలు రాయలేదని వింత కారణాలతో నామినేషన్లు తిరస్కరిస్తున్నారని తెలిపారు. పోలీసులు టిడిపి ఏజెంట్లలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులను బెదిరించడం, అక్రమంగా అరెస్టు చేయడం, కొట్టడం, ప్రచారానికి అడ్డంకులు సృష్టించడం వంటి చర్యలకు దిగుతున్నారని అన్నారు. నక్కిరేకల్‌లో జెడ్‌పిటిసి అభ్యర్థి కందుల హనుమాయమ్మ భర్త లక్ష్మారెడ్డిని అర్ధరాత్రి తీసుకెళ్లి ఎక్కడ ఉంచారో కూడా పోలీసులు చెప్పడం లేదని పేర్కొన్నారు. రేపల్లె ప్రాంతంలో కొక్కిలగడ్డ భూలక్ష్మి నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని పోలీసులు వేధిస్తున్నారని, తాడిపత్రిలో ఇళ్లపై దాడులు, వాహనాల ధ్వంసం జరుగుతున్నా పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసే పరిస్థితి లేకుండా చేస్తున్నారని అన్నారు. బి-ఫారాలు సమర్పించినా రసీదులు ఇవ్వడం లేదని, నెల్లూరులో అప్పీల్‌లో అభ్యర్థుల వాదనలు వినకుండా, రికార్డు చేయకుండా నామినేషన్లను తిరస్కరిస్తున్నారని చెప్పారు. వైసిపి పేరుతో సంబంధం లేని వ్యక్తులు నకిలీ నామినేషన్లు వేస్తున్నారని, బ్యాలెట్ పేపర్‌లో రాజకీయ పార్టీల గుర్తులు ఉండకూడదనే సర్క్యులర్ స్థానిక సంస్థల ఎన్నికల స్వరూపాన్నే ప్రశ్నార్థకం చేస్తోందని అన్నారు.








కామెంట్‌లు (0)