తిరగబడండి... తోడుగా ఉంటా
సెప్టెంబర్లో పాదయాత్ర ప్రారంభం
వైసిపి శ్రేణులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ప్రజాశక్తి- పులివెందుల టౌన్ (వైఎస్ఆర్ కడప)
‘తిరగబడండి... తోడుగా ఉంటాను. రక్షకుడే దౌర్జన్యం చేస్తే రక్షించేది ఎవరు? అన్యాయం చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టను. వైసిపి కార్యకర్తలపై వేటు వేస్తే నాపై వేసినట్టే. నామినేషన్ల పత్రాలు లాక్కున్నట్లే ఆస్తి పత్రాలూ లాక్కుంటారు’ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అన్నారు.
సెప్టెంబర్ లో పాదయాత్ర చేస్తానని తెలిపారు. మంగళవారం ఆయన పులివెందులలో వైసిపి నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహా భారతంలోని శకునిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు చెప్పినా అధికార పార్టీ నాయకులు, అధికారుల తీరు మారలేదన్నారు. తమ పార్టీ వారిని నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకొన్నారని, గెలిచామని చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. నామినేషన్లు వేయడానికి వెళ్లిన వారిపై తుపాకులతో పోలీసులు 37 రౌండ్లు కాల్పులు జరిపారని, పులివెందుల నామినేషన్ కేంద్రం వద్ద జరిగిన ఘటన చూస్తే గుండె తరుక్కుపోతుందన్నారు. ఇద్దరి కాళ్లకు గాయాలయ్యాయని తెలిపారు. 20 స్టన్ షెల్స్, 40 స్మోక్ షెల్స్, ఏడు హ్యాండ్ గ్రెనేడ్లు ఉపయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పులివెందులలో 924 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టారని తెలిపారు. వచ్చేది మా ప్రభుత్వమేనని, దీనికి వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ఎన్నికల కమిషన్, పోలీసులు అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘గతంలో పోలింగ్ బూతులను ఆక్రమించి రిగ్గింగ్ చేసుకోవడం చూశాం. నామినేషన్ కేంద్రాలను హైజాక్ చేయడం ప్రస్తుతం చూస్తున్నాం’ అని అన్నారు. సూపర్ 6 లేదు... సూపర్ 7 లేదు... ఇచ్చిన హామీలు అన్ని జీరో చేసి ప్రజల్లోకి వెళ్లలేక చంద్రబాబు మహాభారతంలో శకునిలా మాయాపాచికలు ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ప్రాదేశిక ఎన్నికల్లో కూడా నామినేషన్లను వేయనీయకుండా అడ్డుకున్నారని, మరికొన్ని చోట్ల స్ర్కూట్నీలో అర్ధరాత్రి నామినేషన్లు తిరస్కరించి ఏకగ్రీవం చేసుకున్న ఘనత ఆయనకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పులివెందులలో గెలుపు కోసం కార్యకర్తలు అందరూ సమష్టిగా పోరాడాలని కోరారు. ఎన్నికల రోజు తాను పులివెందులలోనే తాను ఉంటానన్నారు. కార్యక్రమంలో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, వైసిపి నాయకులు వైఎస్ మనోహర్ రెడ్డి, దుష్యంత్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








కామెంట్లు (0)